- జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిని తప్పించాలని డీసీసీ నేతల ఒత్తిడి?
సాక్షి, బళ్లారి : లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర పరాభవం ఎదురుకావడంతో ఆ పార్టీ నేతల్లో ఓటమికి గల కారణాలపై విశ్లేషణ చేస్తున్నారు. మోడీ ప్రభావంతో బళ్లారి లోక్‌సభ అభ్యర్థి శ్రీరాములు బలమైన నేత కావడంతోనే బీజేపీకి ఘన విజయం లభించిందని పలువురు భావిస్తున్నారు. అయితే బళ్లారి జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్మలాటలు కూడా కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బకు కారణమని ఆ పార్టీలోని నేతలు పేర్కొంటున్నారు.
ముందు నుంచి బళ్లారి జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి భగ్గుమంటూనే ఉంది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర నాయక్ జిల్లా కాంగ్రెస్‌లో ఉన్న అసమ్మతిని చల్లార్చడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఆయన జిల్లాలో ఒకరిద్దరి మాటలు నమ్ముతూ వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నారు.
ఎన్నికల్లో పని చేసేది ఒకరైతే, అధికారం చెలాయించేది మరొకరా? అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించుకుంటున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర నాయక్, కేసీ కొండయ్యల తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు కొందరు పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా బళ్లారి జిల్లాకు ఇద్దరు డీసీసీ అధ్యక్షులు ఉన్నారు. భౌగోళికంగా దావణగెరె జిల్లాలో ఉన్న హరపనహళ్లి ఎమ్మెల్యే ఎంపీ రవీంద్ర బళ్లారి జిల్లా గ్రామీణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు.
బళ్లారి జిల్లా అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జే.ఎస్. ఆంజనేయులు ఉన్నారు. వీరు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారనే పుకార్లు వస్తున్నాయి. అలాగే బళ్లారి సిటీ ఎమ్మెల్యే అనిల్‌లాడ్ కూడా అదే బాటలో నడస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయని నేతలకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని లోలోన మదనపడుతున్నారు.
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా పరమేశ్వర్ నాయక్‌ను తప్పించకపోతే తాము ఖచ్చితంగా రాజీనామాలు చేస్తామని సీఎం సిద్ధరామయ్య దృష్టికి తీసుకెళ్లేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరికి వారు ప్రచారం చేశారే కాని కలిసికట్టుగా చేయలేదని కార్యకర్తలు చెబుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెడితే ఆ పార్టీ నేతలు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారన విమర్శలు కూడా ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి 15 వేల పై చిలుకు మెజార్టీ లభిస్తే, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి 24 వేల మెజార్టీ లభించదంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క బళ్లారి సిటీ నియోజకవర్గమే కాకుండా సండూరు నియోజకర్గం మినహా మిగిలిన 8 అసెంబ్లీ నియోజవర్గాల్లో బీజేపీకి బంపర్ మెజార్టీ రావడం గమనార్హం.