న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన కీలకమైన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీలు) బిల్లు–2023ని కేంద్రం మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు బిల్లును తెచ్చామని న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ చెప్పారు. ‘‘1991 నాటి చట్టంలో సీఈసీ, ఈసీల నియామక నిబంధనలు లేవు.
తాజా బిల్లులో వాటిని పొందుపరిచాం. సీఈసీ, ఈసీ నియామకాలను ఇప్పటిదాకా ప్రభుత్వమే చేపట్టేది. ఇకపై వాటిని ప్రత్యేక కమిటీ చూసుకుంటుంది. వారి వేతనాలు తదితరాలను బిల్లులో పొందుపరిచాం. సీఈసీ, ఈసీలకు చట్టపరమైన రక్షణలను కల్పించాం’అని వివరించారు.
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం
బిల్లులోని అంశాలు ఈసీ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉన్నాయని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రధాని, ఆయన నామినేట్ చేసే సభ్యులు సీఈసీ, ఈసీలను నియమించడమంటే ఎన్నికల సంఘాన్ని నామమాత్రంగా మార్చడమేనని రణదీప్ సూర్జేవాలా (కాంగ్రెస్) అన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎంపిక కమిటీలో చేర్చకపోవడమేమిటని ఆప్ సభ్యుడు రాఘవ్ చద్దా ప్రశ్నించారు. సీఈసీ, ఈసీల హోదాను కేబినెట్ సెక్రటరీ స్థాయికి కేంద్రం దిగజార్చిందని జవహర్ సర్కార్ (టీఎంసీ) మండిపడ్డారు. బీజేడీ, డీఎంకే సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment