జమ్మూ కశ్మీర్ ఏడు దశాబ్దాలుగా అనుభవిస్తున్న కష్టనష్టాలన్నింటికీ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన భారీ తప్పిదాలే ఏకైక కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో ఆరోపించారు. అవే అక్కడ ఉగ్రవాదానికి, వేర్పాటువాద కుంపట్లకు, పాక్ ఆక్రమిత కశ్మీర్ పుట్టుకకు కారణమయ్యాయని దుయ్యబట్టారు. ‘‘మన సైన్యం పాక్ దళాలను తరిమికొడుతున్న వేళ కశ్మీర్‌ను పూర్తిగా తిరిగి స్వా«దీనం చేసుకోక ముందే నెహ్రూ ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించారు.
అంతటితో ఆగకుండా కశ్మీర్ అంశాన్ని హడావుడిగా, అనవసరంగా ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చేసిన ఈ రెండు ఘోర తప్పిదాలే కశ్మీర్‌లో ఆరని కుంపట్లకు కారణమయ్యాయి. నెహ్రూది నిజంగా చారిత్రక తప్పిదం!’’ అని మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్, విపక్షాలు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చాయి. బీజేపీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించాయి. షా వ్యాఖ్యలను నిరసిస్తూ వాకౌట్ చేశాయి.
అనంతరం అమిత్ షా మాట్లాడుతూ, నెహ్రూయే గనక అప్పట్లో సరైన చర్యలు తీసుకుని ఉంటే కశ్మీర్లో చాలా భాగాన్ని పాక్‌కు కోల్పోయే వాళ్లమే కాదని పునరుద్ఘాటించారు. అంతేగాక పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పుడో తిరిగి భారత్‌లో అంతర్భాగంగా మారేదని అభిప్రాయపడ్డారు. ‘‘అప్పటికి మన సైన్యం పంజాబ్ దాటి కశ్మీర్‌కేసి దూసుకుపోతోంది. నెహ్రూ కాల్పుల విరమణను కనీసం మూడు రోజులు ఆలస్యం చేసినా పీఓకే ఇప్పుడు భారత్‌లో అంతర్భాగంగా ఉండేది’’ అని ఆక్షేపించారు. అంతా అయిపోయాక, కాల్పుల విరమణ పొరపాటు నిర్ణయమని నెహ్రూ తీరిగ్గా అంగీకరించారని విమర్శించారు.
ఆయన చేసిన సరిదిద్దుకోలేని తప్పిదం వల్ల భారీ భూభాగాన్ని దేశం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. 1962లో చైనాతో భారత యుద్ధానికి దారి తీసిన నెహ్రూ ‘భారీ తప్పిదం’ గురించి కూడా మాట్లాడాలని బిజూ జనతాదళ్ సభ్యుడు భర్తృహరి మహతబ్ కోరగా అమిత్ షా తనదైన శైలిలో స్పందించారు. ‘‘నెహ్రూ తప్పిదాల్లో రెండింటిని ప్రస్తావిస్తేనే విపక్షాలు అలిగి వాకౌట్ చేశాయి. ఇక భారీ తప్పిదం గురించి మాట్లాడితే ఏకంగా రాజీనామా చేసేవేమో!’’ అంటూ ఎద్దేవా చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఎవరినీ అవమానించడానికి కాదని, జరిగిన వాస్తవాలను దేశం ముందుంచే ప్రయత్నం మాత్ర మేనని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఇక 370 ఆరి్టకల్‌ను రద్దు చేసే దమ్ము గత కాంగ్రెస్ సర్కారుకు లేకపోయిందని అమిత్ షా ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment