
సమాజాభివృద్ధిలో పత్రికల పాత్ర కీలకం
- జిల్లా ఇన్‌చార్జి మంత్రి పరమేశ్వర నాయక్
సాక్షి, బళ్లారి : సమాజాభివృద్ధిలో పత్రికల పాత్ర కీలకమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పరమేశ్వర నాయక్ అన్నారు. ఆదివారం నగరంలోని బీడీఏఏ మైదానంలో మీడియా క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. అన్ని రాజకీయ పార్టీల నేతలను ఒకే వేదికపైకి చేర్చి విలేకరులు కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదే విధంగా జిల్లా అభివృద్ధికి కూడా ప్రజాప్రతినిధులంతా కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.
జిల్లా పంచాయతీ కేడీపీ సమావేశంలో ఎంపీ శ్రీరాములు ఎందుకు రాలేదని తాను జెడ్పీ సీఈఓను అడిగానని, అయితే అప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున ఆయన రాలేకపోయారని తెలిసిందన్నారు. ప్రస్తుతం ఈ వేదికపై శ్రీరాములు కూడా పాల్గొనడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. సమాజాభివృద్ధిలో విలేకరుల పాత్ర ఆమోఘమన్నారు. పత్రికలుప్రభుత్వాలను సైతం కూలగొట్టడం తన కళ్లారా చూశానన్నారు.
గుండారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పత్రిక ఆయనను ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగేందుకు కారణమైందన్నారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా చేయడంలో ఆ పత్రిక పని చేసిందని గుర్తు చేశారు. ఇలా పత్రికలు తలుచుకుంటే ప్రభుత్వాలను సైతం కూలగొడుతాయన్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి దాదాపు అన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియానే కారణమని పరోక్షంగా విమర్శించారు.
ప్రతి రోజు మన దేశంలో నూటికి 70 శాతం మంది ఉదయం మొదలు పేపర్ చూసిన తర్వాతనే దినచర్య ప్రారంభిస్తారన్నారు.ప్రభుత్వ బాధ్యతలను, ప్రజాప్రతినిధుల విధులను ఎప్పుటికప్పుడు గుర్తు చేసేది పత్రికలేనన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, పెండింగ్‌లో ఉన్న పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చి వాటిని పరిష్కరించేందుకు పత్రికలు ఎంతగానో దోహదం చేస్తున్నాయన్నారు. రాత్రనక, పగలనక విలేకరులు తమ వృత్తిని కొనసాగిస్తారని కొనియాడారు.
విలేకరుల వృత్తి ఎంతో కష్టమైంది
విలేకరుల వృత్తి ఎంతో కష్టమైనదని, అయినా సమాజాభివృద్ధి కోసం విలేకరులు ఎన్ని కష్టాలు ఎదురైనా ఓర్పుతో ముందుకు వెళుతున్నారని బళ్లారి ఎంపీ బీ.శ్రీరాములు అన్నారు. ఆయన బీడీఏఏ మైదానంలో పాత్రికేయ దినోత్సవంలో మాట్లాడుతూ పత్రికలు నడపడం అంత సులభం కాదన్నారు. అదేవిధంగా విలేకరులుగా పని చేయడం కూడా కత్తి మీద సాములాంటిదన్నారు. రాజకీయ నాయకులకు చుట్టూ కార్యకర్తలు, గన్‌మెన్లు ఉంటారని, అయితే విలేకరులకు మాత్రం ఎవరూ ఉండరని, అయినా ఒంటరిగానే సమస్యలు ఎదుర్కొంటారన్నారు. ఎంతో టెన్షన్‌తో పని చేస్తూ వారి కుటుంబాల బాగోగులను కూడా పట్టించుకోరన్నారు.
అనంతరం సీనియర్ పాత్రికేయులను సన్మానించారు. తెలుగు, కన్నడ పత్రికలకు చెందిన తిమ్మప్ప చౌదరి, పరుశురాం కలాల్, భీమన్న గజాపుర, పంపాపతి హోతూరు, ఉడెం కృష్ణమూర్తి, ఇమాం గోడేకర్, మంజునాథ్ సాలి తదితరులను సన్మానించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఎంతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో బళ్లారి ఎంపీ బీ.శ్రీరాములు, విధానపరిషత్ సభ్యుడు మృత్యుంజయ జినగ, ఎమ్మెల్యే అనిల్‌లాడ్, ఉపమేయర్ జయలలిత, బళ్లారి మీడియా క్లబ్ అధ్యక్షుడు మధుసూధన, కార్యదర్శి మంజునాథ పాల్గొన్నారు.