పెద్దాపురం: స్పందించే మనసుంటే చాలు...సేవ చేయాలనే తపన ఉంటే చాలు..ఆదుకోడానికి పెద్దగా ఆస్తిపాస్తులక్కరలేదని చెప్పడానికి ఆయనే నిదర్శనం. అయినవాళ్ల ఆదరణకు దూరంగా ..వృద్ధాప్యంలో అనాథలైన వారికి ఆసరా ఇస్తున్న ఆయన పేరు అల్లవరపు సత్యన్నారాయణ. బాల్యంలో తండ్రి అనారోగ్యం పాలై ఆస్పత్రిలో పడిన బాధల్ని కళ్లారా చూశారు.
ఆర్ధిక పరిస్థితి సహకరించకపోతే ఎదురయ్యే పరిస్థితులనూ చూశారు. ఆవే ఆయన్ను ప్రభావితం చేశాయి. అభాగ్యులకు అండగా నిలవాలనే తత్వాన్ని పెంచాయి. ఫలితంగా ఆయన నేతృత్వంలో 2016లో కాకినాలో ఆవిర్భవించిందే బాధ్యత స్వచ్ఛంద సంస్థ. తనలాంటి స్వభావమున్న మరో ఏడుగురు ఈయనకు తోడయ్యారు. నాటి ఆస్పత్రి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు ప్రోత్సాహమూ బలమైంది. తొలుత కాకినాడలో అనాథ బాలలు గుర్తించి, దిశ వన్ స్టాప్ సర్వీస్‌ల సహాకారంతో సేవలకు శ్రీకారం చుట్టారు.
మేమున్నామని..
జీజీహెచ్‌లో ఏ దిక్కూ లేని వృద్ధుల వైద్యసేవలకో వార్డు ఉంది. ఈ వార్డులో చికిత్స పొందుతున్న వారెవరికీ తెలియదు. వీరికోసం ఎవరూ అక్కడికి రారు. ఈ వార్డుకు సత్యనారాయణ బృందం వెళుతూ వారికి సపర్యలు చేస్తున్నారు. వీరికి తామే ఎందుకు ఆసరా కల్పించకూడదనే ఆలోచనతో పెద్దాపురంలో మన ఇల్లు ఏర్పాటు చేశారు. తొలుత ఎనిమిది మందితో ఆరంభమైన మన ఇల్లులో ఇప్పుడు 29మంది ఉంటున్నారు. సహచరులు.. యువత, ప్రభుత్వ ఉద్యోగులు సత్యనారాయణ ఆలోచనకు అండగా నిలుస్తున్నారు. తమ వంతు చేయూతనిస్తున్నారు. మన ఇల్లులో ఉన్నవారెవరికీ తాము అనాథలం అనే భావన రానీయకుండా సాకుతున్నామని సత్యనారాయణ చెప్పారు.
ఆహ్లాద కరమైన వాతావరణంలో పడుకోవడానికి బెడ్లు, దుప్పట్లు, వేళకు భోజనం సమకూర్చుతున్నారు. వినోదం కోసం టీవీలు అందుబాటులో ఉంచుతున్నారు మన ఇల్లు నిర్వాహకులు. అసోం నుంచి రైలు ప్రమాదంలో అనారోగ్యం పాలై మతిస్థిమితం కోల్పోయిన శ్రీదౌహరుకు మూడేళ్లపాటు సేవలందించారు. తర్వాత కుటుంబీకుల వివరాలు చెప్పడంతో ఇటీవల వారిని రప్పించి అతడ్ని స్వస్థలానికి పంపించారు. ఈవిషయంలో మన ఇల్లు నిర్వాహకుడు సత్యనారాయణ పోషించిన పాత్రను జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ప్రశంసించారు. జీజీహెచ్‌లో అనాథలుగా ప్రాణాలు కోల్పోయిన 14 మంది మృతదేహాలకు సత్యనారాయణ బృందం అంతిమ సంస్కారాలను నిర్వహించింది.
కాళ్లు చచ్చుబడిన స్థితి నుంచి ఇలా ఉన్నా..
నాది రాజమహేంద్రవరం. నాకు అందరూ ఉన్నారు. రెండు కాళ్లు చచ్చుబడిపోయి మంచాన పడ్డాను. కాకినాడ తిమ్మాపురానికి చెందిన నా సోదరి జీజీహెచ్‌లో చేర్పించింది. నా పరిస్థితి గుర్తించి సత్యన్నారాయణ పెద్దాపురంలోని మన ఇల్లుకు తీసుకువచ్చారు. ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా గడుపుతున్నాను.
– వెంకటరమణ, రాజమహేంద్రవరం
ఆ వృద్ధులందరూ అమ్మానాన్నలే..
పెద్దాపురంలో మూడేళ్లుగా ‘మనఇల్లు’ను ప్రారంభించాం. ప్రస్తుతం 29 మంది వృద్ధులు ఉన్నారు. వీరికి ఏ ఇబ్బంది రాకుండా చూస్తున్నాం. కొందరికి ఫిజియోథెరపీ సేవలు కూడా అందిస్తున్నాం. వీరంతా అనాధ వృద్ధులు కాదు. నాకు అమ్మా నాన్నలే. వృద్ధులైన వారిపై కుటుంబీకులు నిరాదరణ చూపడం సరికాదు. పెద్దలను గౌరవిస్తూ సేవలందించాలి.
– అల్లవరపు సత్యనారాయణ, ‘మన ఇల్లు’ సంస్థ నిర్వాహకుడు
Comments
Please login to add a commentAdd a comment