GB syndrome
-
పదేళ్ల బాలుడికి పునర్జన్మ
గుంటూరు మెడికల్: ఆడుతూ పాడుతూ ఉండాల్సిన పదేళ్ల బాలుడు అకస్మాత్తుగా జీబీ సిండ్రోమ్ వ్యాధి బారిన పడ్డాడు. రెండు నెలలపాటు పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేసినా బాలుడి ఆరోగ్యం మెరుగుపడకపోగా, మరింత క్షీణించింది. వెంటిలేటర్‌పై ఉంచి తీసుకొచ్చిన ఆ బాలుడికి గుంటూరు జీజీహెచ్‌లోని న్యూరాలజీ వైద్యులు సకాలంలో సరైన వైద్యం అందించి పునర్జన్మను ప్రసాదించారు. దీంతో బాలుడి తండ్రి ఆనందంతో న్యూరాలజీ వైద్య విభాగంలో గురువారం కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని చాకలికుంట తండాకు చెందిన మూడావత్ రాజానాయక్, మంగాబాయి దంపతుల కుమారుడు వగ్యానాయక్(10) ఐదో తరగతి చదువుతున్నాడు. వగ్యానాయక్కు రెండు నెలల క్రితం ముఖంపై వాపు వచ్చింది. అతడికి నరసరావుపేట, గుంటూరులోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. అన్ని ఆస్పత్రుల్లో కలిపి రూ.10లక్షలు వరకు ఖర్చు చేశారు. అయినా బాలుడు కోలుకోలేదు. రెండుసార్లు కార్డియాక్ అరెస్టయి ఆరోగ్యం మరింత క్షీణించి వెంటిలేటర్‌పై ఉన్న వగ్యానాయక్ను చివరికి ఈ నెల మూడో తేదీ అర్ధరాత్రి గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగానికి తీసుకొచ్చారు. తక్షణమే డ్యూటీలో ఉన్న పీజీ వైద్యులను అప్రమత్తం చేసి బాలుడిని ఐసీయూలోకి తరలించి వెంటిలేటర్ అమర్చి చికిత్స అందించామని న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి తెలిపారు. వారం రోజులపాటు వెంటిలేటర్‌పై చికిత్స అందించిన తర్వాత బాలుడు కోలుకోవడం ప్రారంభమైందని చెప్పారు. ఈ బాలుడికి అరుదుగా సంభవించే గులియన్‌బెరి సిండ్రోమ్ (జీబీ సిండ్రోమ్) సోకినట్లు నిర్ధారించామన్నారు. రోజుకు రూ.లక్ష విలువైన ఇంజక్షన్లు చేశామని, కేవలం ఇంజక్షన్లకు రూ.ఆరు లక్షలకు పైగా ఖర్చు అయినట్లు వెల్లడించారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సుమారు రూ.10 లక్షలు ఖర్చు అయ్యే వైద్యాన్ని బాలుడికి ఉచితంగా చేసి ప్రాణాలు కాపాడామని, ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడని వివరించారు. -
నా కూతురి ప్రాణం కాపాడండి
విశాఖపట్నం , అల్లిపురం(విశాఖ దక్షిణ): జీబీ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న తమ కుమార్తె దివ్య ప్రాణం కాపాడాలని ఆమె తల్లిదండ్రులు మజ్జి శ్రీనివాసరెడ్డి, జయలక్ష్మిలు వేడుకుంటున్నారు. అల్లిపురంలోని అమ్మవారివీధికి చెందిన మజ్జి దివ్య గతేడాది డిసెంబర్ 31న ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నడుము నుంచి కింద భాగం మొత్తం అచేతనంగా మారి కాలు కదల్లేని పరిస్థితిలో నగరంలో ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై గత నెల 18న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి దాతలు స్పందించి తోచిన ఆర్థిక సాయం చేశారు. దాతల సాయంతో ఆమెకు చికిత్స అందజేసినా.. ఇంకా దివ్య ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. ఆమె కోలుకోవాలంటే మరో రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పినట్టు దివ్య తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంత మొత్తం ఖర్చు చేసే స్థోమత తమకు లేదని, దాతలు ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఇప్పటి వరకు తమకు చేయూతనిచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. సహాయం చేయాలనుకునే దాతలు ఎస్.సురేష్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రెడ్నెమ్ గార్డెన్స్ బ్రాంచ్, ఎస్బీ ఖాతా నంబర్ 20033585049, ఐఎఫ్ఎస్సీ కోడ్ నంబర్ ఎస్బీఐఎన్0000952 ద్వారా గాని, పేటీఎం, గూగుల్ పే, పోన్ పే నుంచి 78424 73149 నంబర్ ద్వారా సహాయం చేయాలని వేడుకుంటున్నారు. -
ప్లీజ్.. ప్రాణభిక్ష పెట్టండి
జీవచ్ఛవంలా పడి ఉన్న ఈ యువకుడి పేరు కొండా పాపారావు. సత్తుపల్లి మండల పరిధిలోని రేజర్లకు చెందిన వాడు. సత్తుపల్లి గీతమ్స్ పీజీ కళాశాలలో ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. పెళ్లి అయ్యింది. భార్య పేరు కల్యాణి. వీరికి ఒక బాబు ఉన్నాడు. ఉన్నట్టుండి వీరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జీబీ సిండ్రోమ్, పక్షవాతం బారినపడ్డాడు పాపారావు. కొద్దిరోజులుగా కోమాలోనే ఉన్నాడు. ప్రస్తుతం విజయవాడ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే కుటుంబ సభ్యులు ఉన్నది కాస్త అమ్మేసి వైద్యానికి రూ.3లక్షలు ఖర్చు చేశారు. అయినా ఎలాంటి మార్పూలేదు. ఇంకా రూ.6లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. చేతిలో చిల్లిగవ్వలేదు. మాయదారి జబ్బుతో పాపారావు పరిస్థితి క్షణం ఒక యుగంలా మారింది. ఏం చేయాలో ఆ కుటుంబ సభ్యులకు పాలుపోవడం లేదు. దాతలే పాపారావు ప్రాణాలు నిలబెట్టాలని వేడుకుంటున్నారు. ‘నా భర్తకు దాతలే ప్రాణభిక్ష పెట్టాలి’ అంటూ కల్యాణి కన్నీరుమున్నీరవుతోంది. ఆర్థికసాయం అందించాలనుకుంటున్న దాతలు ‘కొండా కల్యాణి (అకౌంట్ నంబర్: 33664673557, ఎస్బీఐ సత్తుపల్లి) పేరు మీద జమ చేయాలని వేడుకుంటోంది. మరిన్ని వివరాలకు 8019702328, 9705952584 నంబర్లను సంప్రదించాలని కోరుతోంది. -సత్తుపల్లి