‘సూపర్' వైద్యం
సాక్షి, గుంటూరు
గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయా... ప్రైవేట్ యాజమాన్యం ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఇక్కడే ఏర్పాటు కానున్నాయా...అవుననే అంటున్నాయి వైద్య వర్గాలు. ఇప్పటివరకు కార్డియాలజీ, న్యూరాలజీ, రేడియాలజీ విభాగాలకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే ఒక్క ఆసుపత్రీ సీమాంధ్రలో లేదు. హైదరాబాద్‌లో కేంద్రీకృతమై ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రాలో తమ శాఖల ఏర్పాటుకు నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.
రాష్ట్ర రాజధాని గుంటూరు- విజయవాడ మధ్యే ఏర్పాటవుతుందని నిర్దారించుకుంటున్న సూపర్ స్పెషాలిటీ వైద్యశాలల నిర్వాహకులు అనేక మంది ఇక్కడే తమ శాఖల ఏర్పాటుకు నిర్ణయించుకున్నారు.
రాజధానికితోడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఎయిమ్స్’ కూడా మంగళగిరిలో ఏర్పాటు చేస్తే గుంటూరు- విజయవాడ ప్రాంతం మెడికల్ హబ్‌గా మారే అవకాశం ఉందని గుర్తించారని అంటున్నారు.
సీమాంధ్రలో పెద్దపెద్ద ఆసుపత్రులు ఎక్కువగా గుంటూరు, విజయవాడ నగరాల్లోనే ఉన్నాయి. అన్ని జిల్లాల నుంచి రోగులు ఇక్కడకు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తే సీమాంధ్రలోని అన్ని జిల్లాల ప్రజలకు అను కూలంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో అతి తక్కువ ఖర్చుతో వైద్య విద్య అభ్యసించి మంచి పేరున్న వైద్యులుగా ఎదిగిన ఎందరో ఇతరదేశాలతోపాటు, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూర్, కోల్‌కతా, చెన్నై, ముంబై వంటి మహానగరాల్లో సూపర్‌స్పెషాలిటీ వైద్యులుగా పనిచేస్తున్నారు. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటైతే వీరంతా తమ తమ సొంత ప్రాంతాల్లోనే వైద్య సేవలందించేందుకు వస్తారని భావిస్తున్నారు.
ఇప్పటికే గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో గుండెవైద్య విభాగంలో పీపీపీ పద్ధతి ద్వారా గుండె ఆపరేషన్‌లు నిర్వహించేందుకు ప్రముఖ వైద్యులు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే ముందుకు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. ఆయన బాటలోనే మరికొందరు ఇక్కడకు వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు చెబుతున్నారు.
భూముల కొనుగోలు పూర్తి... నూతన రాజధాని గుంటూరు- విజయవాడ మధ్య ఏర్పాటు కానుందని భావించిన అనేక మంది వైద్య ప్రముఖులు ఈ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి అవసరమైన భూములను ముందుగానే కొనుగోలు చేశారు.
రాజధాని ఎక్కడ ఏర్పాటైనా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను మాత్రం విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు వీటి మధ్య ఉన్న మంగళగిరి, తాడేపల్లి, పెదకాకాని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఇప్పటికే వేల కోట్ల రూపాయల వ్యయంతో గుంటూరులో ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.
అతిపెద్ద కార్పొరేట్ ఆసుపత్రులుగా పేరొందిన అపోలో, యశోదా, మెడ్విన్, కామినేని వంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు విజయవాడ-గుంటూరు నగరాల మధ్య భూముల కొనుగోలు పూర్తయిందంటున్నారు. వీటి రాకతో గుంటూరు, కృష్ణా జిల్లాలతోపాటు సీమాంధ్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానుండటం ఆనందించవలసిన విషయమే.