ఫేస్బుక్లో ఆ ఫోటో ప్రత్యేక ఆకర్షణ
కాళ్ళకు కనీసం చెప్పులు కూడ లేవు. రద్దీగా ఉండే ప్రాంతంలో రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై ఓ కార్డుబోర్డు బాక్సు పై కూర్చొని చాలా శ్రద్ధగా హోంవర్క్ చేసుకుంటోందా బాలిక. పక్కనే ఆమె సోదరి... ఇద్దరూ నలిగి.. మాసిపోయిన పైజమాలు ధరించి, మట్టి కొట్టుకు పోయిన ముఖాలతో కనిపించడం ఫిలిప్పీన్ కు చెందిన జేమ్స్ కో అనే ఫోటో గ్రాఫర్ ను ఆకట్టుకుంది. వెంటనే ఆ ఇద్దరు బాలికలను క్లిక్ మనిపించాడు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నాడు. అంతటితో ఊరుకోలేదు. ఆ ఫోటోను ఫేస్ బుక్ లో కూడ పోస్ట్ చేశాడు. ఇప్పుడా ఫోటో ఫేస్ బుక్ లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. పన్నెండు వేలకు పైగా లైక్ లు కూడ వచ్చాయి.
సియెలో కంజేల్స్ తన సోదరి జెనలిన్... ఆ ఇద్దరు బాలికలూ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడ తీక్షణంగా తమ తమ నోట్ ప్యాడ్స్ లో హోం వర్క్ చేసుకుంటూనే ఉన్నారు. వారికి దూరంగా లిండా గోంజేల్స్ అనే మహిళ వీధిలో కూర్చొని ఉంది. ఆమె బహుశా వారికి తల్లి అయి ఉండొచ్చు. సియెలో తన చేతిలోని నోట్ పుస్తకంలో అక్షరాలు దిద్దుతోంది. మరొక పుస్తకంలో లెక్కలు ప్రాక్టీస్ చేస్తూ కెమెరాలకు ఫోజిచ్చింది. అయితే ఆ ఫోటోలోని వివరాలను బట్టి వారి కుటుంబ పరిస్థితులను అంచనా వేయొచ్చు. ఫోటోను చూసిన ఓ ఫేస్ బుక్ యూజర్ మాత్రం ఈ విషయంలో స్పందించాడు.
''ఆ బాలికలు ఎవరో తెలియదు. కానీ వారికి చదువుపట్ల ఉన్న శ్రద్ధనుమాత్రం ప్రశంసించాలి. వారి చదువుకు కావలసిన సహాయం స్వచ్ఛంద సంస్థలుగాని, ప్రభుత్వం గాని అందించి ఆదుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను" అంటూ తన కామెంట్ ను పోస్ట్ చేశాడు.
గతంలో కూడా ఇటువంటి ఒక దృశ్యం ఎందరినో ఆకర్శించింది. మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ కిటికీ సందుల్లోంచి వచ్చే వెలుగుల్లో చదువుకుంటున్న డానియెల్ కాబెరెరా అనే మూడోక్లాసు చదువుతున్న తొమ్మిదేళ్ళ చిన్నారి స్థితిని కూడ ఫిలిప్పీన్స్ కెమెరాలో బంధించారు. మెడికల్ స్టూడెంట్ జాయిస్ టొర్రెఫ్రాంకా తీసిన ఫొటోగ్రాఫ్ ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దీంతో ఆ చిన్నారి పరిస్థితికే కాదు... అంత చిన్న వయసులో అతడు చదువుపై చూపిస్తున్న శ్రద్ధకు అంతా ముగ్ధులయ్యారు. లక్షలకొద్దీ ఆర్థిక సాయం అందించారు. ఓ చిన్న ఫోటో అతడి జీవితంలో ఎంతో మార్పును తెస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. మరిప్పుడు ఈ బాలికలకు కూడ అటువంటి సహాయం అందాలని ఆశిద్దాం.