barefoot
-
తొమ్మిదేళ్లుగా చెప్పులు వేసుకోని యువకుడు.. కారణమిదే!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: చాలా మంది దేవుళ్ల పేరిట నియమ నిష్టలతో దీక్షలు చేస్తుండటం చూస్తూనే ఉంటాం.. కానీ 21 ఏళ్ల యువకుడు పాలడుగు జ్ఞానేశ్వర్ పర్యావరణాన్ని కాపాడాలనే సంకల్పంతో ‘పుడమి’దీక్ష తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షించేందుకు నడుం బిగించిన ఆయన.. భూమాతతో అనుబంధం విడిపోకూడదనే ఉద్దేశంతో తొమ్మిదేళ్లుగా చెప్పులు కూడా వేసుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం ముక్టాపూర్ గ్రామానికి చెందిన పాలడుగు జ్ఞానేశ్వర్ జువాలజీలో పీజీ చేశారు. జ్ఞానేశ్వర్ కుటుంబానికి మంజీరా తీరానికి సమీపంలో నాలుగు ఎకరాల భూమి ఉంది. కొన్నేళ్లుగా నదిలో నీరు లేక పొలాలన్నీ బీడువారాయి. దీంతో చలించిపోయిన జ్ఞానేశ్వర్ పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం మొదలుపెట్టారు. ధరణి బాగుంటేనే మనం బాగుంటామని, మొక్కలు నాటడంతోనే సరిపోదని, ఉన్న చెట్లను నరకకుండా కాపాడుకుంటేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని చాటి చెబుతున్నారు. గ్రీన్ సోల్జర్లను ఏర్పాటు చేసుకుని.. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు జ్ఞానేశ్వర్ తమ చుట్టుపక్కల ఉన్న సుమారు 35 గ్రామాల్లో హరిత సైన్యాన్ని (గ్రీన్ సోల్జర్స్)ను ఏర్పాటు చేసుకున్నారు. ఆయా గ్రామాల్లో పాఠశాల విద్యార్థులను హరిత సైనికులుగా ఏర్పాటు చేసుకున్నాడు. పర్యావరణ పరిపరక్షణ, మొక్కలు నాటడంపై వారికి అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఎవరైనా చెట్లు నరికేందుకు ప్రయత్నిస్తే ఆపాలని, వెంటనే తనకు ఫోన్ చేయాలని వారికి చెప్పారు. అలా ఫోన్ చేస్తే ఆ గ్రామానికి వెళ్లి విద్యార్థులతో కలిసి చెట్లను కౌగిలించుకుంటారు. చెట్లు నరకవద్దని కోరుతారు. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చి చెట్లు నరికి వేయకుండా కట్టడి చేస్తున్నాడు. ఏడాది క్రితం నాగల్గిద్దలో కొందరు పెద్ద చెట్టును నరికివేశారు. ఈ విషయం తెలిసిన జ్ఞానేశ్వర్.. అక్కడికి వెళ్లి మోడువారి వృక్షాన్ని తిరిగి భూమిలో పాతించాడు. కొద్దిరోజుల తర్వాత ఆ చెట్టు మళ్లీ చిగురించడం ఎంతో సంతోషం కలిగించిందని జ్ఞానేశ్వర్ చెబుతున్నారు. ప్రకృతిని కాపాడితేనే మనిషికి మనుగడ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి చాటి చెప్పేందుకే నేను చెప్పులు వేసుకోకుండా దీక్ష చేస్తున్నాను. భూమిపై ఉన్న ఏ ప్రాణి కూడా చెప్పుల్లాంటివి ధరించదు. పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్న మనిషి మాత్రమే చెప్పులు ధరిస్తున్నాడు. భూమికి మనిషికి ఉన్న అనుబంధం ఎన్నటికీ విడదీయలేనిది. పర్యావరణ సమత్యులతను కాపాడితేనే మానవ మనుగడ ఉంటుంది. దీనిని ఆచరణలో చూపేందుకు దీక్ష చేపట్టాను. –జ్ఞానేశ్వర్, పర్యావరణ ఉద్యమకారుడు యాత్రలతో అవగాహన పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జ్ఞానేశ్వర్ తరచూ గ్రామాల్లో హరిత సైనికులతో కలిసి పాదయాత్రలు, సైకిల్ యాత్రలు చేస్తుంటారు. నాగల్గిద్ద, కంగ్టి, మనూర్, నారాయణఖేడ్, న్యాల్కల్ తదితర మండలాల పరిధిలోని గ్రామాల్లో ఇలా యాత్రలు చేశారు. పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న జ్ఞానేశ్వర్‌కు ప్రతిష్టాత్మకమైన ‘సాక్షి’ఎక్స్‌లెన్స్ అవార్డు కూడా దక్కింది. చదవండి: అపార్థం చేసుకున్నాం.. గుంజీలు శిక్ష కాదు.. సూపర్ బ్రెయిన్ యోగా..! -
Barefoot Empress: పోరాడే వాళ్లకో ప్రేమలేఖ
‘ఏదైనా సాధించాలనుకుని పోరాడే వాళ్లకు ఈ డాక్యుమెంటరీ ఒక ప్రేమలేఖ’ అంటాడు అంతర్జాతీయ చెఫ్ వికాస్ ఖన్నా. 94 ఏళ్ల వయసులో పట్టుబట్టి కేరళ సాక్షరతా మిషన్‌లో నాలుగో క్లాసు పాసైన కార్తాయని అమ్మ మీద అతడు ‘బేర్‌ఫుట్ ఎంప్రెస్’ పేరుతో డాక్యుమెంటరీ నిర్మించాడు. ఇప్పటికే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పాల్గొన్న ఆ డాక్యుమెంటరీ త్వరలో భారతప్రేక్షకుల కోసం రిలీజ్ కానుంది. ఈ డాక్యుమెంటరీ ఆడపిల్లలందరినీ చదివించక తప్పని స్ఫూర్తినిస్తుంది అంటున్నాడు వికాస్. అంతర్జాతీయ వంటగాడిగా ఖ్యాతి పొందిన వికాస్ ఖన్నాకు నానమ్మ వయసు ఉన్న వారు ఇచ్చే స్ఫూర్తి పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఎందుకంటే అతడు జన్మతః కాళ్లలో ఇబ్బందితో పుట్టాడు. అంటే 13 ఏళ్ల వరకు పరిగెత్తడం అతనికి సాధ్యం కాలేదు. దాంతో ఆడుకోవడానికి వెళ్లేవాడు కాదు. అందువల్ల అతడి నానమ్మ అతణ్ణి తన వంటగదిలో కూచోబెట్టుకుని వంటలు చేస్తూ మంచి మంచి కబుర్లు చెప్పేది. ఆమె వల్ల అతను స్ఫూర్తి పొందాడు. అంతే కాదు గొప్ప వంటవాడు అయ్యాడు. ఇప్పుడు బహుశా కేరళ కార్తాయని అమ్మను చూసినప్పుడు అతనికి తన నానమ్మ గుర్తుకు వచ్చి ఉంటుంది. కార్తాయని అమ్మ 96 ఏళ్ల వయసులో చదువుకోవాలని సంకల్పించింది. పల్లెల్లో వయోజనులు చదువుకోవడం గురించి ఆలోచనే ఉండదు. ఇక 90 దాటిన వారిని ‘ఇంకా పిలుపు రాలేదా’ అన్నట్టు చూస్తూ ఉంటారు కొందరు. అలాంటిది కేరళలోని అలెప్పి జిల్లా ‘చెప్పడ్’ అనే చిన్న ఊళ్లోని కార్తాయని అమ్మ అందరి అంచనాలు తారుమారు చేసింది. కేరళ ప్రభుత్వం వయోజనుల కోసం ఏర్పాటు చేసిన అక్షరాస్యతా కార్యక్రమం కింద ఇంట్లో ఉండి చదువుకుని నాలుగో తరగతిని వందకు 98 మార్కులతో పాసయ్యింది. 15 నుంచి 75 ఏళ్ల వయసు ఉన్నవారికి కనీస చదువు నేర్పాలనుకున్న ఈ కార్యక్రమంలో కార్తాయని అమ్మ ఉత్సాహంగా దూకింది. చదవడం (30 మార్కులకు పరీక్ష), రాయడం (40 మార్కులకు), లెక్కలు (30 మార్కులకు) ఈ మూడు అంశాల్లో ఉమ్మడిగా 100కు 30 మార్కులు వస్తే పాస్ చేస్తారు. కాని కార్తాయని అమ్మకు 98 మార్కులు వచ్చాయి. దాంతో ఆమెకు రాష్ట్రం మొత్తం సలామ్ చేసింది. ప్రతిష్ఠా్టత్మక కేంద్ర స్త్రీ శక్తి అవార్డు వరించింది. ‘ఏదైనా పట్టుబట్టి సాధించాలనుకునేవారికి ఆమెను మించిన స్ఫూర్తి లేదు’ అంటాకు వికాస్ ఖన్నా. ఇంతకు ముందు వికాస్ ఖన్నా ‘ది లాస్ట్ కలర్’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ డాక్యుమెంటరీ అతడి రెండో ప్రయత్నం. ఉత్త కాళ్లతో ఆమె ఒక యోధురాలిగా పరీక్ష రాయడానికి స్థానిక స్కూలుకు వెళుతున్న ఫొటో ఎవరినైనా కట్టి పడేస్తుంది. ఆ పరీక్షలో పాసయ్యి గెలిచి ఆమె పట్టుదలకు సామ్రాజ్ఞి అయ్యింది. అందుకే వికాస్ ఖన్నా ఈ డాక్యుమెంటరీకి ‘బేర్‌ఫుట్ ఎంప్రెస్’ (ఉత్తకాళ్ల సామ్రాజ్ఞి) అని పెట్టాడు. నూరేళ్ల ఆయుష్షుకు చేరినా కార్తాయని అమ్మ ఇంకా చదువుకోవాలనే అభిలషిస్తోంది. ‘మరి అలాంటిది మన దేశంలో చిన్నారి ఆడపిల్లలు ఎంతమంది చదువుకోవాలని కోరుకుంటారో కదా. వారందరూ చదువుకోవాల్సిన అవసరాన్ని ఈ డాక్యుమెంటరీ చెప్తుంది’ అంటాడు వికాస్. ఇప్పటికే అనేక అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో పాల్గొన్న ఈ డాక్యుమెంటరీ త్వరలో మన దేశంలో బహుశా ఓటీటీ ద్వారా విడుదల కానుంది. -
కాళ్లకు చెప్పులు లేవ్.. ‘కుటుంబం ఆకలి తీర్చాలిగా!’
వైరల్: మంచి కంటే చెడునే తొందరగా మనిషి దృష్టిని ఆకర్షిస్తుంది. అందునా సోషల్ మీడియాలోనూ అదే తరహా కంటెంట్‌పై ఎక్కువగా చర్చ నడుస్తుంటుంది కూడా. అలా చేశారు.. ఇలా చేశారు అంటూ డెలివరీ బాయ్‌లు/ఏజెంట్ల గురించి రకరకాల కథనాలు వైరల్ అవుతుంటాయి. ఎంతసేపు నెగెటివ్ విషయాలేనా? అప్పుడప్పుడు మంచిపై కూడా ఓ లుక్కేద్దాం. తారిఖ్ ఖాన్ అనే వ్యక్తి.. లింకెడ్ఇన్లో ఈమధ్య ఓ పోస్ట్ షేర్ చేశారు. ఎలివేటర్లో ఉండగా ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్ ఆయన దృష్టిని ఆకర్షించారట. అతని కాళ్లకు చెప్పులు, షూస్ లేకుండా కనిపించాడట. ఎందుకలా వచ్చావ్? అని అడిగితే.. దారిలో చిన్నయాక్సిడెంట్ అయ్యిందని, చెప్పులు ఎక్కడో పడిపోయాయని, పైగా కాలికి గాయంతో వాపు వచ్చిందని, అందుకే వేసుకోలేదని చెప్పాడు ఆ డెలివరీబాయ్. అలాంటప్పుడు పని ఆపి కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని అతనికి సూచించాడు తారిఖ్. దానికి అతను నవ్వుతూ.. ‘నాకంటూ ఓ కుటుంబం ఉంది సార్. ఆ కుటుంబాన్ని పోషించుకోవాలి కదా’’ అంటూ లిఫ్ట్ బయటకు వెళ్లిపోయాడు. పోతూ పోతూ మర్యాదపూర్వకంగా శుభసాయంత్రం సార్ అని చెప్పివెళ్లిపోయాడు అని తారిఖ్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. కష్టపడి పనిచేయడానికి, అవసరమైన వేళలో నన్ను నేను ముందుకు వెళ్లడానికి ఇతనిలాంటి వ్యక్తులే నాకు స్ఫూర్తి అంటూ తారిఖ్ ఖాన్ లింకెడ్ఇన్లో ఆ పోస్ట్ షేర్ చేశారు. అంతేకాదు.. అతనికి సాయం కూడా అందించాడు. సదరు కంపెనీ కూడా ఆ డెలివరీ బాయ్ లాంటి వాళ్ల కష్టాన్ని గుర్తించాలని కోరాడు తారిఖ్. అతనికి ఎవరైనా సాయం చేయాలని అనుకుంటే.. తనకు సందేశం పంపాలని, ఆ డెలివరీ ఏజెంట్ పేటీఎం నెంబర్ ఇస్తానని చెప్పాడు తారిఖ్. ఎక్కడ జరిగిందో క్లారిటీ లేకపోయినా.. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంది. -
ఫేస్బుక్లో ఆ ఫోటో ప్రత్యేక ఆకర్షణ
కాళ్ళకు కనీసం చెప్పులు కూడ లేవు. రద్దీగా ఉండే ప్రాంతంలో రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై ఓ కార్డుబోర్డు బాక్సు పై కూర్చొని చాలా శ్రద్ధగా హోంవర్క్ చేసుకుంటోందా బాలిక. పక్కనే ఆమె సోదరి... ఇద్దరూ నలిగి.. మాసిపోయిన పైజమాలు ధరించి, మట్టి కొట్టుకు పోయిన ముఖాలతో కనిపించడం ఫిలిప్పీన్ కు చెందిన జేమ్స్ కో అనే ఫోటో గ్రాఫర్ ను ఆకట్టుకుంది. వెంటనే ఆ ఇద్దరు బాలికలను క్లిక్ మనిపించాడు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నాడు. అంతటితో ఊరుకోలేదు. ఆ ఫోటోను ఫేస్ బుక్ లో కూడ పోస్ట్ చేశాడు. ఇప్పుడా ఫోటో ఫేస్ బుక్ లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. పన్నెండు వేలకు పైగా లైక్ లు కూడ వచ్చాయి. సియెలో కంజేల్స్ తన సోదరి జెనలిన్... ఆ ఇద్దరు బాలికలూ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడ తీక్షణంగా తమ తమ నోట్ ప్యాడ్స్ లో హోం వర్క్ చేసుకుంటూనే ఉన్నారు. వారికి దూరంగా లిండా గోంజేల్స్ అనే మహిళ వీధిలో కూర్చొని ఉంది. ఆమె బహుశా వారికి తల్లి అయి ఉండొచ్చు. సియెలో తన చేతిలోని నోట్ పుస్తకంలో అక్షరాలు దిద్దుతోంది. మరొక పుస్తకంలో లెక్కలు ప్రాక్టీస్ చేస్తూ కెమెరాలకు ఫోజిచ్చింది. అయితే ఆ ఫోటోలోని వివరాలను బట్టి వారి కుటుంబ పరిస్థితులను అంచనా వేయొచ్చు. ఫోటోను చూసిన ఓ ఫేస్ బుక్ యూజర్ మాత్రం ఈ విషయంలో స్పందించాడు. ''ఆ బాలికలు ఎవరో తెలియదు. కానీ వారికి చదువుపట్ల ఉన్న శ్రద్ధనుమాత్రం ప్రశంసించాలి. వారి చదువుకు కావలసిన సహాయం స్వచ్ఛంద సంస్థలుగాని, ప్రభుత్వం గాని అందించి ఆదుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను" అంటూ తన కామెంట్ ను పోస్ట్ చేశాడు. గతంలో కూడా ఇటువంటి ఒక దృశ్యం ఎందరినో ఆకర్శించింది. మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ కిటికీ సందుల్లోంచి వచ్చే వెలుగుల్లో చదువుకుంటున్న డానియెల్ కాబెరెరా అనే మూడోక్లాసు చదువుతున్న తొమ్మిదేళ్ళ చిన్నారి స్థితిని కూడ ఫిలిప్పీన్స్ కెమెరాలో బంధించారు. మెడికల్ స్టూడెంట్ జాయిస్ టొర్రెఫ్రాంకా తీసిన ఫొటోగ్రాఫ్ ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దీంతో ఆ చిన్నారి పరిస్థితికే కాదు... అంత చిన్న వయసులో అతడు చదువుపై చూపిస్తున్న శ్రద్ధకు అంతా ముగ్ధులయ్యారు. లక్షలకొద్దీ ఆర్థిక సాయం అందించారు. ఓ చిన్న ఫోటో అతడి జీవితంలో ఎంతో మార్పును తెస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. మరిప్పుడు ఈ బాలికలకు కూడ అటువంటి సహాయం అందాలని ఆశిద్దాం.