- బళ్లారి ఎంపీ శ్రీరాములు
సాక్షి, బళ్లారి : కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్‌ఎస్) 2011లో నిర్వహించిన పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం మూర్ఖత్వమని బళ్లారి ఎంపీ శ్రీరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం బళ్లారి తాలూకాలోని సంగనకల్లులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదివి కేపీఎస్‌సీలో పాసైతే ఆ పరీక్షలను ఏకంగా రద్దు చేయడం దురదృష్టకరమన్నారు.
362 మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించిన వారు గెజిటెడ్ ఆఫీసర్లుగా నియామకాలు జరుగుతాయని ఆశిస్తే కేబినెట్ సమావేశంలో మొత్తం పరీక్షలను రద్దు చేయడం బాధాకరమన్నారు. ఆ పరీక్షల్లో ఎందరో పేదలు, దళితులు, అగ్రవర్ణాలకు చెందిన నిరుపేద మహిళలు కష్టపడి చదివి పాసయ్యారని, వారందరి జీవితాలను సీఎం నాశనం చేస్తున్నారన్నారు. కేపీఎస్‌సీని స్వయంప్రతిపత్తిగా మార్చాలని రాజకీయ జోక్యం తగదన్నారు.
యూపీఎస్‌సీ మాదిరిగానే కేపీఎస్‌సీని మార్చాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారిని శిక్షించాల్సింది పోయి ఏకంగా పరీక్షలనే రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో వరుసగా బోరుబావుల్లో పడి చిన్నారులు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో విధాన పరిషత్ సభ్యుడు మృత్యుంజయ జినగా, జెడ్పీ సభ్యుడు రాజశేఖరగౌడ, బీజేపీ నాయకులు రామలింగప్ప పాల్గొన్నారు.
సీఎం సిద్ధరామయ్య ప్రచారం చేసినా ఓబుళేసు గెలుపు తథ్యం
కాంగ్రెస్ అభ్యర్థి ఎన్‌వై. గోపాలకృష్ణ తరుపున సీఎం సిద్ధరామయ్య ఇక్కడ తిష్టవేసి ప్రచారం నిర్వహించినా బీజేపీ అభ్యర్థి ఓబుళేసు గెలువడం ఖాయమని బళ్లారి ఎంపీ బీ.శ్రీరాములు ధీమా వ్యక్తం చేశారు.ఆయన సంగనకల్లు గ్రామంలో ఓబుళేసు తరుపున ఎన్నికల ప్రచారం పాల్గొని,ఇంటింటా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థి ఓబుళేసుకు బళ్లారి గ్రామీణ నియోజకవర్గ వ్యాప్తంగా మంచి పరిచయాలు ఉన్నాయని, తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఓబుళేసు నియోజకవర్గ వ్యాప్తంగా పరిచయాలు పెంచుకుని, వారికి పనులు చేసి పెట్టారని గుర్తు చేశారు.