16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం వినతి
విద్య, ఆరోగ్యం, ఉద్యోగాల కల్పన తదితర రంగాల్లో వెనుకబడి ఉన్నాం.. భరించలేని స్థాయిలో అప్పుల భారం
అసలు, వడ్డీలు చెల్లించేందుకే నెలకు రూ.5,200 కోట్లు అవసరం
బడ్జెట్‌లో 36 శాతం వేతనాలు, పింఛన్లకే వ్యయం
తడిసి మోపెడవుతున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ ఖర్చు
పట్టణ, గ్రామీణ ప్రాంతాల తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉంది.. తలసరి ఆదాయం ఎక్కువ ఉందన్న కారణంతో సాయాన్ని తగ్గించొద్దు
రాష్ట్రంలోని క్షేత్రస్థాయి పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకోండి
గ్రాంట్ల వినియోగంలో స్వతంత్రత ఇవ్వండి..
కేంద్రం నుంచి ఎక్కువ సాయం అందేలా సిఫారసులు చేయండి
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రం అనేక సామాజిక సూచికల్లో వెనుకబడి ఉంది. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, ఉద్యోగాల కల్పన తదితర రంగాల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వెనుకంజలో ఉన్నాం. తలసరి ఆదాయం విషయంలో కూడా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చాలా తేడా కనిపిస్తోంది. అప్పుల భారం భరించలేని స్థాయికి చేరింది. ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణాలు, గ్యారంటీలు కలిపి ప్రస్తుతం రాష్ట్ర నికర అప్పు రూ.7.27 లక్షల కోట్లకు చేరింది. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, రిటైర్‌మెంట్ బెనిఫిట్ల కోసమే బడ్జెట్‌లో 36% వరకు అనివార్యంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇది దీర్ఘకాలిక భారంగా పరిణమిస్తోంది.
నెలకు రూ.5,200 కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకు గాను అసలు, వడ్డీలు చెల్లించేందుకే అవసరమవుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ ఖర్చు తడిసి మోపెడవుతోంది. తక్షణ అవసరాల కోసం స్వల్ప కాలిక రుణాలకు వెళ్లాల్సి రావడం బడ్జెట్‌పై ఒత్తిడిని కలుగజేస్తోంది. తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రమనే కారణంతో కేంద్రం నుంచి రావాల్సిన సాయాన్ని తగ్గించొద్దు.
రాష్ట్రంలోని క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం నుంచి వీలున్నంత ఎక్కువ సాయం అందేలా సిఫారసులు చేయండి..’అని రాష్ట్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేసింది. మంగళవారం ప్రజాభవన్‌లో జరిగిన సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆర్థిక సంఘం సభ్యులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఐదు కీలక విజ్ఞప్తులను 16వ ఆర్థిక సంఘం ముందుంచారు.
ఐదు కీలక విజ్ఞప్తులు:
1.కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్) అమలు కోసం ఇచ్చే గ్రాంట్లను వినియోగించుకునే విషయంలో రాష్ట్రాలకు స్వతంత్రత ఇవ్వాలని, స్థానిక అవసరాలకు అనుగుణంగా రూపొందించుకునే పథకాల కోసం ఈ నిధులను వినియోగించుకునే వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
2.రాష్ట్ర ప్రభుత్వ అప్పులను రీస్ట్రక్చర్ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆర్‌ఈసీ (రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్), పీఎఫ్‌సీ (పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్)ల ద్వారా తీసుకున్న వాటికి, ఇతర రుణాలకు 10 నుంచి 12 శాతం వరకు వడ్డీలు కట్టాల్సి వస్తోందని తెలిపింది. ఈ వడ్డీల భారం కారణంగా అభివృద్ధికి నిధులు వెచ్చించే పరిస్థితి లేదని, తక్కువ వడ్డీకి రుణాలిప్పిస్తే ప్రస్తుతమున్న రుణాలను చెల్లించి భారం తగ్గించుకుంటామని విజ్ఞప్తి చేసింది. లేదంటే అభివృద్ధి వనరులను పెంపొందించుకునేలా అదనపు సాయాన్ని కేంద్రం నుంచి ఇప్పించాలని కోరింది.
3. కేంద్ర పన్నుల్లో వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని కోరింది.
4. కేంద్ర పన్నుల్లో వాటాకు తలసరి ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం ద్వారా తెలంగాణ లాంటి రాష్ట్రానికి నష్టం కలుగుతోందని, జీఎస్‌డీపీ ప్రాతిపదికన ఈ వాటాను నిర్ధారించాలని కోరింది.
5. కేంద్రం వసూలు చేసుకుంటున్న సెస్‌లు, సర్‌చార్జీల్లో వాటా ఇవ్వకపోవడంతో రాష్ట్రాల పన్ను ఆదాయం తగ్గిపోతోందని తెలిపింది. కేంద్ర పన్నుల్లో వాటా పెంపు ద్వారా రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన, రాష్ట్రాల అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూరుతాయని సూచించింది. ఈ ప్రతిపాదన దేశంలోని అన్ని రాష్ట్రాలకు లబ్ధి కలిగిస్తుందని, సమాఖ్య స్ఫూర్తికి ఊతమిస్తుందని అభిప్రాయపడింది.
సంక్షేమ పథకాలు అనివార్యం
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రెజెంటేషన్‌లోని మరికొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
– తలసరి ఆదాయంలో తెలంగాణ ముందంజలో ఉంది. కానీ సంపద సృష్టి, ఆదాయ పంపిణీ విషయంలో ప్రాంతాల వారీగా భారీ వైరుధ్యాలున్నాయి. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత కూడా ఈ వ్యత్యాసాన్ని తగ్గించే క్రమంలో వెనుకబడ్డాం. కేంద్ర పన్నుల్లో వాటా నిర్ణయించేందుకు తలసరి ఆదాయాన్ని కాకుండా జీఎస్‌డీపీలో 50 శాతాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
– ఉచితాలుగా పరిగణించే కొన్ని సంక్షేమ పథకాలు అనివార్యంగా అమలు చేయాల్సి ఉంది. రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఆహార సబ్సిడీలు ఆర్థిక స్థిరత్వాన్ని కలిగించడంతో పాటు వెనుకబడిన వర్గాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తాయి. ఈ నేపథ్యంలో సదరు సంక్షేమ పథకాలను పెట్టుబడిగా పరిగణించాలి.
– కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు అంచనాల పెంపు, ప్రాజెక్టుల నిర్వహణ భారంగా మారుతున్నాయి.
– మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం ఆఫ్ బడ్జెట్ అప్పులకు వెళ్లాల్సి వస్తోంది.
– హైదరాబాద్ లాంటి నగర ప్రాంతాల్లో అభివృద్ధి ఎక్కువగా ఉంటోంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉంటోంది.
పోస్టు గ్రాడ్యుయేట్ మహిళల్లో 100% నిరుద్యోగం
– గ్రామీణ ప్రాంతాల్లోని చదువుకున్న యువత, మహిళల్లో నిరుద్యోగం ఎక్కువగా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పోస్టు గ్రాడ్యుయేట్ మహిళల్లో 100 శాతం నిరుద్యోగం ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కంటే ఇక్కడ నిరుద్యోగం ఎక్కువ ఉంది.
– ఆరోగ్య, పౌష్టికాహార అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మహిళలు, చిన్నారుల్లో ఎనీమియా (రక్తహీనత) పెరుగుతోంది. బరువు తక్కువ ఉండే చిన్నారులు, పౌష్టికాహార లోపం లాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.
– ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో రాష్ట్ర అవసరాలు తీరేలా 16వ ఆర్థిక సంఘం సిఫారసులు ఉండాలని కోరుతున్నాం.
Comments
Please login to add a commentAdd a comment