పండుగకు వచ్చి పరలోకాలకు..
పుట్టపర్తి అర్బన్: పొట్ట కూటి కోసం వలస వెళ్లి.. వినాయక చవితిని స్వగ్రామంలో చేసుకుందామని వచ్చిన కూలీని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. పుట్టపర్తి రూరల్ ఇన్‌చార్జి ఎస్‌ఐ రాజశేఖరరెడ్డి, ఏఎస్‌ఐ ప్రసాద్, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కొట్లపల్లికి చెందిన పెద్దన్న, మణెమ్మ దంపతుల పెద్ద కుమారుడు నరిగెప్పగారి ప్రతాప్ (25) బెంగళూరులో టైల్స్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోవడానికి స్వగ్రామం కొట్లపల్లికి వచ్చాడు.
శుక్రవారం గణపతి పూజ అయిన అనంతరం భోజనం ముగించుకుని బుగ్గపల్లిలో రైతు వద్ద తనకు రావాల్సిన కూలి డబ్బు తెచ్చుకునేందుకు వెళ్లాడు. అక్కడ పని చూసుకుని బైక్‌పై తిరిగి వస్తుండగా బుగ్గపల్లి సమీపంలోని మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గోతిలోకి దూసుకెళ్లాడు. పెద్ద బండరాయిపై ఎగిరిపడిన ప్రతాప్ అక్కడికక్కడే మృతి చెందాడు. ‘ఏ పని చెప్పినా ఇట్టే చేసిపెట్టేవాడని.. ఇద్దరి పని ఒకడే చేసే వాడని.. చిన్న వయసులోనే మాకు దూరం చేశావా దేవుడా.. అని కుటుంబ సభ్యులు బోరున విలపించారు.