- బీజేపీలో చేరిన శ్రీరాములు
- దేశంలో పాలన అస్తవ్యస్తం
- వంశ పారంపర్య రాజకీయాలను అసహ్యించుకుంటున్నారు
- ఆరోగ్య శాఖ మంత్రిగా పలు సేవలు చేశా
- నా పునరాగమనాన్ని ఎవరూ వ్యతిరేకించ లేదు
- ఏళ్ల పోరాటాల వల్లే హై-కకు ప్రత్యేక హోదా
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధానిని చేయాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీలో చేరినట్లు బీఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు శ్రీరాములు తెలిపారు. మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఆర్థిక, రక్షణ వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారిన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని విడనాడాల్సిన అవశ్యకత ఏర్పడిందని చెప్పారు.
ఇలాంటి తరుణంలో దేశానికి మోడీ నాయకత్వం అవసరమనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరానని వివరణ ఇచ్చారు. వంశ పారంపర్య రాజకీయాలను దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. వ్యక్తి కంటే పార్టీ ముఖ్యం, పార్టీ కంటే దేశం ముఖ్యం... కనుక లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కార్యకర్తలందరూ సైనికుల్లాగా పని చేయాలని పిలుపునిచ్చారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా తాను గతంలో ఎవరూ చేయలేనంతగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని వెల్లడించారు.
తాను ఏ సామాజిక వర్గానికో ప్రతినిధిని కానని, అందరూ తన వారేనని అన్నారు. బీజేపీ తనకు బళ్లారి టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పని చేస్తానని తెలిపారు. బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ సహా పార్టీలోకి తన పునరాగమనాన్ని ఎవరూ వ్యతిరేకించ లేదని చెప్పారు. హైదరాబాద్-కర్ణాటకకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చినప్పటికీ అక్కడ ఎలాంటి నియామకాలు చేపట్టలేదని చెప్పారు. అనేక ఏళ్ల పోరాట ఫలితం వల్లే ఆ ప్రాంతానికి ప్రత్యేక హోదా లభించిందని ఆయన తెలిపారు.
సస్పెన్షన్ ఎత్తివేత
బళ్లారి ఎంపీ జే. శాంత, రాయచూరు ఎంపీ సన్న ఫక్కీరప్పలపై గతంలో విధించిన సస్పెన్షన్‌లను ఒకటి, రెండు రోజుల్లో ఎత్తివేస్తామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి తెలిపారు. శ్రీరాములు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 108 అంబులెన్స్ సేవలను ప్రవేశ పెట్టారని కొనియాడారు.
కాగా బీఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కొన్ని చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేయాల్సి ఉందని ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ తెలిపారు. దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన సభలో ప్రతిపక్ష ఉప నాయకుడు ఆర్. అశోక్, ఎంపీలు శాంత, సన్న ఫక్కీరప్ప, మొలకాల్మూరు ఎమ్మెల్యే తిప్పేస్వామి, బీదర్ ఎమ్మెల్యే గురుపాదప్ప నాగమారపల్లి ప్రభృతులు పాల్గొన్నారు.