Neurology
-
వాతావరణ మార్పులతో ‘బ్రెయిన్ స్ట్రోక్’
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న ఉష్ణోగ్రతలతో స్ట్రోక్ మరణాలు, పక్షవాత వైకల్య బాధితులు పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. దాదాపు మూడు దశాబ్దాల డేటాను విశ్లేషించడం ద్వారా వాతావరణ మార్పులతో స్ట్రోక్ ప్రమాదం ముడిపడి ఉన్నట్టు నిర్ధారించారు. 2019లో 5.20 లక్షలకు పైగా స్ట్రోక్ మరణాలపై శీతల గాలులు, మండే వేడి తరంగాలు తీవ్ర ప్రభావం చూపాయని న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురించిన కొత్త అధ్యయనం వెల్లడించింది. స్ట్రోక్ మరణాల్లో అధిక భాగం 4.70 లక్షల కంటే ఎక్కువ మరణాలు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో సంభవించినప్పటికీ.. 1990తో పోలిస్తే అధిక ఉష్ణోగ్రతల పెరుగుదలతో మరణించిన వారి సంఖ్య స్వల్పంగా పెరిగినట్టు కనుగొంది. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావంనాటకీయ ఉష్ణోగ్రత మార్పులు మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని చైనాలోని చాంగ్షాలోని జియాంగ్యా హాస్పిటల్ సెంట్రల్ సౌత్ వర్సిటీకి చెందిన అధ్యయనం నివేదిక చెబుతోంది. అధిక ఉష్ణోగ్రత కారణంగా స్ట్రోక్ ప్రమాదం వేగంగా పెరుగుతోందని, పదేళ్లు దాటిన వారితో పాటు ఆఫ్రికా వంటి వెనుకబడిన దేశాల్లో ప్రమాదం పొంచి ఉందని అధ్యయనం స్పష్టం చేస్తోంది. వృద్ధాప్యం కూడా స్ట్రోక్ ప్రమాదాన్ని సూచిస్తున్నాయని పేర్కొంది. భారతదేశంలో సరైన ఉష్ణోగ్రతలు లేని కారణంగా 33 వేల స్ట్రోక్ మరణాలు సంభవిస్తే.. వాటిల్లో 55 శాతం ఉష్ణోగ్రతలు పెరగడంతో, 45 శాతం ఉండాల్సిన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం ప్రధాన కారణమని విశ్లేషించింది. పురుషుల్లోనే ఎక్కువఉష్ణోగ్రతల్లో మార్పులతో పక్షవాతం వచ్చి మరణించే వారి సంఖ్య ప్రతి లక్ష మందిలో 5.9 శాతం మంది మహిళలు కాగా.. పురుషుల్లో 7.7 శాతం ఉన్నట్టు అధ్యయన బృందం తేల్చింది. మధ్య ఆసియాలో లక్ష మందిలో 18 మంది అనుకూలంగా లేని (నాన్–ఆప్టిమల్) ఉష్ణోగ్రతల కారణంగా అత్యధిక స్ట్రోక్‌కు మరణాల రేటు నమోదైంది. శిలాజ ఇంధనాల దహనం, అటవీ నిర్మూలన, పారిశ్రామిక కాలుష్యం వాతావరణాన్ని పెను ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ముప్పును తగ్గించే లక్ష్యంతో ప్రపంచ దేశాలు పని చేయాలని సూచిస్తోంది.ఎందుకు జరుగుతోందంటే..!చల్లని ఉష్ణోగ్రతలు మానవ శరీరంలోని సునిశిత నాడీ వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు రక్తనాళాల్లో అధిక రక్తపోటును పెంచి స్ట్రోక్‌లకు దారి తీస్తోందని అధ్యయన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతలో వేడి ఉష్ణోగ్రతలు నిర్జలీకరణానికి కారణమవుతాయని.. తద్వారా రక్తం చిక్కబడటం (క్లాట్స్) వల్ల స్ట్రోక్ ప్రమాదాలు సంభవిస్తాయని పేర్కొన్నారు. -
అరెరె.. మర్చిపోయా!
‘‘అతనూ.. మన ఆఫీస్‌లో పనిచేస్తాడే.. పేరేంటో మర్చిపోయానబ్బా’’ ‘‘నిన్ననే నెట్‌ఫ్లిక్స్‌లో చూశా సినిమా చాలా బాగుంది.. పేరేంటంటే, నోట్లో నానుతూనే ఉంది.. గుర్తు రావడం లేదు’’ ‘‘మమ్మీ.. బైక్ కీస్ కనపడటం లేదు, కాస్త చూడు ఎక్కడ పెట్టానో గుర్తురావడం లేదు’’ ఇలాంటి మాటలు మీరు తరచుగా అంటుంటే.. లేదా ఎవరి నుంచైనా వింటుంటే.. సిల్లీగా తీసుకోకండి. ఎందుకంటే ఇది కూడా ఒక వ్యాధి. దాని పేరు సూడో డిమెన్షియా! బాగా తెలిసిన వ్యక్తుల పేర్లను మర్చిపోవడం, మన బండి తాళాలను తరచుగా వెతుక్కోవడం, ఒకటి రెండ్రోజుల క్రితం చూసిన సినిమా పేరు కూడా గుర్తు లేకపోవడం.. ఈ లక్షణాలను వైద్యులు ‘సూడో–డిమెన్షియా’గా పేర్కొంటున్నారు. డిమెన్షియా అనేది ఓ వయసు దాటాక వృద్ధాప్యంలో చుట్టుముట్టే వ్యాధి కాగా.. ప్రస్తుతం యువతపై కూడా ఇది ప్రభావం చూపుతోంది. దీని బారిన పడిన రోగులకు తరచుగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి లోపించడం నిరాశ లేదా అతిగా ఆలోచించడం వంటి లక్షణాలు ఉంటాయి. కేసులు పెరుగుతున్నాయి... ప్రధానంగా అధిక ఒత్తిడి, మల్టీ టాస్కింగ్, తద్వారా చోటు చేసుకుంటున్న నిస్పృహ, నిరాశ.. వంటివి ఈ పరిస్థితికి కారణం. ఫోర్టీస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన న్యూరాలజీ డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ గుప్తా మాట్లాడుతూ, ‘‘యువతలో గణనీయంగా మతిమరుపు కేసులు పెరుగుతున్నాయి. ఇటువంటి సమస్యల నుంచి పరిష్కారం కోరుతూ నెలలో కనీసం 5–10 మంది వరకూ 50 ఏళ్ల లోపు వారు మమ్మల్ని సంప్రదిస్తున్నారు’’అని చెప్పారు. ‘‘ప్రస్తుతం యువతలో కెరీర్–సంబంధిత ఒత్తిడి బాగా ఉంటోంది. తద్వారా అధిక పనిభారం సర్వసాధారణమైంది. సోషల్ స్టేటస్ గురించి ఆందోళన కూడా దీనికి తోడవుతోంది. ఇలాంటివన్నీ మెదడుపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి, అది సమాచారాన్ని పూర్తిగా ప్రాసెస్ చేయడమనే దాని విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తుంది, ఎక్కువ సమయం పాటు ప్రాసెసింగ్ చేసే ‘మల్టీ టాస్కింగ్’కూడా జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేస్తుంది’’అని డాక్టర్ గుప్తా చెప్పారు. మెమొరీ.. మెదడే దారి.. ‘‘ఓ విషయంపై శ్రద్ధ పెట్టడం, దాన్ని స్వీకరించడం అనంతరం దాన్ని నిలుపుకోవడం.. ఇలా జ్ఞాపకశక్తి మూడు భాగాలుగా రూపుదిద్దుకుంటుంది. దీనిలో ప్రతి దశకు మెదడు నుంచి సహకారం అవసరం, కానీ అధిక స్థాయి పని ఒత్తిడి దాని పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సూడో డిమెన్షియా వెనుక కారణాల గురించి తెలుసుకున్న తర్వాత కొద్దిపాటి ప్రయత్నం ద్వారా దాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఏకాగ్రత సాధించేందుకు ప్రయత్నించడం, డిప్రెషన్‌కు చికిత్స తీసుకోవడం వల్ల పరిస్థితి మెరుగుపడుతుంది, ఆందోళన తగ్గుతుంది’’అని గుప్తా వివరించారు. – సాక్షి, సిటీబ్యూరో ‘‘ఈ తరహా లక్షణాలతో నెలకు 10–12 మంది రోగులు వస్తున్నారు. పని ఒత్తిడి, అతిగా ప్రతికూల ఆలోచనలు, ఒకే సమయంలో అనేక పనులు చేయాలనే మల్టీ టాస్కింగ్.. ఇతరులతో సమస్యల కారణంగా మానసిక ఆందోళన పెరుగుతుంది. మనసులో తెలియని ఆరాటం, ఆత్రుత ఉన్నప్పుడు, అనేక రకాల పనులు చేయలేం. కౌన్సెలింగ్ సెషన్లు, కాగి్నటివ్ బిహేవియరల్ థెరపీ రిలాక్సేషన్లు ఈ పరిస్థితితో బాధపడుతున్న వ్యక్తులు కోలుకోవడానికి సహాయపడతాయి’’. – డాక్టర్ ఆర్తీ ఆనంద్, ప్రముఖ సైకాలజిస్ట్ -
పదేళ్ల బాలుడికి పునర్జన్మ
గుంటూరు మెడికల్: ఆడుతూ పాడుతూ ఉండాల్సిన పదేళ్ల బాలుడు అకస్మాత్తుగా జీబీ సిండ్రోమ్ వ్యాధి బారిన పడ్డాడు. రెండు నెలలపాటు పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేసినా బాలుడి ఆరోగ్యం మెరుగుపడకపోగా, మరింత క్షీణించింది. వెంటిలేటర్‌పై ఉంచి తీసుకొచ్చిన ఆ బాలుడికి గుంటూరు జీజీహెచ్‌లోని న్యూరాలజీ వైద్యులు సకాలంలో సరైన వైద్యం అందించి పునర్జన్మను ప్రసాదించారు. దీంతో బాలుడి తండ్రి ఆనందంతో న్యూరాలజీ వైద్య విభాగంలో గురువారం కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని చాకలికుంట తండాకు చెందిన మూడావత్ రాజానాయక్, మంగాబాయి దంపతుల కుమారుడు వగ్యానాయక్(10) ఐదో తరగతి చదువుతున్నాడు. వగ్యానాయక్కు రెండు నెలల క్రితం ముఖంపై వాపు వచ్చింది. అతడికి నరసరావుపేట, గుంటూరులోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. అన్ని ఆస్పత్రుల్లో కలిపి రూ.10లక్షలు వరకు ఖర్చు చేశారు. అయినా బాలుడు కోలుకోలేదు. రెండుసార్లు కార్డియాక్ అరెస్టయి ఆరోగ్యం మరింత క్షీణించి వెంటిలేటర్‌పై ఉన్న వగ్యానాయక్ను చివరికి ఈ నెల మూడో తేదీ అర్ధరాత్రి గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగానికి తీసుకొచ్చారు. తక్షణమే డ్యూటీలో ఉన్న పీజీ వైద్యులను అప్రమత్తం చేసి బాలుడిని ఐసీయూలోకి తరలించి వెంటిలేటర్ అమర్చి చికిత్స అందించామని న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి తెలిపారు. వారం రోజులపాటు వెంటిలేటర్‌పై చికిత్స అందించిన తర్వాత బాలుడు కోలుకోవడం ప్రారంభమైందని చెప్పారు. ఈ బాలుడికి అరుదుగా సంభవించే గులియన్‌బెరి సిండ్రోమ్ (జీబీ సిండ్రోమ్) సోకినట్లు నిర్ధారించామన్నారు. రోజుకు రూ.లక్ష విలువైన ఇంజక్షన్లు చేశామని, కేవలం ఇంజక్షన్లకు రూ.ఆరు లక్షలకు పైగా ఖర్చు అయినట్లు వెల్లడించారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సుమారు రూ.10 లక్షలు ఖర్చు అయ్యే వైద్యాన్ని బాలుడికి ఉచితంగా చేసి ప్రాణాలు కాపాడామని, ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడని వివరించారు. -
మెదడు గురించీ ఆలోచించాలి..బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణాలు
సాక్షి, అమరావతి: గుంటూరు నగరానికి చెందిన 26 ఏళ్ల యువకుడు ఓ ప్రైవేట్ షోరూమ్‌లో పనిచేస్తుంటాడు. ఇతనికి రెండు నెలల క్రితం మూతి వంకరపోవడంతో కుటుంబ సభ్యులు జీజీహెచ్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం)గా నిర్ధారణ అయింది. డిగ్రీ చదివే రోజుల నుంచే సురేశ్ సిగరెట్లు తాగేవాడు. రోజులు గడిచే కొద్దీ చైన్ స్మోకర్గా మారాడు. చిన్న వయసులోనే స్ట్రోక్‌కు గురికావడానికి పొగతాగడమే కారణంగా వైద్యులు గుర్తించారు. విశాఖపట్నం నగరానికి చెందిన 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ కరోనా కారణంగా గత ఏడాదిగా ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. రెండు వారాల క్రితం ఇంట్లో పనిచేస్తూ స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు తరలించగా వైద్య పరీక్షల అనంతరం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. తీవ్రమైన పని ఒత్తిడితో, నిద్రలేమి వంటి సమస్యల వల్ల స్ట్రోక్ వచ్చినట్టుగా గుర్తించారు. ఆలోచనల ఒత్తిడితో సతమతమయ్యే మెదడు గురించి కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆధునిక జీవన శైలి, దురలవాట్ల కారణంగా 20 నుంచి 45 ఏళ్ల మధ్య వయసులో కొందరు బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వారిలో బీపీ, షుగర్ నియంత్రణలో లేకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుండేది. అయితే ప్రస్తుతం నమోదవుతున్న 25 నుంచి 30 శాతం బ్రెయిన్ స్ట్రోక్ కేసుల్లో వ్యక్తుల వయసు 20 నుంచి 45 ఏళ్ల లోపు ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణాలు.. ► పొగతాగడం, మద్యం, గంజాయి, డ్రగ్స్ తీసుకోవడం. మద్యపానం, ధూమపానం అలవాటైన పదేళ్లకే పలువురిలో బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనబడుతున్నాయి. ► బీపీ, షుగర్లు నియంత్రణలో లేకపోవడం. శారీరక శ్రమ లేకపోవడం. ► మహిళలు నెలసరిని వాయిదా వేయడం. అధిక రక్తస్రావం నియంత్రణకు వైద్యుల సలహాలు తీసుకోకుండా మందులు వాడటం. ► ప్రస్తుతం కరోనా బారినపడి కోలుకున్న వారిలో 5 శాతం మంది బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నారు. రాష్ట్రంలో బీపీ, షుగర్, ఊబకాయం పరిస్థితి ఇలా.. ► మన రాష్ట్రంలో 30 ఏళ్లు నిండిన ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ, ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉంటోంది. ► గ్రామాల్లో 26 శాతం మంది, పట్టణాల్లో 30 శాతం మంది బీపీ బాధితులు, గ్రామాల్లో 19 శాతం మంది, పట్టణాల్లో 24 శాతం మంది షుగర్ బాధితులు. ► జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ఆధారంగా రాష్ట్రంలో 36.3 శాతం మంది మహిళల్లో, 31.3 శాతం పురుషుల్లో ఊబకాయం ఉంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► రోజూ 45 నిమిషాల నడకతో పాటు ఇతర వ్యాయామాలు చేయాలి. ► ఆహారంలో 25 శాతం పండ్లు, 30 శాతం కూరగాయలు, 25 శాతం పిండి పదార్థాలు, 20 శాతం ప్రొటీన్స్ ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్‌ను పూర్తిగా నియంత్రించాలి. ► శరీర బరువును నియంత్రించుకోవాలి. బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉంటే తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ► ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. రోజుకు ఆరు గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. స్ట్రోక్ రెండు రకాలు మెదడులోని రక్తనాళాల్లో రక్త ప్రసరణ సక్రమంగా లేకపోవడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలు చచ్చుబడటాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. రక్తనాళాలు చిట్లినప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. బీపీ, షుగర్, ఊబకాయం నియంత్రించుకోవడంపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల మన దేశంలో మధ్య వయసుల వారు స్ట్రోక్‌కు గురవ్వడం పెరుగుతోంది. కేజీహెచ్‌కు రోజుకు సగటున ఆరు కేసులు వస్తుంటాయి. – డాక్టర్ జి.బుచ్చిరాజు, న్యూరాలజీ విభాగాధిపతి, విశాఖ ఆంధ్ర మెడికల్ కళాశాల మూడు గంటల్లోపు ఆస్పత్రికి వస్తే.. గుంటూరు జీజీహెచ్‌లో ప్రత్యేకంగా స్ట్రోక్ యూనిట్ ఉంది. గతేడాది 614 మంది, ఈ ఏడాది ఇప్పటి వరకూ 416 మంది స్ట్రోక్ బాధితులకు చికిత్స అందించాం. ఈ ఏడాది కరోనా చికిత్స కారణంగా మే నెలలో అడ్మిషన్లు లేవు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా చికిత్స ఉంటుంది. స్ట్రోక్ వచ్చిన మూడు గంటల్లోపు రోగిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తే వైకల్యం లేకుండా చేయవచ్చు. – డాక్టర్ కె. సుందరాచారి, న్యూరాలజీ విభాగాధిపతి, గుంటూరు మెడికల్ కళాశాల -
‘సీఎం వైఎస్ జగన్‌కు సదా కృతజ్ఞుడినై ఉంటా’
గుంటూరు: సీఎం సహాయనిధి ఆ ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపింది. పరిపూర్ణ ఆరోగ్యవంతులను చేసింది. ఎన్నోఏళ్ల నుంచి గూనితో బాధపడుతున్న వారికి విముక్తి కల్పించింది. గుంటూరు కొత్తపేట నారాయణ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో ఈనెల 13, 14 తేదీల్లో న్యూరోమానిటరింగ్ సిస్టమ్ ద్వారా శస్త్రచికిత్సలు చేయించుకున్న కాంతారావు, వినోద్‌కుమార్ ఆనందంగా ఇళ్లకు వెళ్లారు. ఈ విషయాన్ని ఆస్పత్రి స్పయిన్ సర్జన్ డాక్టర్ దుంపా శ్రీకాంత్‌రెడ్డి బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఒక్కొక్కరికి రూ.ఏడు లక్షల ఖరీదైన ఆపరేషన్‌ను ఉచితంగా చేసినట్టు వివరించారు. శస్త్రచికిత్సకు 8 గంటల సమయం పట్టిందని, గూనిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఫిజియోథెరపీతోనే నయం చేయొచ్చని వెల్లడించారు. సమావేశంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ గుండం శివశ్రీనివాసరెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ హర్ష, క్రిటికల్‌కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ సింధు పాల్గొన్నారు. కాంతారావు కష్టాలకు ఇక చెల్లు ఈచిత్రంలో ఉన్న వ్యక్తిపేరు బి.కాంతారావు. వయసు 40 ఏళ్లు. ఊరు ఊటుకూరు. గూని వల్ల వెన్నుపూస పూర్తిగా ఒంగిపోయింది. రోజువారీ కూలీపనులు చేసుకునే ఇతను చాలా కష్టపడేవాడు. కొన్నిసార్లు కాలు జాలువారేది. ఊపిరి తీసుకోవడమూ కష్టమయ్యేది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న ఇతనికి సీఎం సహాయనిధి వరమైంది. ఎట్టకేలకు శస్త్రచికిత్స చేయించుకుని ఆరోగ్యవంతుడయ్యాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సదా కృతజ్ఞుడినై ఉంటానని చెబుతున్నాడు. జీవితమంతా ‘వినోద్’మే ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి పేరు వినోద్‌కుమార్. వయసు 17ఏళ్లు. ఊరు అమలాపురం. ఇంటర్ చదువుతున్నాడు. పుట్టుకతోనే గూని ఉంది. చిన్ననాటి నుంచి ఎంతో కష్టపడేవాడు. ఇటీవల నడుంనొప్పి, కాళ్ల తిమ్మిర్లు, సూదులు గుచ్చినట్టు ఉండడంతో తీరని వేదన అనుభవించాడు. వైద్యులను సంప్రదిస్తే ఆపరేషన్ చేయాలనడంతో ఆర్థిక స్తోమత లేక మిన్నకుండిపోయాడు. ఎట్టకేలకు సీఎం సహాయనిధి ఆయన జీవితంలో వెలుగులు నింపింది. ఆపరేషన్ చేయించింది. -
ర్యాడిక్యులోపతికి చికిత్స ఎంటో తెలుసా?
మెడలో ఉన్న వెన్నుకు సంబంధించిన ఎముకలు అరిగిపోయి... అవి దగ్గరగా రావడంతో వెన్నుపూసల నుంచి వచ్చే నరాలపై ఒత్తిడి పడటం వల్ల వచ్చే నొప్పిని ‘స్పాండిలోసిస్’ అంటారు. తొలిదశల్లో అందరూ ఈ నొప్పిని స్పాండిలోసిస్ అని గుర్తించక నొప్పినివారణ మందులు వాడుతుంటారు. అయితే వాటి వల్ల తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే వస్తుంది. ఆ తర్వాత నొప్పి యధావిధిగా మొదలై మళ్లీ మళ్లీ వస్తుంటుంది. కొద్దికాలం తర్వాత అంటే కొన్ని నెలలు లేదా ఏడాదీ రెండేళ్లలో ఈ నొప్పి మెడలోనే కాకుండా భుజానికి, చేతికీ పాకుతుంది. చివరగా అది బొటనవేలు, చూపుడువేలు లేదా మధ్యవేలు వంటి చోట్లకు కూడా పాకుతుంది. కొందరిలోనైతే వేళ్లలో కాస్తంత స్పర్శ తగ్గినట్లుగా కూడా అనిపించవచ్చు. తొలిదశలో అంటే మెడనొప్పి ఉన్న సమయాల్లోనే చికిత్స కొనసాగించి ఉంటే వ్యాధి మెడనొప్పికే పరిమితమవుతుంది. అలా వ్యాధి ముదిరినప్పుడు చేతులకూ, వేళ్లకూ పాకడం జరుగుతుంది. ఇలా చేతులకూ, వేళ్లవరకూ నొప్పి పాకుతూ స్పర్శ్ష కోల్పోయేంతవరకూ ముదిరిన పరిస్థితినీ, ఆ దశనూ వైద్యపరిభాషలో సీ–5, సీ–6 ర్యాడిక్యులోపతి గా చెప్పవచ్చు. ఇది స్పాండిలోసిస్ సవుస్య మరింత తీవ్రతరం కావడం వల్ల వచ్చే పరిణావుం. రాడిక్యులోపతి అంటే... వెన్నుపాము నుంచి బయటకు వచ్చే నరాలు వెన్నెవుుకల వుధ్యన నలిగిపోవడాన్ని ర్యాడిక్యులోపతి అని అంటారు. స్పాండిలోసిస్ సవుస్య తీవ్రం కావడంతో ఈ పరిస్థితి వస్తుంది. స్పాండిలోసిస్ సవుస్య స్టేజ్–1లో నొప్పి– భుజానికీ, చేతికీ పాకుతుంది. అదే స్టేజ్–2లో అయితే... ఆ నరం నుంచి సంకేతాలు అందే భుజం, చేయితాలూకు చర్మభాగం, చేతిలోని వేళ్లకు స్పర్శ కొంతమేర తగ్గిపోతుంది. ఇక అది స్టేజ్–3కి చేరితే ఆ నరం నుంచి సంకేతాలు అందే చేతి కండరాలు ఒకింత చచ్చుబడినట్లుగా అయిపోవడం, కొన్నిసార్లు మునపటి అంత చురుగ్గా వేళ్లు కదిలించలేకపోవడం వంటివి జరుగుతాయి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ సవుస్య ప్రస్తుతం స్టేజ్–2లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. చికిత్స: ర్యాడిక్యులోపతి చికిత్సలో భాగంగా నొప్పి నివారణ కోసం గాబాపెంటిన్–300ఎంజీ వంటి వూత్రలను నొప్పితీవ్రతను బట్టి రోజూ 2–3 వూత్రలు డాక్టర్ సలహా మేరకు వాడాల్సి ఉంటుంది. దీంతోపాటు అవసరాన్ని బట్టి, లక్షణాలను బట్టి డోలోకైన్ ఎస్సార్–200ఎంజీ వంటి నొప్పినివారణ వూత్రలనూ వాడాల్సి ఉంటుంది. నొప్పి నివారణ కోసం వాడే వుందులు చికిత్సలో ఒక ఎత్తయితే... ఈ సవుస్య ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వురొక ఎత్తు. నిజానికి ఈ జాగ్రత్తలే ఈ ర్యాడికలోపతి చికిత్సలో చాలా ప్రధానం. రాడిక్యులోపతిలో పాటించాల్సిన జాగ్రత్తలు బరువైన వస్తువ#లు ఎత్తకూడదు. అంటే నీళ్లబక్కెట్లు, సూట్‌కేసులు, బ్రీఫ్‌కేసులు, ల్యాప్‌టాప్‌లు మోయడం, పిల్లలను ఎత్తుకోవడం వంటి పనులు చేయకూడదు బరువ#లు ఎత్తే క్రవుంలో తలపైన బరువ#లు (వుూటలు, గంపలు వంటి అతి బరువైనవి) పెట్టుకోకూడదు పడుకునే సవుయంలో తలగడ కేవలం తల కింది వరకే కాకుండా భుజాల వరకూ ఉండేలా చూసుకోవాలి. దాంతో మెడకు కొంత సపోర్ట్ ఉంటుంది తలగడ అందుబాటులో లేకపోతే కనీసం ఒక బెడ్‌షీట్ నాలుగు ఇంచుల ఎత్తుగా ఉండేలా వుడత వేసి తల కింద పెట్టుకోవాలి. దాని మీద ఓ టర్కీ టవల్‌ను రోల్ చేసినట్లుగా చుట్టి మెడకింద పెట్టుకోవాలి. ఇలా వుూడు నెలల నుంచి ఆర్నెల్ల వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సవుస్య ఉన్నప్పుడు తలగడ లేకుండా పడుకోవడం అన్నది సరికాదు. తలగడ ఉండటం వల్లనే తప్పనిసరిగా మెడకూ, భుజాలకు సపోర్ట్ ఉంటుంది ఖాళీ సవుయాల్లో కూర్చుని ఉండేబదులు పడుకొని ఉండటం వుంచిది. ప్రస్తుతం మీరు స్టేజ్–2లో ఉన్నా... వుందులు, పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ సవుస్య దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. అయితే మీకు ఉన్న సవుస్య అదేనని నిర్ధారణ చేసుకునేందుకు వుుందుగా ఒకసారి ఎవ్మూరై సర్వైకల్ స్పైన్ పరీక్ష చేయించాల్సి ఉంటుంది. దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. -డాక్టర్ లలిత పిడపర్తి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ -
ఎయిమ్స్ పరీక్షలో దుబ్బాక డాక్టర్‌కు ఫస్ట్ ర్యాంక్
దుబ్బాక టౌన్: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ (ఎయిమ్స్) నిర్వహించిన న్యూరాలజీ సూపర్ స్పెషాలిటీ విభాగం ప్రవేశపరీక్షలో సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన డాక్టర్ బిల్ల సృజన జాతీయస్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 2020 ప్రవేశాలకు సంబంధించి ఎయిమ్స్ మంగళవారం రాత్రి ఈ ఫలితాలను ప్రకటించింది. డాక్టర్ సృజన దుబ్బాక పట్టణానికి చెందిన సుధాకర్, సకన్యల పెద్ద కుమార్తె. సుధాకర్ తెలంగాణ సెక్రటేరియట్ ప్లానింగ్ విభాగంలో రీసెర్చ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. సృజన భర్త డాక్టర్ ప్రణీత్ ఢిల్లీ ఎయిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సృజన ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, గాంధీ ఆసుపత్రిలో ఎండీ పూర్తి చేశారు. -
‘జీవన శైలి మార్చుకోవాలి’
మాదాపూర్ : ఆహారపు అలవాట్లను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ఆధ్వర్యంలో 27వ వార్షిక సదస్సు ఐయాన్‌కాన్–2019ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు మారిపోతున్న ఆహారపు అలవాట్లు, ఎప్పుడు కూర్చొని ఉండే మన జీవన శైలితో ప్రజలకు ప్రధానంగా భారత్ వాసులకు పెనుముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. గత రెండు దశాబ్దాలుగా సంభవించిన మరణాల్లో దాదాపు 55 శాతం కేవలం అంటువ్యాధులు, జీవన శైలి వ్యాధుల కారణంగా వచ్చినవే అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చని అన్నారు. దీనిపై భారత వాసులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఐయాన్‌కాన్ లాంటి సదస్సులు పలు జబ్బులపై ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని పెంచుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో న్యూరాలజీతో పాటు ఎన్నో రంగాలకు చెందిన వైద్య నిపుణులు పాలు పంచుకునేలా కృషి చేస్తున్న నిర్వాహక కమిటీ సేవలను ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ అధ్యక్షుడు డాక్టర్ సతీష్ ఖాదీల్కర్ కొనియాడారు. 18 దేశాల న్యూరో ఫిజీషియన్లు.. ఈ సదస్సులో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల నుంచి అనేక మంది న్యూరో ఫిజీషియన్లు ఇతర రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. ఈ సదస్సును బ్రెయిన్ అండ్ స్పైన్ సొసైటీ ఆ«ఫ్ ఇండియాతో కలిసి ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ వీలియం కరోల్, కిమ్స్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొలినేని భాస్కర్‌రావు, ఐయాన్‌కాన్–2019 నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ మోహన్‌దాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సీతాజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
హెచ్‌సీయూ విద్యార్థిని అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హిందీ సబ్జెక్ట్‌లో పీహెచ్డీ చేస్తున్న దీపికా మహాపాత్రో (29) బాత్రూమ్లో జారిపడి చనిపోయినట్లు తెలుస్తోంది. కాగా గత కొంతకాలంగా ఆమె న్యూరో సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. సోమవారం ఉదయం బాత్రూమ్కు వెళ్లిన దీపికా ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సహచర విద్యార్థినులు వెళ్లిచూడగా అప్పటికే ఆమె అపస్మారక స్థితిలో పడిఉండటాన్ని గమనించారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే దీపిక మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మందుల ధరలు దిగొచ్చాయోచ్..
తూప్రాన్, న్యూస్‌లైన్:అన్ని రకాల వస్తువుల ధరలు పెరగడంతో సతమతమవుతున్న సామాన్యుడికి మందుల ధరల్లో తగ్గుదల ఊరటనిస్తోంది. ప్రాణాపాయ, దీర్ఘకాలిక జబ్బులకు ఉపయోగించే మందుల ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు 348 రకాల మందుల ధరలు 10 నుంచి 45 శాతం మేర తగ్గాయి. అయితే కొన్ని మందులు 60 శాతం వరకు తగ్గినట్టు సమాచారం. ప్రధానంగా ఎయిడ్స్, క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధులు, కొన్ని రకాల యాంటిబైటిక్, న్యూరాలజీ, శస్త్రచికిత్సలకు ముందు, తర్వాత వాడే మందుల ధరలు తగ్గాయి. గత ఆగస్టు 15న ఔషధ ధరల నియంత్రణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు 45 రోజుల గడువు ఇచ్చింది. ఇచ్చిన గడువు పూర్తి కావడంతో పక్షం రోజుల క్రితం నుంచే మందుల ధరలు అదుపులోకి వచ్చాయి. మందుల ధరలపై నియంత్రణ ఈ చట్టం ద్వారా 348 రకాల మందుల ధరలపై నియంత్రణ ఉంటుంది. జిల్లాలో 1,136 వరకు మెడికల్, 80 వరకు హోల్‌సేల్(డిస్ట్రిబూటర్ ఏజెన్సీలు) షాపులు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు కోట్లాది రూపాయల వ్యాపారం సాగుతోంది. కంపెనీలను బట్టి టాబ్లెట్ల ధరల్లో 45 శాతం వరకు తగ్గుదల కన్పిస్తుంది. బీపీకి ఉపయోగించే ఎటెనల్(14 మాత్రలు) గతంలో రూ.51 ఉండగా ప్రస్తుతం రూ.30.43కు, ఫిట్స్ కు వాడే ఎప్టైన్ (100 మాత్రలు) ధర రూ.232 నుంచి రూ.149కి త గ్గింది. కొలెస్ట్రాల్‌కు వాడే ఎటర్వాస్టాటిన్(10 మాత్రలు) రూ.104 నుంచి రూ.62కు, ఇన్ఫెక్షన్ నివారణకు వాడే ఎజిత్రాల్ (3 మాత్రలు) రూ.95.55 నుంచి రూ. 62.55కు దిగి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 1995 నుంచి ఔషధ ధరల నియంత్రణ చట్టం అమలు చేస్తున్నా పూర్తి స్థాయిలో ఆచరణకు నోచుకోలేదు. ఈ కొత్త చట్టాన్ని పక్కా ప్రణాళికతో అమలు చేయాలని నిర్ణయించడంతో 348 రకాల మందుల ధరలు తగ్గాయి. ఇదివరకైతే... ఇదివరకైతే ఔషధాల ధరలను కంపెనీలే నిర్ణయించేవి. వీటికి అదనంగా జోడించి హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు విక్రయిస్తూ వచ్చారు. ఈ పద్ధతికి కొత్త చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇకపై ఔషధ ఉత్పత్తి పరిశ్రమలు, మందుల దుకాణ యజమానులు తమ ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి విక్రయించే వీలు లేదు. పెద్ద కంపెనీలైనా.. చిన్నవైనా ప్రభుత్వం నిర్దేశించిన ధరకే మందులను విక్రయించాల్సి ఉంటుం దని తేల్చి చెప్పింది. అయితే వ్యాపారులకు లాభాలు కొంతమేర తగ్గనున్నాయి. ఈ విధానం వల్ల డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో రెండు శాతం, రిటైల్ స్థాయిలో ఆరు శాతం లాభాలు తగ్గి వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. పాత ధరలకు విక్రయిస్తే చర్యలు.. ఔషధ ధరల నియంత్రణ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో మందుల ధరలు తగ్గాయి. ఎవరైనా పాత ధరలకే మందులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. ఇదే విషయాన్ని ఆయా దుకాణాల నిర్వాహకులు, యూనియన్ నాయకులకు సూచించాం. పాత స్టాకు ఉంటే వెంటనే కంపెనీలకు అప్పగించాలి. - ప్రభాకర్, సిద్దిపేట డివిజన్ ఔషధ నియంత్రణ అధికారి