ఓడీచెరువు మండలం మద్దకవారిపల్లి గ్రామానికి చెందిన వలస కూలీ శ్రీరాములు (50) కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి తాలూకా మారగానికుంట్ల వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
ఓడీ చెరువు : ఓడీచెరువు మండలం మద్దకవారిపల్లి గ్రామానికి చెందిన వలస కూలీ శ్రీరాములు (50) కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి తాలూకా మారగానికుంట్ల వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సమీప బంధువులు తెలిపిన వివరాల మేరకు.. మద్దకవారిపల్లికి చెందిన ఆయన మారగానికుంట్ల మీదుగా బెంగళూరుకు బయలు దేరాడు. తెలిసిన వ్యక్తి ద్విచక్రవాహనం రావడంతో శ్రీరాములు వాహనం వెనక కూర్చొన్నాడు.
కొంత దూరం వెళ్లగానే వాహనం అదుపు తప్పడంతో వెనుక కూర్చున్న శ్రీరాములు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడికి భార్య ప్రమీల, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పొట్ట కూటి కోసం వెళ్లి తిరిగిరాని లోకానికి పోయాడని కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.