కోలుకున్న వగ్యా నాయక్
గుంటూరు మెడికల్: ఆడుతూ పాడుతూ ఉండాల్సిన పదేళ్ల బాలుడు అకస్మాత్తుగా జీబీ సిండ్రోమ్ వ్యాధి బారిన పడ్డాడు. రెండు నెలలపాటు పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేసినా బాలుడి ఆరోగ్యం మెరుగుపడకపోగా, మరింత క్షీణించింది. వెంటిలేటర్‌పై ఉంచి తీసుకొచ్చిన ఆ బాలుడికి గుంటూరు జీజీహెచ్‌లోని న్యూరాలజీ వైద్యులు సకాలంలో సరైన వైద్యం అందించి పునర్జన్మను ప్రసాదించారు. దీంతో బాలుడి తండ్రి ఆనందంతో న్యూరాలజీ వైద్య విభాగంలో గురువారం కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని చాకలికుంట తండాకు చెందిన మూడావత్ రాజానాయక్, మంగాబాయి దంపతుల కుమారుడు వగ్యానాయక్(10) ఐదో తరగతి చదువుతున్నాడు. వగ్యానాయక్‌కు రెండు నెలల క్రితం ముఖంపై వాపు వచ్చింది. అతడికి నరసరావుపేట, గుంటూరులోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. అన్ని ఆస్పత్రుల్లో కలిపి రూ.10లక్షలు వరకు ఖర్చు చేశారు. అయినా బాలుడు కోలుకోలేదు.
రెండుసార్లు కార్డియాక్ అరెస్టయి ఆరోగ్యం మరింత క్షీణించి వెంటిలేటర్‌పై ఉన్న వగ్యానాయక్‌ను చివరికి ఈ నెల మూడో తేదీ అర్ధరాత్రి గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగానికి తీసుకొచ్చారు. తక్షణమే డ్యూటీలో ఉన్న పీజీ వైద్యులను అప్రమత్తం చేసి బాలుడిని ఐసీయూలోకి తరలించి వెంటిలేటర్ అమర్చి చికిత్స అందించామని న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి తెలిపారు. వారం రోజులపాటు వెంటిలేటర్‌పై చికిత్స అందించిన తర్వాత బాలుడు కోలుకోవడం ప్రారంభమైందని చెప్పారు.
ఈ బాలుడికి అరుదుగా సంభవించే గులియన్‌బెరి సిండ్రోమ్ (జీబీ సిండ్రోమ్) సోకినట్లు నిర్ధారించామన్నారు. రోజుకు రూ.లక్ష విలువైన ఇంజక్షన్లు చేశామని, కేవలం ఇంజక్షన్‌లకు రూ.ఆరు లక్షలకు పైగా ఖర్చు అయినట్లు వెల్లడించారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సుమారు రూ.10 లక్షలు ఖర్చు అయ్యే వైద్యాన్ని బాలుడికి ఉచితంగా చేసి ప్రాణాలు కాపాడామని, ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment