సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: చాలా మంది దేవుళ్ల పేరిట నియమ నిష్టలతో దీక్షలు చేస్తుండటం చూస్తూనే ఉంటాం.. కానీ 21 ఏళ్ల యువకుడు పాలడుగు జ్ఞానేశ్వర్ పర్యావరణాన్ని కాపాడాలనే సంకల్పంతో ‘పుడమి’దీక్ష తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షించేందుకు నడుం బిగించిన ఆయన.. భూమాతతో అనుబంధం విడిపోకూడదనే ఉద్దేశంతో తొమ్మిదేళ్లుగా చెప్పులు కూడా వేసుకోవడం లేదు.
సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం ముక్టాపూర్ గ్రామానికి చెందిన పాలడుగు జ్ఞానేశ్వర్ జువాలజీలో పీజీ చేశారు. జ్ఞానేశ్వర్ కుటుంబానికి మంజీరా తీరానికి సమీపంలో నాలుగు ఎకరాల భూమి ఉంది. కొన్నేళ్లుగా నదిలో నీరు లేక పొలాలన్నీ బీడువారాయి. దీంతో చలించిపోయిన జ్ఞానేశ్వర్ పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం మొదలుపెట్టారు. ధరణి బాగుంటేనే మనం బాగుంటామని, మొక్కలు నాటడంతోనే సరిపోదని, ఉన్న చెట్లను నరకకుండా కాపాడుకుంటేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని చాటి చెబుతున్నారు.
గ్రీన్ సోల్జర్లను ఏర్పాటు చేసుకుని..
పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు జ్ఞానేశ్వర్ తమ చుట్టుపక్కల ఉన్న సుమారు 35 గ్రామాల్లో హరిత సైన్యాన్ని (గ్రీన్ సోల్జర్స్)ను ఏర్పాటు చేసుకున్నారు. ఆయా గ్రామాల్లో పాఠశాల విద్యార్థులను హరిత సైనికులుగా ఏర్పాటు చేసుకున్నాడు. పర్యావరణ పరిపరక్షణ, మొక్కలు నాటడంపై వారికి అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఎవరైనా చెట్లు నరికేందుకు ప్రయత్నిస్తే ఆపాలని, వెంటనే తనకు ఫోన్ చేయాలని వారికి చెప్పారు.
అలా ఫోన్ చేస్తే ఆ గ్రామానికి వెళ్లి విద్యార్థులతో కలిసి చెట్లను కౌగిలించుకుంటారు. చెట్లు నరకవద్దని కోరుతారు. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చి చెట్లు నరికి వేయకుండా కట్టడి చేస్తున్నాడు. ఏడాది క్రితం నాగల్‌గిద్దలో కొందరు పెద్ద చెట్టును నరికివేశారు. ఈ విషయం తెలిసిన జ్ఞానేశ్వర్.. అక్కడికి వెళ్లి మోడువారి వృక్షాన్ని తిరిగి భూమిలో పాతించాడు. కొద్దిరోజుల తర్వాత ఆ చెట్టు మళ్లీ చిగురించడం ఎంతో సంతోషం కలిగించిందని జ్ఞానేశ్వర్ చెబుతున్నారు.
ప్రకృతిని కాపాడితేనే మనిషికి మనుగడ
పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి చాటి చెప్పేందుకే నేను చెప్పులు వేసుకోకుండా దీక్ష చేస్తున్నాను. భూమిపై ఉన్న ఏ ప్రాణి కూడా చెప్పుల్లాంటివి ధరించదు. పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్న మనిషి మాత్రమే చెప్పులు ధరిస్తున్నాడు. భూమికి మనిషికి ఉన్న అనుబంధం ఎన్నటికీ విడదీయలేనిది. పర్యావరణ సమత్యులతను కాపాడితేనే మానవ మనుగడ ఉంటుంది. దీనిని ఆచరణలో చూపేందుకు దీక్ష చేపట్టాను.
–జ్ఞానేశ్వర్, పర్యావరణ ఉద్యమకారుడు
యాత్రలతో అవగాహన
పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జ్ఞానేశ్వర్ తరచూ గ్రామాల్లో హరిత సైనికులతో కలిసి పాదయాత్రలు, సైకిల్ యాత్రలు చేస్తుంటారు. నాగల్‌గిద్ద, కంగ్టి, మనూర్, నారాయణఖేడ్, న్యాల్‌కల్ తదితర మండలాల పరిధిలోని గ్రామాల్లో ఇలా యాత్రలు చేశారు. పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న జ్ఞానేశ్వర్‌కు ప్రతిష్టాత్మకమైన ‘సాక్షి’ఎక్స్‌లెన్స్ అవార్డు కూడా దక్కింది.
చదవండి: అపార్థం చేసుకున్నాం.. గుంజీలు శిక్ష కాదు.. సూపర్ బ్రెయిన్ యోగా..!
Comments
Please login to add a commentAdd a comment