అక్షరంపై నిర్లక్ష్యం!
♦ ఓనమాలు నేర్చుకోని వయోజనులు
♦ చతికిలపడిన సాక్షర భారత్
♦ నిధులు మంజూరు చేయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
♦ జిల్లా అక్షరాస్యత శాతం 67.40
♦ నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
అక్షరం ఆయుధం కన్నా గొప్పది. అక్షరం వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అభివృద్ధికి బాటలు వేస్తుంది. అయినా అక్షరంపై నిర్లక్ష్యం వీడడం లేదు. సమాజమంతా ఆన్‌లైన్ బాట పడుతున్నా, అ,ఆ,ఇ,ఈ అంటే తెలియని వారు ఎందరో ఉన్నారు. ఇంకా చాలా మంది వేలిముద్రలు వేస్తున్నారంటే మనమెక్కడ ఉన్నామో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అక్షరాస్యతపై లెక్కలు బాగానే ఉన్నా ఆర్థికంగా చేయూత లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం.. నిరక్షరాస్యులకు అవగాహన లేవి.. వెరసి వేలిముద్రకు దారి తీస్తుంది. శుక్రవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
బెల్లంకొండ : జిల్లాలో ఏ మండలంలో చూసినా అక్షరాస్యతా శాతం తగ్గుముఖం పడుతుంది. అధికారిక గణాంకాలు కేవలం పేపర్లకే పరిమితమవుతున్నాయి. 2020 నాటికి సంపూర్ణ అక్షరాస్యతా లక్ష్యంగా అట్టహాసంగా ప్రారంభమైన సాక్షర భారత్ కార్యక్రమం జిల్లాలో చతికిల పడింది. అధికారుల నిర్లక్ష్యానికి తోడుగా, రాష్ట్ర ప్రభుత్వం నిధుల మంజూరులో కోత వి«ధించడంతో కార్యక్రమం సజావుగా సాగడం లేదు. దీంతో వయోజనులు ఓనమాలు నేర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో జనాభా 48,87,213గా ఉంది. ఇందులో పురుషులు 24,40,521 ఉండగా, స్త్రీలు 24,47,292 ఉన్నారు. అక్షరాస్యతా శాతం 67.40గా నమోదైంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో జిల్లా అక్షరాస్యతా శాతం 7వ స్థానంలో ఉంది. 2010 సెప్టెంబర్ 22న జిల్లాలో సాక్షర భారత్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం జిల్లాలో 57 మండలాల్లోని 712 గ్రామాల్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా అన్ని గ్రామాల్లో 56,816 మందితో మొదటిగా అక్షరాలు దిద్దించారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిధుల మంజూరులో జాప్యం చేయడంతో నేడు వయోజన విద్యా కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2020 నాటికి సంపూర్ణ అక్షరాస్యతా మాట అటుంచితే అక్షరాస్యతలో 7 స్థానంలో ఉన్న జిల్లా అట్టడుగుకు చేరే ప్రమాదం ఉంది.
వెనుకబడిన మహిళలు
జిల్లాలో అక్షరాస్యతలో మహిళలు వెనుకబడి ఉన్నారు. 2001లో పురుషుల అక్షరాస్యత 71.24గా ఉండగా, మహిళల అక్షరాస్యత 53.74గా ఉంది. 2011లో పురుషుల అక్షరాస్యత 74.79 ఉండగా మహిళల అక్షరాస్యత 60.09 గా ఉంది. పురుషులతో పోలిస్తే మహిళలు అక్షరాస్యతలో 14.70 శాతం వెనుకబడి ఉన్నారు.
నిధుల పంపిణీలో ప్రభుత్వం కొర్రీలు
సాక్షర భారత్ నిర్వహణకు 75 శాతం కేంద్ర ప్రభుత్వం, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నాయి. అయితే 2017–18కిగానూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీనికితోడు మండల స్థాయి, గ్రామ స్థాయిలో పనిచేసే కోఆర్డినేటర్లకు దాదాపుగా 11 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో వారు కేంద్రాల నిర్వహణకు శ్రద్ధ చూపడం లేదు. ఈ ఏడాది సాక్షర భారత్ ప్రోగ్రాంను ఎత్తేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బందికి సంకేతాలు వస్తున్నట్లు తెలిసింది.