International Literacy Day
-
International Literacy Day: అందరికీ విద్య అందేదెన్నడు?
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ అక్షరాస్యతలో ఇంక వెనుకబడే ఉన్నాం. 2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. విద్యా రంగంలో నెలకొన్న సవాళ్లతో పాటు పులి మీద పుట్రలా కరోనా మహమ్మారి విసిరిన పంజాతో 100% అక్షరాస్యత సుదూర స్వప్నంగా మారింది. ప్రజల్లో విద్యపై అవగాహన పెంచడానికి యూనెస్కో ప్రతీ ఏడాది సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.1966 నుంచి విద్యపై విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రపంచ నిరక్షరాస్యుల్లో 34% మంది భారత్‌లోనే ఉండడం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత 2.4 కోట్ల మంది తిరిగి బడిలో చేరలేదు. వారిలో 1.1 కోట్ల మంది అమ్మాయిలున్నారు. కరోనా ప్రభావం కరోనా లాక్డౌన్లతో దేశంలో 15లక్షల స్కూళ్లు మూత పడ్డాయని, 24.7 కోట్ల విద్యార్థులు ఏడాది పాటు చదువుకి దూరమయ్యారని యునెస్కో వెల్లడించింది. తర్వాత కూడా 30% విద్యార్థులు తిరిగి స్కూళ్లలో చేరలేదని చెబుతోంది. సాధించిన పురోగతి ఇదీ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి ఇప్పటివరకు అక్షరాస్యతలో గణనీయమైన పురోగతి సాధించాం. ఏడేళ్ల వయసు కంటే ఎక్కువ ఉన్న వారు ఏదో ఒక భాషలో చదవడం, రాయడం వస్తే వారిని అక్షరాస్యులుగా పరిగణిస్తారు. 1951లో 18.3% ఉన్న అక్షరాస్యత రేటు 2022 వచ్చేసరికి 77.7శాతానికి పెరిగింది. మొదట్లో అక్షరాస్యతలో లింగ వివక్ష అధికంగా ఉండేది. దానిని కూడా క్రమక్రమంగా దాటుకుంటూ వస్తున్నప్పటికీ అమ్మాయిల్లో అక్షరాస్యత ఇంకా సవాళ్లు విసురుతోంది. 1961లో కేవలం 15.4% మంది మహిళా జనాభా అక్షరాస్యులైతే ఆ తర్వాత పదేళ్లకి 1971లో 22% 2001 నాటికి 53.7% , 2022 నాటికి 70శాతం మహిళలు అక్షరాస్యులయ్యారు. అన్నింటికంటే మైనార్టీ విద్యార్థుల్లో డ్రాప్అవుట్ల నివారించడంలో భారత్ కొంతమేరకు విజయం సాధించింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం 2015–16లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు దాదాపుగా 9% ఉన్న డ్రాపవుట్లు 2020–21కి 0.8శాతానికి తగ్గాయి. ప్రాథమిక పాఠశాలలు 10 రెట్లు పెరిగాయి. ఎదురవుతున్న సవాళ్లు సంపూర్ణ అక్షరాస్యత సాధనకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. పేదరికం, తల్లిదండ్రుల అవగాహన లేమి, లింగ, కుల వివక్ష, సదుపాయాల లేమి, సాంకేతిక పరిజ్ఞానం అందకపోవడం వంటివన్నీ భారత్‌లో అనుకున్న స్థాయిలో అక్షరాస్యతను పెంచలేకపోతున్నాయి. గ్రామీణ నిరుపేదలకు స్కూళ్లు అందుబాటులో ఉండటం లేదు. పూట గడవని ఉండే కుటుంబాలు పిల్లల్ని పలక బలపం బదులు పలుగు పార పట్టిస్తున్నారు. దేశంలో ఏకంగా కోటి మంది చిన్నారులు బడికి వెళ్లడానికి బదులుగా బాలకార్మికులుగా మారారు. 2022 నాటికి పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత 87.7% ఉంటే గ్రామీణ భారతంలో 73.5% ఉన్నట్టుగా నేషనల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక చెబుతోంది. దీనికి కారణం గ్రామాల్లో ఉన్న తల్లిదండ్రులకే అక్షరజ్ఞానం లేకపోవడంతో వారికి చదువు ప్రాధాన్యం గురించి తెలియక పిల్లల్ని బడికి పంపించడం లేదు. అమ్మాయిల్లో అక్షరాస్యత తక్కువగా ఉండడానికి బాల్య వివాహాలు, పాఠశాలల్లో టాయిలెట్ సదుపాయం లేకపోవడమే ప్రధాన కారణాలని పలు సర్వేల్లో తేలింది. ఇప్పటికీ దేశంలో 40% పాఠశాలల్లో టాయిలెట్ సదుపాయం లేదు. జీడీపీలో 6% విద్యా రంగానికి ఖర్చు చేస్తేనే అక్షరాస్యత రేటు పెరుగుతుందని నిపుణులు సూచిస్తూ ఉంటే 3% కూడా పెట్టడం లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ శక్తి కేవలం విద్యకే ఉంది: సీఎం జగన్
సాక్షి, అమరావతి: పేదరికం, అసమానతలను అధిగమించడంలో విద్య ముఖ్య భూమిక పోషిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జీవితాలను ఉన్నత శిఖరాలకు చేర్చగల, సాధికారికత చేకూర్చగల శక్తి చదువుకు ఉందన్నారు. అంతటి ప్రాముఖ్యం గల విద్యను ప్రతి ఒక్కరికి అందించేందుకు అమ్మ ఒడి, నాడు- నేడు, విద్యా దీవెన తదితర పథకాలను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు చేపట్టి , 100 శాతం అక్షరాస్యత సాధించేలా రాష్ట్రాన్ని నడిపించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ ఈమేరకు ట్వీట్ చేశారు. (చదవండి: ఇదీ పౌష్టికాహార మెనూ.. ) కాగా పిల్లలకు ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అంటే.. అది చదువేనని విశ్వసించే సీఎం జగన్ విద్యార్థుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికే ‘అమ్మ ఒడి’ అమలు చేస్తున్నారు. ‘జగనన్న గోరుముద్ద’పేరిట మధ్యాహ్న భోజనం పథకంలో మార్పులు తీసుకువచ్చి విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ‘జగనన్న విద్యా కానుక’తో బుక్స్, నోట్స్, యూనిఫాం, షూస్, బ్యాగ్ తదితరాలు పంపిణీ చేస్తున్నారు. నాడు - నేడుతో ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులకు నాంది పలికారు. అదే విధంగా మాతృభాషకు ప్రాధాన్యమిస్తూనే.. పేద విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా సన్నద్ధం చేసేందుకు, ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక జగనన్న వసతి దీవెన పథకం కింద ప్రతి విద్యార్థికి భోజనం, వసతి ఖర్చుల కోసం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం ఏటా రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ కోర్సును బట్టి అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. Education can empower, transform & uplift lives; it is an important tool to combat poverty & inequality. Through schemes like Amma Vodi, Nadu-Nedu, Vidya Deevana... we're redefining the education system in AP, paving the way for 100% literacy. #InternationalLiteracyDay — YS Jagan Mohan Reddy (@ysjagan) September 8, 2020 -
నైపుణ్యం కట్టుకోండి..
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మనం అక్షరాస్యతలో అభివృద్ధి సాధించాం. చాలా అంశాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లే, అక్షరాస్యతలో సాధించిన అభివృద్ధిలోనూ వ్యత్యాసాలు ఉన్నాయి. మనదేశంలో కొన్ని ప్రాంతాలు అక్షరాస్యతలో గణనీయమైన అభివృద్ధినే సాధించినా, మరికొన్ని ప్రాంతాలు ఇప్పటికీ ఇంకా వెనుకబడే ఉన్నాయి. అక్షరాస్యత పెరిగిన కారణంగా, దేశవ్యాప్తంగా ఉన్నత విద్యావంతుల సంఖ్య పెరుగుతోంది. కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి ఏటా బయటకు వచ్చే పట్టభద్రుల సంఖ్య పెరుగుతోంది. స్వాతంత్య్రానికి ముందు మన దేశంలో అక్షరాస్యత తక్కువగానే ఉన్నా, అప్పట్లో పట్టభద్రులైన వారు తక్కువ మందే అయినా, వారిలో చదువుకు తగిన నైపుణ్యాలు ఉండేవి. ఇప్పటి పట్టభద్రుల చేతికి పట్టాలైతే వస్తున్నాయి గాని, వారిలో చదువుకు తగిన నైపుణ్యాలే కొరవడుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వాలే తగిన చర్యలు ప్రారంభించి పుణ్యం కట్టుకోవాలి. మన దేశంలో ఇప్పటికీ పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్న వారు సైతం చిన్న చిన్న ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. దేశంలో ఒకప్పుడు ఉన్నంత దారుణమైన నిరుద్యోగ పరిస్థితులు లేకపోయినా, ఇంజనీరింగ్, టెక్నాలజీ గ్రాడ్యుయేట్లు సైతం అటెండర్ స్థాయి పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్న ఉదంతాలు ఉంటున్నాయంటే పరిస్థితులను ఊహించుకోవాల్సిందే. వాళ్లు ఉద్యోగాలకు పనికిరారు... మన దేశంలో కార్పొరేట్ సంస్థలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. ప్రభుత్వాల చొరవతో బహుళజాతి సంస్థలు సైతం ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ సంస్థలన్నింటికీ పెద్దసంఖ్యలోనే వివిధ నైపుణ్యాలకు సంబంధించిన ఇంజనీరింగ్ పట్టభద్రులు పెద్దసంఖ్యలో అవసరం. మన దేశంలో ఐఐటీ వంటి ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థలు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలే కాకుండా, పెద్దసంఖ్యలో ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఏటా లక్షలాది సంఖ్యలో ఇంజనీరింగ్ పట్టభద్రులు పుట్టుకొస్తున్నారు. వీరి చేతుల్లో పట్టాలైతే ఉంటున్నాయి గాని, వీరు పొందిన పట్టాలకు తగిన నైపుణ్యాలే కొరవడుతున్నాయి. మన దేశంలో తయారవుతున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో దాదాపు 80 శాతం మంది ఉద్యోగాలకు పనికిరారని, వారిలో ఉద్యోగాలకు కావలసిన నైపుణ్యాలు బొత్తిగా లేవని, ‘నాలెడ్జ్ ఎకానమీ’లో వారు ఇమడటం సాధ్యం కాదని ‘ఆస్పైరింగ్ మైండ్స్’ విడుదల చేసిన ‘యాన్యువల్ ఎంప్లాయబిలిటీ సర్వే–2019’ నివేదిక కుండ బద్దలు కొట్టింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు కోడ్ రాసే నైపుణ్యం కీలకం. మన దేశంలో చక్కగా కోడ్ రాయగలిగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కేవలం 4.6 శాతం మంది మాత్రమే. పొరుగు దేశమైన చైనా ఈ విషయంలో మరీ అధ్వానంగా ఉంది. అక్కడి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో మంచి కోడ్ రాయగలిగేవారు 2.1 శాతం మంది మాత్రమే. అమెరికన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో మంచి కోడ్ రాయగలిగే వారు 18.8 శాతం మంది వరకు ఉంటున్నారు. చైనా కంటే మెరుగ్గా ఉన్నామని చంకలు గుద్దుకోవాలో, అమెరికా కంటే వెనుకబడినందుకు ఆవేదన చెందాలో మన విద్యావ్యవస్థను శాసిస్తున్న ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలి. వివిధ రంగాలకు చెందిన ఇంజనీర్లలో ఉద్యోగాలకు పనికొచ్చేవారి సంఖ్య అత్యంత దయనీయంగా ఉన్నట్లు ‘యాన్యువల్ ఎంప్లాయబిలిటీ సర్వే–2019’ నివేదికలో బయటపడింది. కీలకమైన రంగాల్లో మన ఇంజనీర్ల ఎంప్లాయబిలిటీ పరిస్థితిపై ఈ నివేదిక వెల్లడించిన గణాంకాలు ఇవీ...మిగిలిన విభాగాల్లో కూడా మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లది ఇదే పరిస్థితి. ఎంపిక చేసుకున్న కీలక అంశాల్లోనే కాదు, కనీసం విషయాన్ని ఆకళింపు చేసుకునే నైపుణ్యాలు, సమర్థంగా ఉద్యోగాలు చేయడానికి అవసరమైన భాషా నైపుణ్యాలలో కూడా మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు దారుణంగా వెనుకబడి ఉంటున్నారు. దేశవ్యాప్తంగా మన ఇంజనీరింగ్ విద్య ఎక్కువగా ‘థియరీ’ చదువుకోవడం వరకు మాత్రమే పరిమితమవుతోంది. దాదాపు సగానికి సగం మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాక్టికల్ శిక్షణకు నోచుకోవడం లేదు. కేవలం 40 శాతం మంది మాత్రమే ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకుంటున్నారు. మిగిలిన 60 శాతం మందికి ఇంజనీరింగ్‌లోని మౌలిక అంశాలు సంబంధిత పరిశ్రమలలో ఎలా ఉపయోగపడతాయనే దానిపై కనీసమైన అవగాహన కూడా ఉండటం లేదు. పురోగతి అక్షరాస్యతకే పరిమితం మనం సాధించిన పురోగతి అంతా అక్షరాస్యతకే పరిమితం. అక్షరాలు కూడబలుక్కుని చదవడం, చేతినంతా కూడదీసుకుని సంతకం చేయడం వస్తే చాలు, అక్షరాస్యుల జాబితాలో చేరిపోవడానికి. అక్షరాస్యతపై రూపొందించుకున్న గణాంకాలకు విద్యా నాణ్యత గురించి ఎలాంటి పట్టింపులూ లేవు. వయోజనుల్లోను, యువజనుల్లోను అక్షరాస్యతపై ‘యూనెస్కో’ 2015లో విడుదల చేసిన గణాంకాలు ఇవీ..చైనా సంగతి సరే, మన కంటే ఆర్థికంగా, సాంకేతికంగా వెనుకబడిన శ్రీలంక, మయాన్మార్లాంటి చిన్న దేశాలు సైతం అక్షరాస్యతలో మనకంటే ముందంజలో ఉన్నాయి. యువజన అక్షరాస్యతలో నేపాల్ మనకంటే ముందంజలో ఉందని ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచానికి కావలసినవి నైపుణ్యాలే! శాస్త్ర సాంకేతిక పురోగతి శరవేగం పుంజుకున్న నేపథ్యంలో ఇప్పటి ప్రపంచానికి కావలసినవి నైపుణ్యాలే! ఉద్యోగాలు పొందాలంటే, వాటికి కావలసిన నైపుణ్యాలు కచ్చితంగా ఉండి తీరాలి. నైపుణ్యాలతో పనిలేని లేదా అరకొర నైపుణ్యాలు సరిపోయే ఉద్యోగాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అతి తక్కువ నైపుణ్యాలతో నెట్టుకొచ్చే ఉద్యోగాల సంఖ్య 2010 నాటికి 74 శాతం ఉంటే, 2020 నాటికి ఈ ఉద్యోగాలు 62 శాతానికి పడిపోతాయని అంచనా. మరోవైపు తగిన నైపుణ్యాలు గల ఉద్యోగుల అవసరం విపరీతంగా పెరుగుతోంది. వచ్చే ఏడాది నాటికి వివిధ రంగాల్లో నైపుణ్యాలు గల ఉద్యోగులు దాదాపు 1.80 కోట్ల మంది అదనంగా అవసరమవుతారు. ఇదే సమయానికి భారత్‌లో 4.70 కోట్ల మంది కార్మికులు చేతిలో పని లేకుండా పోయే పరిస్థితులు ఉన్నాయని, వీళ్లంతా ఎలాంటి నైపుణ్యాలూ లేనివాళ్లే అయి ఉంటారని ‘అప్‌గ్రేడ్’ సంస్థ చేపట్టిన అధ్యయనంలో తేలింది. పని కోల్పోయే ఈ మిగులు కార్మికులకు పరిశ్రమలకు అవసరమయ్యే నైపుణ్యాలలో తగిన శిక్షణ కల్పించి, వారిని పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం ఎలా అన్నదే భారత్ ముందు ఉన్న సవాలు అని ‘అప్‌గ్రేడ్’ సంస్థ తరఫున అధ్యయనం చేపట్టిన ఆర్థిక శాస్త్రవేత్తలు మయాంక్ కుమార్, అపూర్వ శంకర్ చెబుతున్నారు. మిగిలిన గ్రాడ్యుయేట్లదీ అదే పరిస్థితి మన ఇంజనీర్ల పరిస్థితి సరే, దేశంలోని మిగిలిన గ్రాడ్యుయేట్లలో కూడా ఉద్యోగాలకు పనికొచ్చేవారు తక్కువగానే ఉంటున్నారు. బీఏ, బీకామ్, బీఎస్సీ వంటి సాధారణ డిగ్రీ కోర్సులు పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లలో కేవలం 25 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలకు అవసరమయ్యే నైపుణ్యాలు ఉంటున్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో దాదాపు 48 శాతం సంస్థలు తమ తమ సంస్థల్లో ఖాళీ పోస్టులను నింపడం కష్టంగా ఉందని చెబుతుంటే, ఆ పోస్టులకు కావలసిన నైపుణ్యాలు గల గ్రాడ్యుయేట్లే కరువవుతున్నారని వాపోతున్నాయి, ఈ పరిస్థితుల్లో మన గ్రాడ్యుయేట్లకు తగిన నైపుణ్యాలలో శిక్షణ కల్పిచేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టకపోతే, వీరంతా నిరుద్యోగులుగా మిగిలిపోయి, దేశానికి పెనుభారమయ్యే పరిస్థితులు తలెత్తుతాయి. దేశ ఆర్థిక పురోగతికి ఇదెంత మాత్రం క్షేమం కాదని ఆర్థిక, సామాజిక నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదగాలనుకుంటున్న భారత్‌కు ఈ పరిస్థితి పెద్ద అవరోధం కాగలదని కూడా వారు చెబుతున్నారు. మన పట్టభద్రులకు, మిగులు కార్మిక శక్తికి పారిశ్రామిక అవసరాలకు తగిన నైపుణ్యాలను కల్పించే రీతిలో విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుకోకుంటే, ఆర్థిక రంగంలో మనకు వెనుకబాటు తప్పదని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నైపుణ్యాల కొరత ఎందుకంటే..? మన దేశంలో నైపుణ్యాల కొరతకు ప్రధాన కారణం విద్యా వ్యవస్థ వైఫల్యమే. ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన బోధన, శిక్షణ లభించడం లేదు. చాలా చోట్ల పాఠశాలల్లో ఎనిమిదో తరగతి, ఆపై తరగతులు చదివే వారిలో 25 శాతం మంది విద్యార్థులు వాక్యాలను చదవలేని స్థితిలో, ప్రాథమికమైన లెక్కలు చేయలేని స్థితిలో ఉన్నారని ‘ఏన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్’ (ఏఎస్ఈఆర్) ఈ ఏడాది ప్రారంభంలోనే వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్లు విపరీతంగా పెరిగినా, ఇవేవీ విద్యా నాణ్యతను ఆశించిన స్థాయిలో మెరుగుపరచలేకపోతున్నాయి. గుజరాత్, హర్యానా, అస్సాం, కేరళ వంటి కొద్ది రాష్ట్రాల్లోని విద్యార్థుల అధ్యయన ప్రమాణాలు, నైపుణ్యాలు మెరుగుపడినా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బిహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విద్యార్థుల అధ్యయన ప్రమాణాలు, నైపుణ్యాలు ఇదివరకటి కంటే దిగజారాయి. ఉత్తరప్రదేశ్‌లోనైతే మూడో తరగతి విద్యార్థుల్లో ఎక్కువశాతం మంది చిన్న చిన్నపదాలను కూడబలుక్కునైనా చదవలేని స్థితిలో ఉన్నారు. సర్వశిక్షా అభియాన్, మాధ్యమిక శిక్షా అభియాన్, మధ్యాహ్న భోజన పథకం, విద్యా హక్కు చట్టం వంటి వాటి ఫలితంగా పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఇటీవలి సంవత్సరాలలో గణనీయంగా పెరిగినా, విద్యార్థుల్లో అధ్యయన ప్రమాణాలు, నైపుణ్యాలు కనీస స్థాయిలోనైనా మెరుగుపడకపోవడం విచారకరం. గణాంకాల్లో వీళ్లంతా అక్షరాస్యులుగానే నమోదవుతున్నారు. మన అక్షరాస్యత గణాంకాల్లో కనిపిస్తున్నదంతా వాపు మాత్రమే తప్ప బలుపు ఎంతమాత్రం కాదని విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపరచలేని మన విద్యావ్యవస్థలోని లోపాలకు వారు చెబుతున్న కొన్ని ప్రధాన కారణాలు ఇవీ.. శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత ప్రాథమిక స్థాయిలో నాసిరకం బోధన నిరుపేద నిరక్షరాస్యుల కుటుంబాలకు చెందిన పిల్లలకు లభించని ప్రోత్సాహం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు కావలసిన కనీస పాఠ్యపరికరాల కొరత పాఠశాలల్లో పిల్లలకు బొమ్మల కథల పుస్తకాలు అందుబాటులో లేకపోవడం సృజనాత్మక అధ్యయనానికి కావలసిన కనీస వసతుల కొరత క్లిష్టమైన విషయాలను విద్యార్థులకు సరళంగా బోధించలేకపోతున్న ఉపాధ్యాయులు బోధనలో నిమగ్నం కావలసిన ఉపాధ్యాయులను ప్రభుత్వాలు ఇతరేతర అవసరాలకు వాడుకోవడం. విద్యా వ్యవస్థను సమూలంగా మెరుగుపరచడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించకపోవడం. వృత్తి విద్యా శిక్షణకు ప్రభుత్వాలు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం. సాధించాల్సింది చాలానే ఉంది స్వాతంత్య్రం వచ్చేనాటికి మన దేశంలో అక్షరాస్యులు కేవలం 18 శాతం మాత్రమే. ఇప్పుడు అక్షరాస్యుల సంఖ్య 74 శాతానికి చేరుకుంది. దేశంలోని పిల్లల్లో దాదాపు 95 శాతం మంది పాఠశాలలకు వెళుతున్నారు. అలాగని దేశంలోని అక్షరాస్యులందరికీ ఉపాధికి కావలసిన నైపుణ్యాలు ఉన్నాయని చెప్పడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నట్లు వివిధ అధ్యయనాలు, పరిశోధనలు తేటతెల్లం చేస్తున్నాయి. అలాగే పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతున్న పరిస్థితులు కూడా లేవు. ‘దేశంలోని 35 శాతం యువజనులు, వయోజనులు ఇంకా అక్షరాస్యతకు దూరంగానే ఉన్నారు. ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్నప్పటికీ, దాదాపు 40 శాతం విద్యార్థుల్లో కనీస అధ్యయన నైపుణ్యాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితి మన దేశానికి ఒక సవాలు. దీనిని గుర్తించి, ప్రణాళికాబద్ధంగా ఈ సమస్య పరిష్కారానికి సత్వరమే కృషిని ప్రారంభించాల్సి ఉంది’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు రాసిన ఒక ప్రత్యేక వ్యాసంలో పేర్కొనడం గమనార్హం. నైపుణ్యాలలో టాప్–5 ఆధునిక పరిస్థితుల్లో ఉద్యోగాలకు కావలసిన నైపుణ్యాలు గల కార్మిక శక్తి గల దేశాలలో మనం చాలా వెనుకబడి ఉన్నాయి. ఈ విషయంలో టాప్–5 దేశాలు, ఆ దేశాల్లో నైపుణ్యాలు గల కార్మికశక్తిపై గణాంకాలు... దేశం నిపుణులైన కార్మికులు దక్షిణ కొరియా- 96 శాతం జపాన్ - 80 శాతం జర్మనీ - 75 శాతం యూకే - 68 శాతం అమెరికా - 52 శాతం మన దేశంలో నైపుణ్యాలు కలిగిన కార్మికుల సంఖ్య పట్టుమని పది శాతం మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యాలు కలిగిన కార్మికులు 38 శాతం ఉంటే, ప్రపంచవ్యాప్త సగటు కంటే మన దేశంలో నైపుణ్యాలు కలిగిన కార్మికుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం గమనార్హం. -
అక్షరంపై నిర్లక్ష్యం!
♦ ఓనమాలు నేర్చుకోని వయోజనులు ♦ చతికిలపడిన సాక్షర భారత్ ♦ నిధులు మంజూరు చేయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ♦ జిల్లా అక్షరాస్యత శాతం 67.40 ♦ నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం అక్షరం ఆయుధం కన్నా గొప్పది. అక్షరం వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అభివృద్ధికి బాటలు వేస్తుంది. అయినా అక్షరంపై నిర్లక్ష్యం వీడడం లేదు. సమాజమంతా ఆన్లైన్ బాట పడుతున్నా, అ,ఆ,ఇ,ఈ అంటే తెలియని వారు ఎందరో ఉన్నారు. ఇంకా చాలా మంది వేలిముద్రలు వేస్తున్నారంటే మనమెక్కడ ఉన్నామో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అక్షరాస్యతపై లెక్కలు బాగానే ఉన్నా ఆర్థికంగా చేయూత లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం.. నిరక్షరాస్యులకు అవగాహన లేవి.. వెరసి వేలిముద్రకు దారి తీస్తుంది. శుక్రవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. బెల్లంకొండ : జిల్లాలో ఏ మండలంలో చూసినా అక్షరాస్యతా శాతం తగ్గుముఖం పడుతుంది. అధికారిక గణాంకాలు కేవలం పేపర్లకే పరిమితమవుతున్నాయి. 2020 నాటికి సంపూర్ణ అక్షరాస్యతా లక్ష్యంగా అట్టహాసంగా ప్రారంభమైన సాక్షర భారత్ కార్యక్రమం జిల్లాలో చతికిల పడింది. అధికారుల నిర్లక్ష్యానికి తోడుగా, రాష్ట్ర ప్రభుత్వం నిధుల మంజూరులో కోత వి«ధించడంతో కార్యక్రమం సజావుగా సాగడం లేదు. దీంతో వయోజనులు ఓనమాలు నేర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఇదీ పరిస్థితి.. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో జనాభా 48,87,213గా ఉంది. ఇందులో పురుషులు 24,40,521 ఉండగా, స్త్రీలు 24,47,292 ఉన్నారు. అక్షరాస్యతా శాతం 67.40గా నమోదైంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో జిల్లా అక్షరాస్యతా శాతం 7వ స్థానంలో ఉంది. 2010 సెప్టెంబర్ 22న జిల్లాలో సాక్షర భారత్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం జిల్లాలో 57 మండలాల్లోని 712 గ్రామాల్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా అన్ని గ్రామాల్లో 56,816 మందితో మొదటిగా అక్షరాలు దిద్దించారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిధుల మంజూరులో జాప్యం చేయడంతో నేడు వయోజన విద్యా కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2020 నాటికి సంపూర్ణ అక్షరాస్యతా మాట అటుంచితే అక్షరాస్యతలో 7 స్థానంలో ఉన్న జిల్లా అట్టడుగుకు చేరే ప్రమాదం ఉంది. వెనుకబడిన మహిళలు జిల్లాలో అక్షరాస్యతలో మహిళలు వెనుకబడి ఉన్నారు. 2001లో పురుషుల అక్షరాస్యత 71.24గా ఉండగా, మహిళల అక్షరాస్యత 53.74గా ఉంది. 2011లో పురుషుల అక్షరాస్యత 74.79 ఉండగా మహిళల అక్షరాస్యత 60.09 గా ఉంది. పురుషులతో పోలిస్తే మహిళలు అక్షరాస్యతలో 14.70 శాతం వెనుకబడి ఉన్నారు. నిధుల పంపిణీలో ప్రభుత్వం కొర్రీలు సాక్షర భారత్ నిర్వహణకు 75 శాతం కేంద్ర ప్రభుత్వం, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నాయి. అయితే 2017–18కిగానూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీనికితోడు మండల స్థాయి, గ్రామ స్థాయిలో పనిచేసే కోఆర్డినేటర్లకు దాదాపుగా 11 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో వారు కేంద్రాల నిర్వహణకు శ్రద్ధ చూపడం లేదు. ఈ ఏడాది సాక్షర భారత్ ప్రోగ్రాంను ఎత్తేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బందికి సంకేతాలు వస్తున్నట్లు తెలిసింది. -
విద్యతోనే అభివృద్ధి సాధ్యం
కరీంనగర్ ఎడ్యుకేషన్ : విద్యతోనే అభివృద్ధి సాధ్యమని.. అందరికి విద్యనందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ అన్నారు. 48వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షరాస్యత ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వుుఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నిరక్షరాస్యతతో అభివృద్ధికి ఆటంకమన్నారు. గ్రామీణ మహిళలు అక్షరాస్యతలో వెనుకబడ్డారని.. విద్య ఆవశ్యకత తెలుసుకోవాలని సూచించారు. ఆమేరకు అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ సంపూర్ణ అక్షరాస్యత సాధన సామాజిక బాధ్యత అని అన్నారు. జిల్లాలో అక్షరాస్యత 64.87 శాతం కాగా పురుషుల అక్షరాస్యత శాతం 74.72 అని, స్త్రీ అక్షరాస్యత శాతం 55.18 ఉందని అన్నారు. జిల్లాలో 10,25,689 మందిని నిరక్షరాస్యులుగా గుర్తించి 3,09,537 మందిని అక్షరాస్యులుగా మార్చామని, మిగిలిన 7 లక్షలకుపైగా ఉన్న నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను కోరారు. అదనపు జాయింట్ కలె క్టర్ నంబయ్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి చదవడం, రాయడం నేర్పించాలన్నారు. మెప్మా పీడీ విజయలక్ష్మి మాట్లాడుతూ అక్షరాస్యతలో విజయనగరం జిల్లాను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి సదానందం, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, వయోజన విద్యాశాఖ ఉపసంచాలకుడు సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యులు శరత్‌రావు, నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అక్షరం... అందరికీ!
సందర్భం- నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం మానవ ప్రగతికి అక్షరాస్యత తప్పనిసరి. అక్షరాస్యత మనిషి జీవన స్థితిగతులను మార్చేస్తుంది. వారివారి సంస్కృతిని బలపరచుకునేలా చేస్తుంది. అందుకే నలభై సంవత్సరాలుగా యునెస్కో అంతర్జాతీయ అక్షరాస్యత ఉత్సవాలను జరుపుతోంది. ‘నిర్బంధ, ఉచిత విద్య పౌరుల ప్రాథమిక హక్కు, ఏది నేర్చుకోవాలన్నా అందుకు పునాది’ చదువే అని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది యునెస్కో. ఈ యేడాది ‘అక్షరాస్యత - నిరంతర అభివృద్ధి’ నినాదంతో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 776 మిలియన్లమంది వయోజనులు కనీసం వాళ్ల పేరును రాయలేని స్థితిలో ఉండటం దురదృష్టం. వారంతా చదువుకునేలా యునెస్కో ప్రయత్నిస్తోంది. అందు కోసమే ప్రతి యేడూ సెప్టెంబరు 8 వ తేదీన అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం జరుపుకోవాలని 1965 నవంబరు 7 న యునెస్కో నిశ్చయించింది. మొట్టమొదటగా 1966లో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. లెక్కల ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా చే సిన సర్వేను అనుసరించి ప్రతి ఐదుగురు మగవారిలో ఒకరు, మూడింట రెండు వంతుల మంది స్త్రీలు నిరక్షరాస్యులని తేలింది. దక్షిణ, పశ్చిమ ఆసియా దేశాలలో అక్షరాస్యత శాతం అత్యల్పంగా 58.6% ఉందని తెలిసింది. వీరంతా భాగస్వాములే... ఈ ఉత్సవాలను... సంవత్సరానికొక సరికొత్త నినాదంతో, ఆశయాలతో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ‘అక్షరాస్యత - నిరంతర అభివృద్ధి’ నినాదంతో యునెస్కో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. గ్లోబల్ డెవలప్మెంట్ రిసెర్చ్ సెంటర్, రోటరీ ఇంటర్నేషనల్, మాంట్బ్లాంక్, ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లిటరసీ తదితర సంస్థలు ఇందుకోసం తమ వంతు కృషి చేస్తున్నాయి. ఎందుకు జరుపుకోవాలి... నిరక్షరాస్యుల దృష్టిని విద్య వైపు మళ్లించి, వారికి ఉండే సాంఘిక హక్కులను, వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకునేలా చేయడం ఈ సంస్థ ఉద్దేశం. ‘మనిషి జీవించడానికి ఆహారం ఎంత అవసరమో, చదువు కూడా అంతే అవసరం’ అనే సిద్ధాంతం మీద యునెస్కో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. పేదరికాన్ని పారద్రోలడానికి, శిశు మరణాలు తగ్గించడానికి, అధిక జనాభా నియంత్రణకు, లింగ వివక్షత లేకుండా ఉండటానికి విద్య ఎంత అవసరమో తెలిసేలా చేస్తారు. అక్షరాస్యత... కుటుంబ స్థితిగతులను మెరుగు పరుస్తుందనీ, దాంతో దేశ ప్రగతి త్వరితంగా జరుగుతుందనీ తెలియచెప్తారు. ప్రతి పౌరుడూ కుటుంబం పట్ల, సంఘం పట్ల, దేశం పట్ల బాధ్యతగా ప్రవర్తించడానికి నిరంతర విద్యాభ్యాసం దోహద పడుతుందన్న యునెస్కో ఆశయాన్ని మనమూ పాటిద్దాం. - డా. వైజయంతి అక్షర వాస్తవాలు భారతదేశ అక్షరాస్యత: 74.4% అక్షరాస్యతలో వెనుకబడిన దేశాలు:దక్షిణ సూడాన్ (27%), మాలి (28%), ఆఫ్ఘనిస్థాన్‌లు (28.4%) వందశాతం అక్షరాస్యత సాధించిన దేశాలు: అండొర్రా, ఫిన్లాండ్, గ్రీన్లాండ్, నార్వే. ఆఫ్ఘనిస్థాన్‌లో కేవలం 12.6 శాతం మంది స్త్రీలకు మాత్రమే చ దవడం, రాయడం వచ్చు. ‘‘రేపు మరణించాలనుకుంటే ఈ రోజు జీవించు. ఎప్పటికీ జీవించి ఉండాలనుకుంటే జ్ఞాన సముపార్జన చెయ్యి’’ - మహాత్మాగాంధీ.