‘‘అతనూ.. మన ఆఫీస్‌లో పనిచేస్తాడే.. పేరేంటో మర్చిపోయానబ్బా’’
‘‘నిన్ననే నెట్‌ఫ్లిక్స్‌లో చూశా సినిమా చాలా
బాగుంది.. పేరేంటంటే, నోట్లో నానుతూనే ఉంది..
గుర్తు రావడం లేదు’’
‘‘మమ్మీ.. బైక్ కీస్ కనపడటం లేదు, కాస్త చూడు
ఎక్కడ పెట్టానో గుర్తురావడం లేదు’’
ఇలాంటి మాటలు మీరు తరచుగా అంటుంటే.. లేదా ఎవరి నుంచైనా వింటుంటే.. సిల్లీగా తీసుకోకండి. ఎందుకంటే ఇది కూడా ఒక వ్యాధి. దాని పేరు
సూడో డిమెన్షియా!
బాగా తెలిసిన వ్యక్తుల పేర్లను మర్చిపోవడం, మన బండి తాళాలను తరచుగా వెతుక్కోవడం, ఒకటి రెండ్రోజుల క్రితం చూసిన సినిమా పేరు కూడా గుర్తు లేకపోవడం.. ఈ లక్షణాలను వైద్యులు ‘సూడో–డిమెన్షియా’గా పేర్కొంటున్నారు. డిమెన్షియా అనేది ఓ వయసు దాటాక వృద్ధాప్యంలో చుట్టుముట్టే వ్యాధి కాగా.. ప్రస్తుతం యువతపై కూడా ఇది ప్రభావం చూపుతోంది. దీని బారిన పడిన రోగులకు తరచుగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి లోపించడం నిరాశ లేదా అతిగా ఆలోచించడం వంటి లక్షణాలు ఉంటాయి.
కేసులు పెరుగుతున్నాయి...
ప్రధానంగా అధిక ఒత్తిడి, మల్టీ టాస్కింగ్, తద్వారా చోటు చేసుకుంటున్న నిస్పృహ, నిరాశ.. వంటివి ఈ పరిస్థితికి కారణం. ఫోర్టీస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన న్యూరాలజీ డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ గుప్తా మాట్లాడుతూ, ‘‘యువతలో గణనీయంగా మతిమరుపు కేసులు పెరుగుతున్నాయి. ఇటువంటి సమస్యల నుంచి పరిష్కారం కోరుతూ నెలలో కనీసం 5–10 మంది వరకూ 50 ఏళ్ల లోపు వారు మమ్మల్ని సంప్రదిస్తున్నారు’’అని చెప్పారు. ‘‘ప్రస్తుతం యువతలో కెరీర్–సంబంధిత ఒత్తిడి బాగా ఉంటోంది. తద్వారా అధిక పనిభారం సర్వసాధారణమైంది. సోషల్ స్టేటస్ గురించి ఆందోళన కూడా దీనికి తోడవుతోంది. ఇలాంటివన్నీ మెదడుపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి, అది సమాచారాన్ని పూర్తిగా ప్రాసెస్ చేయడమనే దాని విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తుంది, ఎక్కువ సమయం పాటు ప్రాసెసింగ్ చేసే ‘మల్టీ టాస్కింగ్’కూడా జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేస్తుంది’’అని డాక్టర్ గుప్తా చెప్పారు.
మెమొరీ.. మెదడే దారి..
‘‘ఓ విషయంపై శ్రద్ధ పెట్టడం, దాన్ని స్వీకరించడం అనంతరం దాన్ని నిలుపుకోవడం.. ఇలా జ్ఞాపకశక్తి మూడు భాగాలుగా రూపుదిద్దుకుంటుంది. దీనిలో ప్రతి దశకు మెదడు నుంచి సహకారం అవసరం, కానీ అధిక స్థాయి పని ఒత్తిడి దాని పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సూడో డిమెన్షియా వెనుక కారణాల గురించి తెలుసుకున్న తర్వాత కొద్దిపాటి ప్రయత్నం ద్వారా దాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఏకాగ్రత సాధించేందుకు ప్రయత్నించడం, డిప్రెషన్‌కు చికిత్స తీసుకోవడం వల్ల పరిస్థితి మెరుగుపడుతుంది, ఆందోళన తగ్గుతుంది’’అని గుప్తా వివరించారు.
– సాక్షి, సిటీబ్యూరో
‘‘ఈ తరహా లక్షణాలతో నెలకు 10–12 మంది రోగులు వస్తున్నారు. పని ఒత్తిడి, అతిగా ప్రతికూల ఆలోచనలు, ఒకే సమయంలో అనేక పనులు చేయాలనే మల్టీ టాస్కింగ్.. ఇతరులతో సమస్యల కారణంగా మానసిక ఆందోళన పెరుగుతుంది. మనసులో తెలియని ఆరాటం, ఆత్రుత ఉన్నప్పుడు, అనేక రకాల పనులు చేయలేం. కౌన్సెలింగ్ సెషన్‌లు, కాగి్నటివ్ బిహేవియరల్ థెరపీ రిలాక్సేషన్‌లు ఈ పరిస్థితితో బాధపడుతున్న వ్యక్తులు కోలుకోవడానికి సహాయపడతాయి’’.
– డాక్టర్ ఆర్తీ ఆనంద్, ప్రముఖ సైకాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment