మూడు దశాబ్దాలతో పోలిస్తే పెరిగిన మరణాలు
శీతల గాలులు, వేడి తరంగాలతో నాడీ, రక్తప్రసరణ వ్యవస్థలో తీవ్ర మార్పులు
ఫలితంగా స్ట్రోక్‌తో మరణాలు.. పక్షవాతంతో తీవ్ర వైకల్యం
చైనాలోని జియాంగ్యా హాస్పిటల్ సెంట్రల్ సౌత్ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న ఉష్ణోగ్రతలతో స్ట్రోక్ మరణాలు, పక్షవాత వైకల్య బాధితులు పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. దాదాపు మూడు దశాబ్దాల డేటాను విశ్లేషించడం ద్వారా వాతావరణ మార్పులతో స్ట్రోక్ ప్రమాదం ముడిపడి ఉన్నట్టు నిర్ధారించారు.
2019లో 5.20 లక్షలకు పైగా స్ట్రోక్ మరణాలపై శీతల గాలులు, మండే వేడి తరంగాలు తీవ్ర ప్రభావం చూపాయని న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురించిన కొత్త అధ్యయనం వెల్లడించింది. స్ట్రోక్ మరణాల్లో అధిక భాగం 4.70 లక్షల కంటే ఎక్కువ మరణాలు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో సంభవించినప్పటికీ.. 1990తో పోలిస్తే అధిక ఉష్ణోగ్రతల పెరుగుదలతో మరణించిన వారి సంఖ్య స్వల్పంగా పెరిగినట్టు కనుగొంది.
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
నాటకీయ ఉష్ణోగ్రత మార్పులు మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని చైనాలోని చాంగ్షాలోని జియాంగ్యా హాస్పిటల్ సెంట్రల్ సౌత్ వర్సిటీకి చెందిన అధ్యయనం నివేదిక చెబుతోంది. అధిక ఉష్ణోగ్రత కారణంగా స్ట్రోక్ ప్రమాదం వేగంగా పెరుగుతోందని, పదేళ్లు దాటిన వారితో పాటు ఆఫ్రికా వంటి వెనుకబడిన దేశాల్లో ప్రమాదం పొంచి ఉందని అధ్యయనం స్పష్టం చేస్తోంది.
వృద్ధాప్యం కూడా స్ట్రోక్ ప్రమాదాన్ని సూచిస్తున్నాయని పేర్కొంది. భారతదేశంలో సరైన ఉష్ణోగ్రతలు లేని కారణంగా 33 వేల స్ట్రోక్ మరణాలు సంభవిస్తే.. వాటిల్లో 55 శాతం ఉష్ణోగ్రతలు పెరగడంతో, 45 శాతం ఉండాల్సిన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం ప్రధాన కారణమని విశ్లేషించింది.
పురుషుల్లోనే ఎక్కువ
ఉష్ణోగ్రతల్లో మార్పులతో పక్షవాతం వచ్చి మరణించే వారి సంఖ్య ప్రతి లక్ష మందిలో 5.9 శాతం మంది మహిళలు కాగా.. పురుషుల్లో 7.7 శాతం ఉన్నట్టు అధ్యయన బృందం తేల్చింది. మధ్య ఆసియాలో లక్ష మందిలో 18 మంది అనుకూలంగా లేని (నాన్–ఆప్టిమల్) ఉష్ణోగ్రతల కారణంగా అత్యధిక స్ట్రోక్‌కు మరణాల రేటు నమోదైంది.
శిలాజ ఇంధనాల దహనం, అటవీ నిర్మూలన, పారిశ్రామిక కాలుష్యం వాతావరణాన్ని పెను ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ముప్పును తగ్గించే లక్ష్యంతో ప్రపంచ దేశాలు పని చేయాలని సూచిస్తోంది.
ఎందుకు జరుగుతోందంటే..!
చల్లని ఉష్ణోగ్రతలు మానవ శరీరంలోని సునిశిత నాడీ వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు రక్తనాళాల్లో అధిక రక్తపోటును పెంచి స్ట్రోక్‌లకు దారి తీస్తోందని అధ్యయన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతలో వేడి ఉష్ణోగ్రతలు నిర్జలీకరణానికి కారణమవుతాయని.. తద్వారా రక్తం చిక్కబడటం (క్లాట్స్) వల్ల స్ట్రోక్ ప్రమాదాలు సంభవిస్తాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment