Ashwaraopet
-
అశ్వరావుపేట ఎస్ఐ శ్రీను ఆత్మహత్యాయత్నం
అశ్వారావుపేటరూరల్/మహబూబాబాద్‌రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను అదృశ్యమైన ఘటన ఆదివారం కలకలం రేపింది. ఉదయం నుంచి ఆయన రాకుండా పోగా.. రాత్రి 11గంటలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుతున్న సమయాన స్వయంగా ఆయనే 108కు ఫోన్ చేశాడు. దీంతో సిబ్బంది మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్ తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన శ్రీను అశ్వారావుపేటలో ఐదు నెలలుగా ఎస్సైగా విధులు నిర్వర్తిస్తుండగా, ఆదివారం ఉదయం 8గంటలకు స్టేషన్‌కు వచ్చి సిబ్బందితో మాట్లాడారు. ఆ తర్వాత కారు నడుపుకుంటూ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆయన వద్ద రెండు సెల్ నంబర్లు స్విచ్చాఫ్ రావడంతో సిబ్బంది సీఐ జితేందర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన విచారణ చేపట్టగా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట అటవీ ప్రాంతంలో స్విచ్చాఫ్ అయ్యాయని గుర్తించినట్లు తెలిసింది. రాత్రి 10.30 గంటల వరకు కూడా ఎస్సై ఆచూకీ లభించక సిబ్బంది గాలింపు ముమ్మరం చేశారు. కొద్ది రోజులుగా ఎస్సైపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తుండగా.. స్టేషన్‌లోని సిబ్బందికి, ఎస్సై మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఈక్రమంలోనే సిబ్బంది సైతం జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయగా ఎస్సై నాలుగు రోజులు సెలవులో వెళ్లి బుధవారమే విధుల్లో చేరారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులతోనే ఆవేదన చెందినట్టు ప్రచారం జరుగుతోంది.పురుగుల మందు తాగి.. 108కు ఫోన్అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి 11గంటల మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సమీపాన పురుగుల మందు తాగిన ఎస్సై.. స్వయంగా 108కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో డీఎస్పీ తిరుపతిరావు, మహబూబాబాద్ రూరల్, గూడూరు సీఐలు సర్వయ్య, బాబురావుతోపాటు 108 సిబ్బంది చేరుకుని ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఎస్సై పరిస్థితి విషమంగా ఉండడంతో అర్ధరాత్రి 12గంటలకు వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
ప్రేమ పేరుతో విద్యార్థినిని మోసం చేసిన అధ్యాపకుడు
సాక్షి, అశ్వారావుపేట: కొద్ది రోజుల క్రితం ఓ యువతి అనుమానస్పదంగా మృతి చెంది, చెరువులో శవమై కనిపించిన ఘటనకు సంబంధించిన కేసు మిస్టరీ శుక్రవారం వీడింది. స్థానిక ఎస్ఐ మధు కథనం ప్రకారం.. దమ్మపేట మండలం ఆర్లపెంట గ్రామానికి చెందిన నూతి రాఘవులు, రత్నమాల దంపతుల కుమార్తె నూతి హేమనాగశ్రీ(21) కొంతకాలంగా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలో గల అమ్మమ్మ వీరంకి పద్మ ఇంట్లో ఉండి, అశ్వారావుపేటలో గల ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఈ క్రమంలో ఈ నెల 6న తిరుమలకుంటలో గల అమ్మమ్మ ఇంటి నుంచి వినాయకపురం వెళ్లి వస్తానని చెప్పి బయటకు వచ్చిన హేమనాగశ్రీ మండలంలోని ఊట్లపల్లి వద్ద గల వెంకమ్మ చెరువులో శవమై కనిపించింది. దాంతో ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రియుడి మోసంతోనే.. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన అధ్యాపకుడు విద్యార్థినిని ప్రేమ పేరుతో వలలో వేసుకుని, పెళ్లికి నిరాకరించడంతోనే సదరు యువతి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. మండలంలోని తిరుమలకుంట గ్రామానికి చెందిన జుజ్జురి హరికృష్ణ స్థానిక వీకేడీవీ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో హరికృష్ణ గ్రామానికి చెందిన అదే కళాశాలలో డిగ్రీ చదువుతున్న హేమనాగశ్రీని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబరుచుకున్నాడు. కాగా హరికృష్ణకు 2017 ఫిబ్రవరిలో వేరే యువతితో పెళ్లి కాగా, ఆ తర్వా త కుడా హేమనాగశ్రీకు మాయ మాటలు చెబుతూ ప్రేమ పేరుతో సంబంధాన్ని సాగించాడు. ఈ క్రమంలోనే హేమనాగశ్రీకు కొద్ది రోజుల క్రితం తల్లిదండ్రులు పెళ్లికి ఏర్పాట్లు చేస్తుండగా, ఈ నెల 5న హరికృష్ణకు ఈ విషయం చెప్పి, పెళ్లి చేసుకోవాలని కోరింది. దానికి హరికృష్ణ నిరాకరించడంతో మనస్తాపం చెందిన యువతి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వివరించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హరికృష్ణను శుక్రవారం అరెస్ట్ చేసి, సత్తుపల్లి కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. -
పోకిరీలు వేధిస్తున్నారని..
అశ్వారావుపేట ఖమ్మంజిల్లా : స్థానిక పాత ఆంధ్రాబ్యాంకు వీధిలో ఓ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్న మైనర్ బాలిక సోమవారం ఉదయం నల్లుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం రాత్రి అదే వీధిలో కొందరు యువకులు అటుగా వెళుతున్న బాలికలు, యువతులను సెల్ఫోన్లో ఫొటోలు తీస్తున్నారంటూ పాల దుకాణం నిర్వాహకురాలు ప్రశ్నించడంతో యువకులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. తెల్లారగానే ఎదురుగా ఉన్న దుకాణంలో పనిచేస్తున్న మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దుకాణంలో ఉండగానే నోటి నుంచి నురగలు వస్తుండటంతో షాపు యజమాని స్థానిక ఆస్పత్రిలో చేర్పించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి చికిత్స చేయిస్తున్నారు. బాధిత బాలిక తెలిపిన వివరాల ప్రకారం.. సదరు పాల దుకాణం నిర్వాహకురాలు తనపై చెప్పలేని నిందలు మోపిందని, ఇందుకు మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొంది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసే ఉద్దేశం లేదని చెబుతోంది. కాగా అదే వీధిలో దుకాణాలు ఎక్కువగా ఉండటంతో పాటు సినిమాహాల్, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. సినిమాహాల్ పరిసర ప్రాంతాల్లో కొందరు యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చుట్టుపక్కల వారు ఆరోపిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా గొడవలు, కేకలతో చుట్టుపక్కల వారికి ఇబ్బందికరంగా ఉందని ఆరోపిస్తున్నారు. కానీ ఏమాత్రం వారి జోలికి వెళ్లినా లేనిపోని గొడవల్లోకి లాగుతారేమోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాజా సంఘటనకు సంబంధం ఉన్నా లేకున్నా ఈవీధిలో అల్లరి మూకలను అదుపు చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై అశ్వారావుపేట ఎస్ఐ వేల్పుల వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లగా షాపింగ్ కాంప్లెక్స్‌పై నిఘా పెంచుతామన్నారు. -
అశ్వరావుపేటలో అగ్నిప్రమాదం
అశ్వరావుపేట(ఖమ్మం): ఆటోమొబైల్స్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించి భారీ ఆస్తినష్టం వాటిల్లింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పట్టణంలోని ఖమ్మం రోడ్డులోఉన్న హేమ ఆటోమొబైల్స్ దుకాణం నుంచి మంటలు చెలరేగడాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దుకాణంలో ఇంజిన్ ఆయిల్ డబ్బాలు ఎక్కువగా ఉండటంతో.. మంటలు త్వరగా చెలరేగి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో రూ. 5 లక్షలు మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. -
గవర్నర్ దృష్టికి ఎమ్మెల్యేపై దాడి ఘటన
-
గవర్నర్ దృష్టికి ఎమ్మెల్యేపై దాడి ఘటన
హైదరాబాద్ : అశ్వారావు పేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై టీడీపీ ఎంపీ మాగంటి బాబు దౌర్జనం చేసిన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన తెలంగాణ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసి దాడి ఘటనను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్ ను కోరారు. కాగా ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై ఏపీకి చెందిన టీడీపీ కార్యకర్తలు గురువారం దాడి చేసిన విషయం తెలిసిందే. పోలవరం ముంపు మండలాల ఆదివాసీలకు మెరుగైన ప్యాకేజీతో కూడిన నష్టపరిహారాన్ని ఇవ్వాలని వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లిన ఆయనపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సాక్షిగా పిడిగుద్దుల వర్షం కురిపించారు. కిందపడేసి కుర్చీలతో దాడి చేశారు. దీంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. -
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాటిపై టీడీపీ కార్యకర్తల దాడి
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సాక్షిగా పిడిగుద్దులు రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయిన గిరిజన ఎమ్మెల్యే అశ్వారావుపేట/కుక్కునూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై ఏపీకి చెందిన టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. పోలవరం ముంపు మండలాల ఆదివాసీలకు మెరుగైన ప్యాకే జీతో కూడిన నష్టపరిహారాన్ని ఇవ్వాలని వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లిన ఆయనపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సాక్షిగా పిడిగుద్దుల వర్షం కురిపించారు. కిందపడేసి కుర్చీలతో దాడి చేశారు. దీంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. వివరాలివీ.. పోలవరం ముంపు ప్రాంతాల కింద ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గురువారం సమావేశాలు నిర్వహించారు. కుక్కునూరులో సమావేశం నిర్వహిస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు వెళ్లారు. ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే అయిన తనను ఎందుకు పిలవలేదని కలెక్టర్ కాటమనేని ప్రశ్నించారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ ‘సారీ సార్ మర్చిపోయాం.. మరోసారి సమావేశాలను తెలియజేస్తామ’ని చెప్పారు. ఎంపీ మాగంటి బాబుతో ఎమ్మెల్యే కరచాలనం చేసి తన డిమాండ్లను వినిపిస్తుండగా.. అక్కడే ఉన్న టీడీపీ నాయకులు ఎమ్మెల్యేను ఉద్దేశిస్తూ.. పరుష పదజాలంతో మాట్లాడారు. ‘నువ్వెవడివిరా.. తెలంగాణ వాడివి.. ఆంధ్రకు నువ్వెందుకు వచ్చావు..’ అంటూ దాడికి దిగారు. మాగంటి అనుచరుడు కూడా ఎమ్మెల్యేపై దాడి చేశాడు. ప్రాంగణంలోని దాదాపు 20మందికి పైగా టీడీపీ కార్యకర్తలు గిరిజన ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పిడిగుద్దులు గుద్దారు. కులం పేరుతో దూషిస్తూ.. చంపేస్తామంటూ హెచ్చరించారు. దాడిని ఆపాల్సిన పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించారు. కలెక్టర్, ఎంపీ మాగంటి బాబు, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు చూస్తూ ఉండిపోయారు. అనంతరం ఎమ్మెల్యే తాటిని కుక్కునూరు పోలీసులు విచక్షణారహితంగా రోడ్డు మీదకు ఈడ్చుకురావడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. తనపై జరిగిన దాడికి నిరసనగా రోడ్డుపైనే దాదాపు మూడు గంటలపాటు బైఠాయించారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తాటికి మద్దతుగా పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. దాడికి నిరసనగా శుక్రవారం అశ్వారావుపేట నియోజకవర్గ బంద్ నిర్వహించాలని వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. కాగా ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై దాడికి పాల్పడిన, పురికొల్పిన 15 మందిపై కుక్కునూరు ఎస్సై ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.