అమిత్‌షా కొత్త బృందం!
జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన కమల దళపతి
ఉపాధ్యక్షునిగా యడ్యూరప్ప.. వరుణ్‌గాంధీకి దక్కని చోటు
న్యూఢిల్లీ: కమల దళపతి అమిత్ షా తన కొత్త జట్టును ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షునిగా వారం క్రితం అధికారికంగా ఎన్నికైన ఆయన శనివారం నూతన జాతీయ కార్యవర్గాన్ని వెల్లడించారు. 11 మంది ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులు, నలుగురు సంయుక్త ప్రధాన కార్యదర్శులు (కార్యనిర్వాహక), 14 మంది కార్యదర్శులు, 10 మంది అధికార ప్రతినిధులు, మహిళ, యువ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మోర్చాల అధ్యక్షులను ప్రకటించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల నేతలకు అమిత్‌షా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అమిత్ షా తన జట్టులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు చోటు కల్పించారు. ఆయనను ఉపాధ్యక్షునిగా నియమించడం గమనార్హం. మరోవైపు రాజ్‌నాథ్ టీంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న సుల్తాన్‌పూర్ ఎంపీ వరుణ్ గాంధీకి జాతీయ కార్యవర్గంలో చోటు దక్కలేదు. యూపీ ఎన్నికల ప్రచారం కోసం ఆయనకు పార్టీ పదవి కేటాయించలేదని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. వరుణ్ తల్లి మేనకాగాంధీ కేంద్ర మంత్రిగా కొనసాగుతుండడం కూడా ఓ కారణమే అని పేర్కొన్నాయి. కిసాన్ మోర్చా అధ్యక్షుడు, పార్టీ కోశాధికారి పదవులను ఎవరికి కేటాయించిందనేది వెల్లడించలేదు. మరోవైపు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను కూడా అమిత్‌షా ప్రకటించారు.
అమిత్‌షా టీం ఇదే..
ఉపాధ్యక్షులు: బండారు దత్తాత్రేయ (తెలంగాణ), బీఎస్ యడ్యూరప్ప (కర్ణాటక), సత్యపాల్ మాలిక్, ముక్తార్ అబ్బాస్ నక్వీ, దినేశ్ శర్మ (ఉత్తరప్రదేశ్), పురుషోత్తం రూపాల (గుజరాత్), ప్రభాత్ ఝా (మధ్యప్రదేశ్), రఘువర్ దాస్ (జార్ఖండ్), కిరణ్ మహేశ్వరి (రాజస్థాన్), వినయ్ సహస్రబుద్ధే (మహారాష్ట్ర), రేణు దేవి (బీహార్)
ప్రధాన కార్యదర్శులు: రామ్‌మాధవ్ (ఏపీ), మురళీధర్‌రావు (తెలంగాణ), జేపీ నడ్డా (హిమాచల్‌ప్రదేశ్), రాజీవ్ ప్రతాప్ రూడీ (బీహార్), సరోజ్ పాండే (ఛత్తీస్‌గఢ్), భూపేంద్రయాదవ్ (రాజస్థాన్), రామ్‌శంకర్ కతేరియా (ఉత్తరప్రదేశ్), రామ్‌లాల్ (ఢిల్లీ)
సంయుక్త ప్రధాన కార్యదర్శులు
(కార్యనిర్వాహక): వి.సతీష్ (కర్ణాటక), సుదన్ సింగ్ (ఛత్తీస్‌గఢ్), శివప్రకాశ్ (ఉత్తరప్రదేశ్), బి.ఎల్.సంతోష్ (కర్ణాటక)
కార్యదర్శులు: పూనం మహాజన్, శ్యామ్ జాజు (మహారాష్ట్ర), సర్దార్ ఆర్.పి.సింగ్, అనిల్ జైన్ (ఢిల్లీ), హెచ్.రాజా (తమిళనాడు), రోమన్ దేకా (అస్సాం), సుధయాదవ్ (హర్యానా), రామ్‌విచార్ నేతం (ఛత్తీస్‌గఢ్), అరుణ్ సింగ్, సిద్ధార్థ్‌నాథ్ సింగ్, శ్రీకాంత్ శర్మ (ఉత్తరప్రదేశ్), జ్యోతి ధృవే (మధ్యప్రదేశ్), తరుణ్ ఛుఘ్ (పంజాబ్), రజనీష్ కుమార్ (బీహార్).
అధికార ప్రతినిధులు: జీవీఎల్ నరసింహారావు (ఏపీ), షానవాజ్ హుస్సేన్ (బీహార్), సుధాంశు త్రివేది, విజయ్ సోన్‌కర్‌శాస్త్రి (ఉత్తరప్రదేశ్), మీనాక్షి లేఖి, ఎం.జె.అక్బర్, నలిన్ కొహ్లీ (ఢిల్లీ), లలిత కుమారమంగళం (తమిళనాడు), సాంబిత్ పత్రా (ఒడిశా), అనిల్ బలౌని (ఉత్తరాఖండ్)
మహిళా మోర్చా అధ్యక్షురాలు: విజయ్ రహతర్ (మహారాష్ట్ర)
యువమోర్చా: అనురాగ్ ఠాకూర్ (హిమాచల్ ప్రదేశ్)
ఎస్సీ మోర్చా: దుష్యంత్ గౌతమ్ (ఢిల్లీ)
ఎస్టీ మోర్చా: ఫగ్గన్ సింగ్ కులస్తే (మధ్యప్రదేశ్)
మైనార్టీ మోర్చా: అబ్దుల్ రషీద్ అన్సారీ
బీజేపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి: అరుణ్ కుమార్ (ఢిల్లీ)
బీజేపీలో చేరిన కాంగ్రెస్ రెబెల్ ఎంపీ
జింద్ (హర్యానా): కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైనా ఆ పార్టీ రెబెల్ నేత, రాజ్యసభ ఎంపీ చౌదరి బిరేందర్‌సింగ్ (67) శనివారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కమల దళంలో చేరారు. హర్యానాలోని జింద్‌లో అమిత్ షా పాల్గొన్న అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభకు హాజరైన బిరేందర్‌సింగ్...మరికొందరు మాజీ ఎమ్మెల్యేలతో కలసి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం భూపిందర్‌సింగ్ హూడాపై తిరుగుబాటు చేసినందుకు కాంగ్రెస్ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. హర్యానాలో కాంగ్రెస్ సీనియర్ నేతలైన రావు ఇందర్‌జిత్‌సింగ్, కేంద్ర మాజీ మంత్రి వినోద్ శర్మ ఇప్పటికే ఆ పార్టీని వీడారు.
ఏపీ, తెలంగాణ నుంచి నలుగురు
బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అమిత్‌షా సమన్యాయం చేశారు. రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరేసి నేతలకు చోటు కల్పించారు. ఏపీకి చెందిన రామ్‌మాధవ్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ అయిన రామ్‌మాధవ్ ఇటీవలే బీజేపీలో చేరిన సంగతి తెలిపిందే. ఏపీకే చెందిన జీవీఎల్ నరసింహారావు అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఇక తెలంగాణకు సంబంధించి సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు ఉపాధ్యక్ష పదవి దక్కింది. మురళీధర్‌రావు మరోసారి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగనున్నారు.ట
బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తిస్తా..
న్యూఢిల్లీ: ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలపై ప్రజలకు సమాచారం అందించే అధికార ప్రతినిధి బాధ్యత ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు జీవీఎల్ నరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజోపయోగ నిర్ణయాలతో మోడీ దేశ ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తున్న సమయంలో తనకు ఇచ్చిన ఈ బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తిస్తానన్నారు. ప్రధానిగా మోడీ, హోంమంత్రిగా రాజ్‌నాథ్ ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో అమిత్‌షా కొత్త కార్యవర్గాన్ని తెచ్చారన్నారు. జాతీయ కార్యవర్గంలో యువతకు ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు.
దత్తన్నకు మంత్రి పదవి డౌటే..?
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు కేంద్ర కేబినెట్‌లో స్థానంపై ఆశలు సన్నగిల్లాయి. అమిత్‌షా టీమ్‌లో దత్తన్నకు లభించిన ఉపాధ్యక్ష పదవి.. ప్రధాని మోడీ కేబినెట్‌లో చేరడానికి ప్రతిబంధకంగా మారనున్నట్టు తెలుస్తోంది. మాజీ ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో రైల్వే సహాయ మంత్రిగా పని చేసిన దత్తాత్రేయ మోడీ కేబినెట్‌లో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే 29వ రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ నుంచి ఆ పార్టీకి ఏకైక ఎంపీగా ఉన్న దత్తాత్రేయకు తొలి విడత కేబినెట్‌లో చోటుదక్కలేదు. మలివిడతలోనైనా కేబినెట్‌లో బెర్త్ కోసం దత్తాత్రేయ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ ఉపాధ్యక్ష పదవి లభించడంతో మంత్రి పదవిపై ఆశలు నీరుగారాయి. పార్టీలో ‘ఒక వ్యక్తికి.. ఒక పదవి’ సిద్ధాం తంతో ఆయనకు అవకాశం లేకుండా పోయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీ నుంచి బీజేపీ ఎంపీలుగా ఉన్న హరిబాబు, గోకరాజు గంగరాజుకు జాతీయ కార్యవర్గంలో చోటు దక్కకపోవడంతో వారిలో ఒకరికి మోడీ కేబినెట్‌లో అవకాశం లభించవచ్చని ఆ ప్రాంత నేతలు చెబుతున్నారు.