అక్షరం... అందరికీ!
- సందర్భం- నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం
మానవ ప్రగతికి అక్షరాస్యత తప్పనిసరి. అక్షరాస్యత మనిషి జీవన స్థితిగతులను మార్చేస్తుంది. వారివారి సంస్కృతిని బలపరచుకునేలా చేస్తుంది. అందుకే నలభై సంవత్సరాలుగా యునెస్కో అంతర్జాతీయ అక్షరాస్యత ఉత్సవాలను జరుపుతోంది. ‘నిర్బంధ, ఉచిత విద్య పౌరుల ప్రాథమిక హక్కు, ఏది నేర్చుకోవాలన్నా అందుకు పునాది’ చదువే అని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది యునెస్కో. ఈ యేడాది ‘అక్షరాస్యత - నిరంతర అభివృద్ధి’ నినాదంతో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 776 మిలియన్లమంది వయోజనులు కనీసం వాళ్ల పేరును రాయలేని స్థితిలో ఉండటం దురదృష్టం. వారంతా చదువుకునేలా యునెస్కో ప్రయత్నిస్తోంది. అందు కోసమే ప్రతి యేడూ సెప్టెంబరు 8 వ తేదీన అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం జరుపుకోవాలని 1965 నవంబరు 7 న యునెస్కో నిశ్చయించింది. మొట్టమొదటగా 1966లో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి.
లెక్కల ప్రకారం...
ప్రపంచవ్యాప్తంగా చే సిన సర్వేను అనుసరించి ప్రతి ఐదుగురు మగవారిలో ఒకరు, మూడింట రెండు వంతుల మంది స్త్రీలు నిరక్షరాస్యులని తేలింది. దక్షిణ, పశ్చిమ ఆసియా దేశాలలో అక్షరాస్యత శాతం అత్యల్పంగా 58.6% ఉందని తెలిసింది.
వీరంతా భాగస్వాములే...
ఈ ఉత్సవాలను... సంవత్సరానికొక సరికొత్త నినాదంతో, ఆశయాలతో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ‘అక్షరాస్యత - నిరంతర అభివృద్ధి’ నినాదంతో యునెస్కో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. గ్లోబల్ డెవలప్‌మెంట్ రిసెర్చ్ సెంటర్, రోటరీ ఇంటర్నేషనల్, మాంట్‌బ్లాంక్, ద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లిటరసీ తదితర సంస్థలు ఇందుకోసం తమ వంతు కృషి చేస్తున్నాయి.
ఎందుకు జరుపుకోవాలి...
నిరక్షరాస్యుల దృష్టిని విద్య వైపు మళ్లించి, వారికి ఉండే సాంఘిక హక్కులను, వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకునేలా చేయడం ఈ సంస్థ ఉద్దేశం. ‘మనిషి జీవించడానికి ఆహారం ఎంత అవసరమో, చదువు కూడా అంతే అవసరం’ అనే సిద్ధాంతం మీద యునెస్కో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. పేదరికాన్ని పారద్రోలడానికి, శిశు మరణాలు తగ్గించడానికి, అధిక జనాభా నియంత్రణకు, లింగ వివక్షత లేకుండా ఉండటానికి విద్య ఎంత అవసరమో తెలిసేలా చేస్తారు. అక్షరాస్యత... కుటుంబ స్థితిగతులను మెరుగు పరుస్తుందనీ, దాంతో దేశ ప్రగతి త్వరితంగా జరుగుతుందనీ తెలియచెప్తారు. ప్రతి పౌరుడూ కుటుంబం పట్ల, సంఘం పట్ల, దేశం పట్ల బాధ్యతగా ప్రవర్తించడానికి నిరంతర విద్యాభ్యాసం దోహద పడుతుందన్న యునెస్కో ఆశయాన్ని మనమూ పాటిద్దాం.
- డా. వైజయంతి
అక్షర వాస్తవాలు
భారతదేశ అక్షరాస్యత: 74.4%
అక్షరాస్యతలో వెనుకబడిన దేశాలు:దక్షిణ సూడాన్ (27%), మాలి (28%), ఆఫ్ఘనిస్థాన్‌లు (28.4%)
వందశాతం అక్షరాస్యత సాధించిన దేశాలు: అండొర్రా, ఫిన్‌లాండ్, గ్రీన్‌లాండ్, నార్వే.
ఆఫ్ఘనిస్థాన్‌లో కేవలం 12.6 శాతం మంది స్త్రీలకు మాత్రమే చ దవడం, రాయడం వచ్చు.
‘‘రేపు మరణించాలనుకుంటే ఈ రోజు జీవించు. ఎప్పటికీ జీవించి ఉండాలనుకుంటే జ్ఞాన సముపార్జన చెయ్యి’’
- మహాత్మాగాంధీ.