‘ఏదైనా సాధించాలనుకుని పోరాడే వాళ్లకు ఈ డాక్యుమెంటరీ ఒక ప్రేమలేఖ’ అంటాడు అంతర్జాతీయ చెఫ్ వికాస్ ఖన్నా. 94 ఏళ్ల వయసులో పట్టుబట్టి కేరళ సాక్షరతా మిషన్‌లో నాలుగో క్లాసు పాసైన కార్తాయని అమ్మ మీద అతడు ‘బేర్‌ఫుట్ ఎంప్రెస్’ పేరుతో డాక్యుమెంటరీ నిర్మించాడు. ఇప్పటికే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పాల్గొన్న ఆ డాక్యుమెంటరీ త్వరలో భారతప్రేక్షకుల కోసం రిలీజ్ కానుంది. ఈ డాక్యుమెంటరీ ఆడపిల్లలందరినీ చదివించక తప్పని స్ఫూర్తినిస్తుంది అంటున్నాడు వికాస్.
అంతర్జాతీయ వంటగాడిగా ఖ్యాతి పొందిన వికాస్ ఖన్నాకు నానమ్మ వయసు ఉన్న వారు ఇచ్చే స్ఫూర్తి పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఎందుకంటే అతడు జన్మతః కాళ్లలో ఇబ్బందితో పుట్టాడు. అంటే 13 ఏళ్ల వరకు పరిగెత్తడం అతనికి సాధ్యం కాలేదు. దాంతో ఆడుకోవడానికి వెళ్లేవాడు కాదు. అందువల్ల అతడి నానమ్మ అతణ్ణి తన వంటగదిలో కూచోబెట్టుకుని వంటలు చేస్తూ మంచి మంచి కబుర్లు చెప్పేది. ఆమె వల్ల అతను స్ఫూర్తి పొందాడు. అంతే కాదు గొప్ప వంటవాడు అయ్యాడు.
ఇప్పుడు బహుశా కేరళ కార్తాయని అమ్మను చూసినప్పుడు అతనికి తన నానమ్మ గుర్తుకు వచ్చి ఉంటుంది. కార్తాయని అమ్మ 96 ఏళ్ల వయసులో చదువుకోవాలని సంకల్పించింది. పల్లెల్లో వయోజనులు చదువుకోవడం గురించి ఆలోచనే ఉండదు. ఇక 90 దాటిన వారిని ‘ఇంకా పిలుపు రాలేదా’ అన్నట్టు చూస్తూ ఉంటారు కొందరు. అలాంటిది కేరళలోని అలెప్పి జిల్లా ‘చెప్పడ్’ అనే చిన్న ఊళ్లోని కార్తాయని అమ్మ అందరి అంచనాలు తారుమారు చేసింది.
కేరళ ప్రభుత్వం వయోజనుల కోసం ఏర్పాటు చేసిన అక్షరాస్యతా కార్యక్రమం కింద ఇంట్లో ఉండి చదువుకుని నాలుగో తరగతిని వందకు 98 మార్కులతో పాసయ్యింది. 15 నుంచి 75 ఏళ్ల వయసు ఉన్నవారికి కనీస చదువు నేర్పాలనుకున్న ఈ కార్యక్రమంలో కార్తాయని అమ్మ ఉత్సాహంగా దూకింది. చదవడం (30 మార్కులకు పరీక్ష), రాయడం (40 మార్కులకు), లెక్కలు (30 మార్కులకు) ఈ మూడు అంశాల్లో ఉమ్మడిగా 100కు 30 మార్కులు వస్తే పాస్ చేస్తారు. కాని కార్తాయని అమ్మకు 98 మార్కులు వచ్చాయి. దాంతో ఆమెకు రాష్ట్రం మొత్తం సలామ్ చేసింది. ప్రతిష్ఠా్టత్మక కేంద్ర స్త్రీ శక్తి అవార్డు వరించింది.
‘ఏదైనా పట్టుబట్టి సాధించాలనుకునేవారికి ఆమెను మించిన స్ఫూర్తి లేదు’ అంటాకు వికాస్ ఖన్నా. ఇంతకు ముందు వికాస్ ఖన్నా ‘ది లాస్ట్ కలర్’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ డాక్యుమెంటరీ అతడి రెండో ప్రయత్నం. ఉత్త కాళ్లతో ఆమె ఒక యోధురాలిగా పరీక్ష రాయడానికి స్థానిక స్కూలుకు వెళుతున్న ఫొటో ఎవరినైనా కట్టి పడేస్తుంది. ఆ పరీక్షలో పాసయ్యి గెలిచి ఆమె పట్టుదలకు సామ్రాజ్ఞి అయ్యింది. అందుకే వికాస్ ఖన్నా ఈ డాక్యుమెంటరీకి ‘బేర్‌ఫుట్ ఎంప్రెస్’ (ఉత్తకాళ్ల సామ్రాజ్ఞి) అని పెట్టాడు.
నూరేళ్ల ఆయుష్షుకు చేరినా కార్తాయని అమ్మ ఇంకా చదువుకోవాలనే అభిలషిస్తోంది. ‘మరి అలాంటిది మన దేశంలో చిన్నారి ఆడపిల్లలు ఎంతమంది చదువుకోవాలని కోరుకుంటారో కదా. వారందరూ చదువుకోవాల్సిన అవసరాన్ని ఈ డాక్యుమెంటరీ చెప్తుంది’ అంటాడు వికాస్.
ఇప్పటికే అనేక అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో పాల్గొన్న ఈ డాక్యుమెంటరీ త్వరలో మన దేశంలో బహుశా ఓటీటీ ద్వారా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment