శాసన మండలిలో ఏడు, రాజ్యసభలో నాలుగు స్థానాలకు రాష్ట్రం నుంచి జరగాల్సిన ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ వెలువడింది.
అవసరమైతే 19న ఎన్నికలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన మండలిలో ఏడు, రాజ్యసభలో నాలుగు స్థానాలకు రాష్ట్రం నుంచి జరగాల్సిన ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ వెలువడింది. అవసరమైతే ఈ నెల 19న ఎన్నికలు జరుగుతాయి. శాసన సభ నుంచి శాసన మండలికి జరిగే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ నాలుగు స్థానాలను సునాయాసంగా గెలుచుకునే అవకాశాలున్నాయి. బీజేపీ, జేడీఎస్‌లు చెరో స్థానాన్ని సొంతం చేసుకోవచ్చు. ఏడో స్థానానికి పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. మండలిలో ఏడుగురు ఈ నెల 30న రిటైర్ కానున్నారు. వీరిలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి డీవీ. సదానంద గౌడతో పాటు భారతి శెట్టి, కేవీ. నారాయణస్వామి, ఎంసీ. నాణయ్య, ఎంవీ. రాజశేఖరన్, సిద్ధరాజు, కే మానప్ప భండారీలు ఉన్నారు.
లోక్‌సభకు ఎన్నికైనందున సదానంద గౌడ ఇదివరకే శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభలో రాష్ట్రానికి చెందిన ఎస్‌ఎం. కృష్ణ, రమా జోయిస్, బీకే. హరిప్రసాద్, ప్రభాకర్ కోరె ఈ నెల 24న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నాలుగు స్థానాల్లో రెండింటిని కాంగ్రెస్ తిరిగి గెలుచుకునే అవకాశాలున్నాయి. ఎస్‌ఎం. కృష్ణ, హరిప్రసాద్‌ను మళ్లీ రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఒక స్థానాన్ని గెలుచుకునే అవకాశాలున్నాయి. జేడీఎస్ సహకారంతో నాలుగో స్థానాన్ని హస్తగతం చేసుకోవడానికి కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది.