కెరీర్‌లో విజయం సాధించిన మహిళలు కుటుంబంపై దృష్టి పెట్టలేరని చాలామంది అనుకుంటారు. అలాగే, మహిళలు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్నా, తమ కోసం తాము టైమ్‌ను కేటాయించుకోరు అనీ అంటుంటారు. అయితే ఈ ఊహలన్నీ తప్పని హిమజ అప్పరాశ్చెరువు రుజువు చేస్తోంది. మన శక్తి ఏంటో మనకే తెలుసు అని తన పనుల ద్వారా చూపుతోంది.
అనంతపురం వాసి అయిన హిమజ అప్పరాశ్చెరువు బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే జుంబా ఇన్‌స్ట్రక్టర్‌గా, మారథా రన్నర్‌గా సత్తా చాటుతోంది. ఇద్దరు పిల్లలకు తల్లిగా కుటుంబ బాధ్యతలతోనూ మల్టిపుల్ వర్క్స్‌తో రాణిస్తోంది. చిన్న పట్టణంలో పెరిగిన హిమజ పెద్ద కలలు కనడమే కాకుండా వాటిని సాకారం చేసుకుంటోంది. తన కెరీర్‌తో పాటు ఇద్దరు పిల్లల బాధ్యతనూ నిర్వహిస్తోంది. దీనితోపాటు, తన స్వంత అభిరుచినీ నెరవేర్చుకుంటోంది.
సున్నా నుంచి మొదలు
‘నా జీవన ప్రయాణం సున్నాతో మొదలుపెట్టి ఈ రోజు చేరుకున్న చోటికి రావడం అంత తేలిక కాలేదు. ఐఐటీ రూర్కీలో ఇంజనీరింగ్ చేశాను. కాలేజీలో చేరేసరికి నాకు ఇంగ్లీషు సరిగా రాదు, హిందీలోనూ సరిగా మాట్లాడలేను. కానీ సంకల్పంతో, నేను ప్రతి సవాల్‌ను అధిగమిస్తూ, జీవితంలో చాలా నేర్చుకుంటూ విజయం వైపు పయనిస్తూనే ఉన్నాను.
రానిదంటూ లేదని..
ఇంజినీరింగ్ తర్వాత ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబిఏ పూర్తి చేశాను. ఆస్ట్రేలియన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి బిఎఎమ్ పట్టా అందుకున్నాను. 2017లో అమెజాన్ కంపెనీలో సప్లై చైన్ ఎగ్జిక్యూషన్ టీమ్ పోస్ట్‌పై సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరాను. నేటి కాలంలో విద్యార్థులైనా, పనిచేసే వృత్తి నిపుణులైనా వారికి ఇంగ్లీషు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో నాకు కూడా అర్థమైంది. ఈ అవసరాన్ని స్వయంగా గ్రహించి, నేను అమెజాన్ అలెక్సాలో ఇంటరాక్టివ్ సెషన్స్ చేర్చాను. ఈ నైపుణ్యంతో ఏ వయసు వారైనా ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకోవచ్చు.
కుటుంబంపై పూర్తి శ్రద్ధ
నా కెరీర్‌తో పాటు కుటుంబంపై పూర్తి శ్రద్ధ పెట్టాను. నా కెరీర్‌లో ముందుకు వెళుతున్న సమయంలోనే రెండుసార్లు తల్లిని అయ్యాను. ఈ సమయంలో కొత్తగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ నా భర్త ఎల్లప్పుడూ నాకు మద్దతుగా నిలిచాడు. కెరీర్ మాత్రమే ముఖ్యం కాదు, నా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడమూ ముఖ్యమే. అందుకే, హోమ్‌వర్క్ చేయించడం, వారితో ఆడుకోవడం, వారిని పరీక్షలకు సిద్ధం చేయడం, వారితో సరదాగా గడపడం వంటి ప్రతి అవసరాన్ని తీరుస్తాను.
సమతుల్యత అవసరం..
నా దినచర్యలో అడుగడుగునా నా భర్త సపోర్ట్ ఉంది. తన తల్లిదండ్రుల పూర్తి బాధ్యతనూ తీసుకుంటాడు. మేము మా పిల్లలను వ్యక్తిగతంగా చూసుకోవడం, వారితో సమయం గడపడం మంచిదని నమ్ముతాము. బయటి పని, ఇంటి పని ఈ రెండింటి మధ్య సమానమైన సమతుల్యతను పాటిస్తాను. నా పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపడం, కొత్త పనులు చేయడం నాకు ఇష్టం. మల్టిపుల్ టాస్కింగ్ మనల్ని మరింత ఉత్సాహవంతులను చేస్తుంది. ఇందులో భాగంగానే రెండేళ్ల క్రితం జుంబా ఇన్‌స్ట్రక్టర్‌గా మారాను. ఆన్‌లైన్–ఆఫ్‌లైన్ క్లాసులతోనూ సేవలు అందిస్తుంటాను. మారథాన్ రన్నర్‌గానూ, నా ఇతర అభిరుచుల వైపుగా సాగుతుంటాను’ అని వివరిస్తారు ఈ మల్టీ టాలెంటెడ్ ఉమన్. (క్లిక్ చేయండి: రేణు ది గ్రేట్.. స్త్రీ హక్కుల గొంతుక)
Comments
Please login to add a commentAdd a comment