న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతానికి 24 సీట్లు రిజర్వు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది! పీఓకే కూడా మన భూభాగమే కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ (సవరణ), రిజర్వేషన్ (సవరణ) బిల్లులను బుధవారం ఆయన లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆరు గంటల పై చిలుకు చర్చ అనంతరం సభ వాటిని ఆమోదించింది.
అసెంబ్లీలో సీట్లను పెంచడంతో పాటు పలు కీలక అంశాలు ఈ బిల్లుల్లో ఉన్నాయి. గతంలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో 83 స్థానాలుండగా వాటిని 90కి పెంచాలని ప్రతిపాదించారు. కశ్మీర్ డివిజన్లో స్థానాలను 46 నుంచి 47కు, జమ్మూ డివిజన్లో 37 నుంచి 43కు పెంచారు. ‘‘పాక్ ఆక్రమిత కశ్మర్ కూడా భారత్‌లో అంతర్భాగమే. కనుక అక్కడ కూడా 24 స్థానాలను అసెంబ్లీలో రిజర్వు చేశాం’’ అని అమిత్ షా సభకు వెల్లడించారు.
అన్యాయాన్ని సరిదిద్దేందుకే బిల్లులు
70 ఏళ్లుగా తమ హక్కులన్నింటినీ కోల్పోయి అన్నివిధాలా అన్యాయానికి గురైన కశ్మీరీలకు పూర్తిగా న్యాయం చేయడమే ఈ బిల్లుల ఉద్దేశమని అమిత్ షా చెప్పారు. కశ్మీర్లో ఉగ్రవాదానికి ఇప్పటిదాకా 45 వేల మంది బలయ్యారని ఆవేదన వెలిబుచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమివ్వకుండా మొదట్లోనే ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపి ఉంటే పండిట్లు లోయను వీడాల్సిన అవసరమే వచ్చేది కాదన్నారు. ‘‘కశ్మీర్లో 1947లో 31,789 కుటుంబాలు 1965–71 మధ్య 10,065 కుటుంబాల వారు నిర్వాసితులయ్యారు.
ఇక 1980ల్లో ఉగ్రవాదం వల్ల మరెన్నో వేల మంది స్వదేశంలోనే శరణార్థులయ్యారు. వారందరికీ తిరిగి గుర్తింపుతో పాటు హక్కులు, అన్నిరకాల ప్రాతినిధ్యం కలి్పంచడమే తాజా బిల్లుల లక్ష్యం’’ అని వివరించారు. 2024లోనూ కేంద్రంలో మోదీ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం మాకుంది. అనంతరం రెండేళ్లలో జమ్మూ కశ్మీర్‌ను పూర్తిగా ఉగ్రవాద విముక్తం చేసి తీరతాం’’ అని చెప్పారు. ‘‘కశ్మీరీల్లో ఎంతోమంది శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. బిల్లుతో వారికి హక్కులు సమకూరుతాయి. విద్య, ఉద్యోగావకాశాలు వస్తాయి. ఎన్నికల్లో నిలబడి గెలిచే ఆస్కారముంటుంది’’ అని తెలిపారు.
బిల్లుల విశేషాలు..
► జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 90కి పెరుగుతుంది.
►ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు అసెంబ్లీలో తొలిసారిగా 9 స్థానాలు రిజర్వు చేశారు.
►కశ్మీర్ నుంచి వలస వెళ్లిన వారి కుటుంబాలకు 2 స్థానాలు కేటాయించారు. వీటిలో ఒక మహిళకు అవకాశమిస్తారు.
►పీఓకే నుంచి నిర్వాసితులై వచ్చి స్థిరపడిన వారికి ఒక స్థానం కేటాయించారు.
►రాష్ట్ర ప్రభుత్వోద్యోగాలు, వృత్తి విద్యా సంస్థల్లో పలు కేటగిరీల వారికి జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ బిల్లు ప్రకారం రిజర్వేషన్లు కలి్పస్తారు.
►ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు కూడా రిజర్వేషన్లు అందుతాయి.
►ప్రస్తుత రిజర్వేషన్ చట్టంలోని ‘బలహీన, గుర్తింపునకు నోచని వర్గాలు (సామాజిక కులాలు)’ అనే పదబంధాన్ని ‘ఇతర వెనకబడ్డ’గా మారుస్తారు.
►జమ్మూ కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రాన్ని లద్దాఖ్, కశ్మీర్ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment