అశ్వరావుపేట ఎస్ఐ శ్రీను ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

అశ్వరావుపేట ఎస్ఐ శ్రీను ఆత్మహత్యాయత్నం

Published Mon, Jul 1 2024 1:20 AM | Last Updated on Mon, Jul 1 2024 8:07 AM

-

అపస్మారక స్థితిలో మహబూబాబాద్‌లో గుర్తింపు

పురుగుల మందు తాగి.. 108కు ఫోన్‌ చేసిన ఎస్సై

పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌ తరలింపు

అశ్వారావుపేటరూరల్‌/మహబూబాబాద్‌రూరల్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను అదృశ్యమైన ఘటన ఆదివారం కలకలం రేపింది. ఉదయం నుంచి ఆయన రాకుండా పోగా.. రాత్రి 11గంటలకు మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుతున్న సమయాన స్వయంగా ఆయనే 108కు ఫోన్‌ చేశాడు. దీంతో సిబ్బంది మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్‌ తరలించారు. 

ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన శ్రీను అశ్వారావుపేటలో ఐదు నెలలుగా ఎస్సైగా విధులు నిర్వర్తిస్తుండగా, ఆదివారం ఉదయం 8గంటలకు స్టేషన్‌కు వచ్చి సిబ్బందితో మాట్లాడారు. ఆ తర్వాత కారు నడుపుకుంటూ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆయన వద్ద రెండు సెల్‌ నంబర్లు స్విచ్చాఫ్‌ రావడంతో సిబ్బంది సీఐ జితేందర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు.

 ఆయన విచారణ చేపట్టగా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట అటవీ ప్రాంతంలో స్విచ్చాఫ్‌ అయ్యాయని గుర్తించినట్లు తెలిసింది. రాత్రి 10.30 గంటల వరకు కూడా ఎస్సై ఆచూకీ లభించక సిబ్బంది గాలింపు ముమ్మరం చేశారు. కొద్ది రోజులుగా ఎస్సైపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తుండగా.. స్టేషన్‌లోని సిబ్బందికి, ఎస్సై మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఈక్రమంలోనే సిబ్బంది సైతం జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయగా ఎస్సై నాలుగు రోజులు సెలవులో వెళ్లి బుధవారమే విధుల్లో చేరారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులతోనే ఆవేదన చెందినట్టు ప్రచారం జరుగుతోంది.

పురుగుల మందు తాగి.. 108కు ఫోన్‌
అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి 11గంటల మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ సమీపాన పురుగుల మందు తాగిన ఎస్సై.. స్వయంగా 108కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో డీఎస్పీ తిరుపతిరావు, మహబూబాబాద్‌ రూరల్‌, గూడూరు సీఐలు సర్వయ్య, బాబురావుతోపాటు 108 సిబ్బంది చేరుకుని ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఎస్సై పరిస్థితి విషమంగా ఉండడంతో అర్ధరాత్రి 12గంటలకు వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement