సాక్షి, అశ్వారావుపేట: కొద్ది రోజుల క్రితం ఓ యువతి అనుమానస్పదంగా మృతి చెంది, చెరువులో శవమై కనిపించిన ఘటనకు సంబంధించిన కేసు మిస్టరీ శుక్రవారం వీడింది. స్థానిక ఎస్‌ఐ మధు కథనం ప్రకారం.. దమ్మపేట మండలం ఆర్లపెంట గ్రామానికి చెందిన నూతి రాఘవులు, రత్నమాల దంపతుల కుమార్తె నూతి హేమనాగశ్రీ(21) కొంతకాలంగా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలో గల అమ్మమ్మ వీరంకి పద్మ ఇంట్లో ఉండి, అశ్వారావుపేటలో గల ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఈ క్రమంలో ఈ నెల 6న తిరుమలకుంటలో గల అమ్మమ్మ ఇంటి నుంచి వినాయకపురం వెళ్లి వస్తానని చెప్పి బయటకు వచ్చిన హేమనాగశ్రీ మండలంలోని ఊట్లపల్లి వద్ద గల వెంకమ్మ చెరువులో శవమై కనిపించింది. దాంతో ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
ప్రియుడి మోసంతోనే..
విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన అధ్యాపకుడు విద్యార్థినిని ప్రేమ పేరుతో వలలో వేసుకుని, పెళ్లికి నిరాకరించడంతోనే సదరు యువతి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. మండలంలోని తిరుమలకుంట గ్రామానికి చెందిన జుజ్జురి హరికృష్ణ స్థానిక వీకేడీవీ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో హరికృష్ణ గ్రామానికి చెందిన అదే కళాశాలలో డిగ్రీ చదువుతున్న హేమనాగశ్రీని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబరుచుకున్నాడు. కాగా హరికృష్ణకు 2017 ఫిబ్రవరిలో వేరే యువతితో పెళ్లి కాగా, ఆ తర్వా త కుడా హేమనాగశ్రీకు మాయ మాటలు చెబుతూ ప్రేమ పేరుతో సంబంధాన్ని సాగించాడు. ఈ క్రమంలోనే హేమనాగశ్రీకు కొద్ది రోజుల క్రితం తల్లిదండ్రులు పెళ్లికి ఏర్పాట్లు చేస్తుండగా, ఈ నెల 5న హరికృష్ణకు ఈ విషయం చెప్పి, పెళ్లి చేసుకోవాలని కోరింది. దానికి హరికృష్ణ నిరాకరించడంతో మనస్తాపం చెందిన యువతి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ వివరించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హరికృష్ణను శుక్రవారం అరెస్ట్ చేసి, సత్తుపల్లి కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు.
ప్రేమ పేరుతో విద్యార్థినిని మోసం చేసిన అధ్యాపకుడు
Published Sat, Oct 12 2019 10:44 AM | Last Updated on Sat, Oct 12 2019 10:44 AM
Comments
Please login to add a commentAdd a comment