శ్రీరాములును ముందుకు తీసుకురావడం ఆచితూచి రచించిన వ్యూహంలో భాగమే. లింగాయత్‌లకు ప్రత్యేక మత హోదా కల్పిస్తామంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన నేపథ్యంలో ఇన్నాళ్లూ తమకు అండగా ఉన్న ఆ వర్గం ఓట్ల మీదే పూర్తిగా ఆధారపడడం సాధ్యం కాదని బీజేపీ గుర్తించింది. ఈ ఎన్నికలలో లింగాయత్‌లలో ఒక వర్గం కాంగ్రెస్‌కు ఓటు వేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. శ్రీరాములు కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకును ఆకర్షించగలరని బీజేపీ ఆశిస్తున్నది. ఆ విధంగా 2019 ఎన్నికలలో ట్రంప్‌కార్డుగా ఉపయోగపడతారని భావిస్తున్నది.
రెండు వారాల క్రితం వరకు కూడా కర్ణాటక బీజేపీలో తిరుగులేని నాయకుడు ఎవరంటే అందరికీ బీఎస్ యడ్యూరప్ప కనిపించారు. పత్రికలలో కనిపిస్తున్న రాతల ప్రకారం కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే కూడా. కానీ గడచిన పదిరోజులుగా జరుగుతున్న పరిణామాలు ఆయన స్థాయిని దిగజార్చినట్టు కనిపిస్తున్నది. వరుణ అసెంబ్లీ నియోజక వర్గ పరిణామాలే చూద్దాం. ఆ నియోజక వర్గంలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రతో యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర తలపడవలసి ఉంది. కానీ విజయేంద్ర నామినేషన్‌ను చివరిక్షణంలో రద్దు చేశారు. ఈ పరిణామం యడ్యూరప్ప మద్దతుదారులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
లింగాయత్ వర్గంలో బలమైన నాయకుడి పట్ల, మొత్తం కర్ణాటక గౌరవించే నాయకుడి విషయంలో, పార్టీని విధాన సౌధలో ప్రతిష్టిం గల నేత పట్ల చూపించవలసిన మర్యాద ఇదేనా అని ఆయన మద్దతుదారులు నిలదీస్తున్నారు. పుండు మీద కారం చల్లినట్టు మరో పరిణామం కూడా జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే బహిరంగ సభలలో స్థానం కల్పించడంలేదని పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా యడ్యూరప్పకు తెలియచేశారు. ఇదంతా చూస్తుంటే యడ్యూరప్పను నెమ్మదిగా పక్కన పెడుతున్నట్టు కార్యకర్తలకు సంకేతాలు వెళుతున్నాయి. ఈ పరిణామాలను కాంగ్రెస్ సంబరంగా పరికిస్తున్నది. అంతేకాకుండా, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీకి జరిగినట్టే యడ్యూరప్పకు కూడా జరుగుతుందని ఎద్దేవా చేస్తోంది.
శ్రీరాములు వైపు బీజేపీ చూపు
రాష్ట్ర బీజేపీ ప్రస్తుతం బి. శ్రీరాములు వైపు మొగ్గు చూపుతోంది. ఈ పరిణామాన్ని గమనిస్తే ఆ పార్టీలో వచ్చిన మార్పు ఏమిటో మరింత సుస్పష్టంగా గోచరిస్తుంది. ఈ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఆధిక్యత సాధిస్తే అందరికీ కనిపించే వ్యక్తి శ్రీరాములేనని వినిపిస్తున్నది కూడా. భవిష్యత్తులో ఇలాంటి స్థానం దక్కుతుందని భావించడానికి గల కారణాన్ని తెలుసుకోవాలంటే శ్రీరాములు గతాన్ని చూడాలి. శ్రీరాములు తండ్రి రైల్వే ఉద్యోగి. ఆయనకు ఏడుగురు పిల్లలు. అయితే తనకు ఉన్న ఆస్తి, బళ్లారిలో ఉన్న ఖరీదైన భవనం సహా అంతా పూర్వీకుల నుంచి సంక్రమించినదేనని శ్రీరాములు చెబుతారు. అలాగే ఈ ఆస్తి తమకు గనుల తవ్వకాల ద్వారా వచ్చింది కాదని కూడా అంటారు. ఆయన తన ఆస్తి మొత్తం రూ. 23 కోట్లని ప్రకటించారు (2013లో ఆయన తన ఆస్తి మొత్తం రూ. 43 కోట్లుగా చూపారు). ఎన్నికలలో బాగా డబ్బు ఖర్చు పెట్టే అభ్యర్థులలో ఆయన కూడా ఒకరు.
ఆయనపై చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయితే ఆయన చేసే దానధర్మాల కారణంగా రాబిన్‌హుడ్ తరహా మనస్తత్వమని చెబుతూ ఉంటారు. శ్రీరాములుకు ఆయన కులమే పెద్ద ఆసరా. 46 సంవత్సరాల శ్రీరాములు వాల్మీకి నాయక్ కులం నుంచి వచ్చిన నాయకుడు (వీరు కర్ణాటక జనాభాలో ఏడు శాతం ఉన్నారు). దీనితో షెడ్యూల్డ్ ట్రైబ్ వర్గం నుంచి అత్యధికంగా ఓట్లను ఆకర్షించవచ్చునని బీజేపీ అంచనా. అలాగే బీజేపీ అంటే సద్భావం లేని దళితులకు శ్రీరాములు ద్వారా దగ్గర కావచ్చునని కూడా ఆ పార్టీ ఆలోచన. ఆ విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రూపొందించిన ‘అహిందా’(దళితులు, వెనుకబడిన తరగతులు, ముస్లింలను కలిపి చెప్పడానికి కన్నడలో ఉపయోగించే హ్రస్వనామం) ఓటు బ్యాంకును బద్దలు కొట్టవచ్చునని కూడా ఆ పార్టీ యోచిస్తున్నది. శ్రీరాములును ముందుకు తీసుకురావడం ఆచితూచి రచించిన వ్యూహంలో భాగమే. లింగాయత్‌లకు ప్రత్యేక మత హోదా కల్పిస్తామంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన నేపథ్యంలో ఇన్నాళ్లూ తమకు అండగా ఉన్న ఆ వర్గం ఓట్ల మీదే పూర్తిగా ఆధారపడడం సాధ్యం కాదని బీజేపీ గుర్తించింది.
ఈ ఎన్నికలలో లింగాయత్‌లలో ఒక వర్గం కాంగ్రెస్‌కు ఓటు వేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కూడా. శ్రీరాములు కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకును ఆకర్షించగలరని బీజేపీ ఆశిస్తున్నది. ఆ విధంగా 2019 ఎన్నికలలో ఆయన ట్రంప్‌కార్డుగా కూడా ఉపయోగపడతారని భావిస్తున్నది. ఈ కారణంగానే కావచ్చు, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అసెంబ్లీకి పోటీ చేస్తున్న ఏకైక ఎంపీ యడ్యూరప్ప అని ముందు ప్రకటించినప్పటికీ, తరువాత శ్రీరాములుకు కూడా అలాంటి అవకాశమే కల్పించడం ఇందుకే కాబోలు. అంతేకాదు. బళ్లారి నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీరాములు యడ్యూరప్పతో సమంగా ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్ అందుబాటులో ఉన్న రాష్ట్ర స్థాయి నాయకుడు. ఏకంగా 80 నియోజకవర్గాల ప్రచార బాధ్యతలు చూసుకోవలసిందని శ్రీరాములును బీజేపీ ఆదేశించింది. ఇంతటి గురుతర బాధ్యత మరొక నాయకుడు ఎవరికీ అప్పగించలేదు కూడా. బాదామి నియోజకవర్గంలో సిద్ధరామయ్య మీద తన అభ్యర్థిగా బీజేపీ శ్రీరాములును ఎంపిక చేయడం కూడా ఆయనకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని తెలియచేస్తున్నది.
నల్లేరు మీద బండి నడక కాదు..
ఈ పరిణామాల నేపథ్యంలోనే ఈ ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే ఉప ముఖ్యమంత్రి పదవి శ్రీరాములునే వరిస్తుందని పార్టీలోనే చెప్పుకుంటున్నారు. ఆ పదవి కోసం పలువురు రంగంలో ఉన్నప్పటికీ ఎక్కువ అవకాశాలు శ్రీరాములుకే ఉన్నాయని వారి వాదన. అంతకుమించి బాదామి నియోజకవర్గంలో సిద్ధరామయ్యను కనుక ఓడించగలిగితే, జెయింట్ కిల్లర్‌గా అవతరిస్తే అంతకు మించిన స్థానమే ఆయనకు దక్కవచ్చు కూడా. కానీ బీజేపీ శ్రీరాములును ఎంతగా ముందుకు తీసుకువచ్చినా, ఆయనకు వ్యవహారమంతా నల్లేరు మీద బండినడక కాకపోవచ్చు. శ్రీరాములు అంటే గాలి జనార్దనరెడ్డి మనిషి అన్న మచ్చ ఉంది. గనుల అక్రమాలతో అపకీర్తి పాలైన గాలి జనార్దనరెడ్డి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు కలిపి ఏడు టికెట్లను బీజేపీ కేటాయించింది. ఆ విధంగా కాంగ్రెస్‌కు విమర్శించడానికి అవకాశం అందించింది.
అలాగే జనార్దనరెడ్డి పట్ల తనకున్న విధేయతను దాచి పెట్టేం దుకు శ్రీరాములు కూడా ప్రయత్నించలేదు. నిజానికి ముడి ఇనుము అవినీతి ఆరోపణలతో జనార్దనరెడ్డిని సీబీఐ అరెస్టు చేసినప్పుడే శ్రీరాములు 2011లో బీజేపీకి రాంరాం చెప్పి, బీఎస్‌ఆర్ కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించుకున్నారు. బళ్లారి జిల్లాలో విజయం సాధించాలంటే బీఎస్‌ఆర్ కాంగ్రెస్ సాయం ఉండాలని 2013లో బీజేపీకి తెలిసి వచ్చింది. బీజేపీ కూడా శ్రీరాములు లేకుండా ముందుకు వెళ్లడం సాధ్యం కాదని తీర్మానానికి వచ్చింది. దీనితో 2014 లోక్‌సభ ఎన్నికలలో బళ్లారి స్థానం కేటాయించేందుకు ముందుకు వచ్చింది. నిజానికి గాలి జనార్దనరెడ్డితో ఇప్పుడు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మార్చి 31న అమిత్‌షా ప్రకటించడంతో శ్రీరాములు నిరాశకు గురయ్యారని తెలుస్తున్నది. దీనితో ఆయన పార్టీకి నిరసన తెలిపారని కూడా తెలియవచ్చింది. తాను పార్టీకి అవసరమైతే, జనార్దనరెడ్డి వర్గంతో కూడా జత కట్టవలసిందేనని శ్రీరాములుకు స్పష్టత ఉంది.
శ్రీరాములుకు ప్రాధాన్యం కల్పించడమంటే జనార్దనరెడ్డి రాకకు తలుపులు తెరవడమే. అయినా తాను సచ్చీలంగానే ఉన్నట్టు చెప్పడానికి బీజేపీ జనార్దనరెడ్డికి టిక్కెట్టు ఇవ్వలేదని, ఆయన సన్నిహితులకు మాత్రమే ఇచ్చామని చెప్పుకుంటున్నది. కానీ బళ్లారిలో ప్రవేశించరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ జనార్దనరెడ్డి బీజేపీ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చిత్రదుర్గ–బళ్లారి సరిహద్దులలోని తన భవనం నుంచే వ్యూహాలు పన్నుతున్నారు. శ్రీరాములు తన నామినేషన్ పత్రాలను సమర్పించిన తరువాత జరిగిన బహిరంగ సభలో కూడా జనార్దనరెడ్డి దర్శనమిచ్చారు. చిత్రదుర్గ్ జిల్లా మొలకల్మూరులో శ్రీరాములు కోసం ప్రచారం నిర్వహించారు. అలాగే తన మేనకోడలు లల్లేశ్ రెడ్డి బెంగళూరు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసినప్పుడు కూడా హాజరయ్యారు. జనార్దనరెడ్డి తన పేరును బీజేపీ అధిష్టానానికి సిఫారసు చేయడం వల్లనే టిక్కెట్టు వచ్చిందని లల్లేశ్ చెప్పారు.
బళ్లారి బరితోనే దేశం దృష్టికి..
1999లో బళ్లారి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పోటీ చేసినప్పుడు, సుష్మ స్వరాజ్‌ను బీజేపీ బరిలోకి దింపింది. ఆ సమయంలోనే జనార్దనరెడ్డితో కలసి, శ్రీరాములు పేరు ఒక్కసారిగా జాతీయ స్థాయి పత్రికలలో పతాక శీర్షికలలో కనిపించింది. ఒక దశాబ్దం తరువాత కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వారిద్దరు సహకరించారు. ఆ విధంగా దక్షిణాదిన ఆ పార్టీ మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పాటుపడిన వారు అయ్యారు. ఈసారి కూడా ఈ బళ్లారి ద్వయం బెంగళూరులో తమ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఉపకరిస్తుందని బీజేపీ భావిస్తున్నది. మొలకల్మూరు ప్రచారం తరువాత గగ్గోలు రేగడంతో ప్రచారానికి దూరంగా ఉండవలసిందని జనార్దనరెడ్డిని ఆదేశించారు.
అయినప్పటికీ కూడా బళ్లారి ద్వయం తమకు ఉపయోగపడాలనే పార్టీ భావిస్తున్నది. కర్ణాటక ప్రజానీకం జనార్దనరెడ్డి మీద పడిన మచ్చను మరచిపోవాలని కూడా కోరుకుంటున్నది. నిజానికి గనుల అక్రమాల వ్యవహారం చాలా తీవ్రమైనదే అయినా, బళ్లారి పరిసరాలు దాటితే దాని ప్రభావం తక్కువ. దీనికి తోడు కాంగ్రెస్ కూడా అనంద్‌సింగ్, నాగేంద్ర అనే ఇద్దరికి టిక్కెట్లు ఇచ్చింది. వీరి ద్దరు గతంలో బీజేపీలో పనిచేసినవారే. అలాగే గనుల అక్రమాలలో సీబీఐ వీరి మీద కేసులు నమోదు చేసింది కూడా. ఈ నేపథ్యంలో శ్రీరాములు విజ యం సాధిస్తే ఎలాంటి సంకేతాలు వెళతాయి? జనార్దనరెడ్డి తన అభ్యర్థుల కోసం పనిచేస్తున్నారు.
వారు నెగ్గితే ఆ ఘనత ఆయన ఖాతాలోకే వెళుతుంది తప్ప, బీజేపీకి చెందదు.అయినా ఈ పరిణామం ద్వారా వచ్చే చిక్కులను స్వీకరించడానికే బీజేపీ సిద్ధంగా ఉందని అనిపిస్తున్నది. బాదామిలో శ్రీరాములు విజయం సాధిస్తే ఆయనకు ఆకర్షణ బళ్లారికి అవతల కూడా పనిచేస్తుందని రుజువవుతుంది. కాబట్టి ఎలాంటి నింద అయినా ఎన్నికల అంశం కాలేదని కూడా రూఢి అవుతుంది. శ్రీరాములు ఎదుగుదల పార్టీలోని సీనియర్లకు కం టగింపుగా మారే అవకాశం ఉంది. నిజానికి యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా ఆయన బెంగళూరుకు ముఖ్యమంత్రి అని, జనార్దనరెడ్డి బళ్లారిని అదుపు చేస్తారని అనేవారు. జనార్దనరెడ్డి కూడా తాను బళ్లారి ముఖ్యమంత్రి అని చెప్పుకునేవారు. మే 12న జరిగే ఎన్నికలు రెడ్డి, శ్రీరాములు భవితవ్యాన్నే కాదు, రాష్ట్రం దిశ ఏమిటో కూడా చెబుతుంది.
టీఎస్ సుధీర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment