- ‘లోక్‌సభ’ బరిలో ఆరుగురు ఎమ్మెల్యేలు
- కాంగ్రెస్ నుంచి నలుగురు, బీజేపీ, జేడీఎస్‌ల నుంచి ఒక్కొక్కరు
- ముందే రాజీనామా చేసిన శ్రీరాములు
- గెలిచిన వారి స్థానాల్లో ఉప ఎన్నికలు
- అప్పుడే ఆ స్థానాలకూ అభ్యర్థులు రెడీ
- జేడీఎస్ నేత కృష్ణప్ప మృతితో గందరగోళం
- ఆయన గెలిస్తే మళ్లీ తుమకూరు లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో, విజేతల జాబితా వెలువడగానే మరో మినీ ఎన్నికల సమరానికి తెర లేవనుంది. ఎందుకంటే.. ఈ ఎన్నికల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు. బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే బీ. శ్రీరాములు శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి లోక్‌సభ ఎన్నికల గోదాలో దిగారు. కనుక ఆ స్థానం ఇదివరకే ఖాళీ అయినట్లే. ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే బళ్లారి రూరల్‌ను కలుపుకొని ఏడు స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ నుంచి నలుగురు, బీజేపీ, జేడీఎస్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు.
మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప (శికారిపుర), హెచ్‌డీ. కుమారస్వామి (రామనగర)లు శివమొగ్గ, చిక్కబళాపురంల నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌కు చెందిన ఏ. మంజు (అరకలగూడు) హాసన, వినయ్ కులకర్ణి (ధార్వాడ) హుబ్లీ-ధార్వాడ, మంత్రి ప్రకాశ్ హుక్కేరి (సదలగ) చిక్కోడి, ఎస్‌ఎస్. మల్లికార్జున దావణగెరెల నుంచి పోటీ చేశారు. వీరిలో అందరూ గెలుస్తారనే గ్యారంటీ లేకపోయినా, ఇద్దరు లేక ముగ్గురు గెలిచినా ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. గెలుపు గ్యారంటీ అనుకుంటున్న అభ్యర్థుల స్థానాల్లో ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనేది కూడా నిర్ణయమై పోయిందని చెబుతున్నారు.
యడ్యూరప్ప స్థానంలో ఆయన తనయుడు రాఘవేంద్ర, కుమారస్వామి సీటు కోసం ఆయన కుమారుడు నిఖిల్ గౌడ పేర్లు వినిపిస్తున్నాయి. శ్రీరాములు స్థానంలో ఆయన సోదరి, ప్రస్తుత ఎంపీ జే. శాంత లేదా రాయచూరు ఎంపీ సన్న ఫక్కీరప్ప పోటీ చేయవచ్చని వినవస్తోంది. మల్లికార్జున్ స్థానానికి ఆయన సోదరుడు బక్కేశ్, ప్రకాశ్ హుక్కేరి సీటు కోసం ఆయన తనయుడు ప్రకాశ్‌లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు.
ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిస్తే, ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. తుమకూరు నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఏ. కృష్ణప్ప బుధవారం రాత్రి హఠాన్మరణం చెందారు. ఒక వేళ ఆయన గెలిచినట్లయితే తుమకూరు లోక్‌సభ స్థానానికి కూడా ఉప ఎన్నికను నిర్వహించాల్సి ఉంటుంది.