
ప్రతీకాత్మక చిత్రం
అశ్వారావుపేట ఖమ్మంజిల్లా : స్థానిక పాత ఆంధ్రాబ్యాంకు వీధిలో ఓ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్న మైనర్ బాలిక సోమవారం ఉదయం నల్లుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం రాత్రి అదే వీధిలో కొందరు యువకులు అటుగా వెళుతున్న బాలికలు, యువతులను సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీస్తున్నారంటూ పాల దుకాణం నిర్వాహకురాలు ప్రశ్నించడంతో యువకులు ఆమెతో వాగ్వాదానికి దిగారు.
తెల్లారగానే ఎదురుగా ఉన్న దుకాణంలో పనిచేస్తున్న మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దుకాణంలో ఉండగానే నోటి నుంచి నురగలు వస్తుండటంతో షాపు యజమాని స్థానిక ఆస్పత్రిలో చేర్పించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి చికిత్స చేయిస్తున్నారు. బాధిత బాలిక తెలిపిన వివరాల ప్రకారం.. సదరు పాల దుకాణం నిర్వాహకురాలు తనపై చెప్పలేని నిందలు మోపిందని, ఇందుకు మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొంది.
ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసే ఉద్దేశం లేదని చెబుతోంది. కాగా అదే వీధిలో దుకాణాలు ఎక్కువగా ఉండటంతో పాటు సినిమాహాల్, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. సినిమాహాల్ పరిసర ప్రాంతాల్లో కొందరు యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చుట్టుపక్కల వారు ఆరోపిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా గొడవలు, కేకలతో చుట్టుపక్కల వారికి ఇబ్బందికరంగా ఉందని ఆరోపిస్తున్నారు.
కానీ ఏమాత్రం వారి జోలికి వెళ్లినా లేనిపోని గొడవల్లోకి లాగుతారేమోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాజా సంఘటనకు సంబంధం ఉన్నా లేకున్నా ఈవీధిలో అల్లరి మూకలను అదుపు చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై అశ్వారావుపేట ఎస్‌ఐ వేల్పుల వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లగా షాపింగ్ కాంప్లెక్స్‌పై నిఘా పెంచుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment