
సిద్ధ రామయ్య, శ్రీరాములు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మరో రసవత్తర పోటీకి తెరలేచింది. అత్యంత వెనుకబడిన బాగలకోట జిల్లాలోని బాదామి నియోజకవర్గంపై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. చాముండేశ్వరి నియోజకవర్గంలో జేడీ(ఎస్) నుంచి గట్టి పోటీనెదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్దరామయ్య తనకు సేఫ్ జోన్ అని భావించిన బాదామి నుంచి ఎన్నికల బరిలోకి దిగడం, ఆయనను ఎలాగైనా ఓడించడానికి బీజేపీ బి. శ్రీరాముల్ని తమ అభ్యర్థిగా దించడంతో ఈ పోటీ ఎలాంటి మలుపు తిరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఒకప్పుడు వాతాపి అని పిలుచుకునే బాదామికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. బాదామి చాళుక్యులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని క్రీ.శ.540 నుంచి 757వరకు పరిపాలించారు. అగస్త్య మహాముని ఈ ప్రాంతంలోనే వాతాపి అనే రాక్షసుడిని మట్టుబెట్టాడని అందుకే దీనికి వాతాపి అన్న పేరు కూడా ఉందని పురాణ కథనాలు చెబుతున్నాయి.
సంకుల సమరం
బాదామిలో మొదట్నుంచి కుల రాజకీయాలకే ప్రాధాన్యం. అభ్యర్థి కులాన్ని బట్టి ఓట్లు వెయ్యడం ఇక్కడ సర్వసాధారణమని చరిత్ర చెబుతోంది. కురబ సామాజిక వర్గం ఇక్కడ అత్యంత కీలకం. మొత్తం 2.5 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో కురబలు 55 వేలు వరకు ఉన్నారు. కురబ సామాజిక వర్గానికి చెందిన సిద్దరామయ్య అందుకే బాదామిని సురక్షితంగా భావించి పోటీలోకి దిగారు. బాదామిలో ఎస్టీలు కూడా అత్యధికంగా 36 వేల మంది వరకు ఉండడంతో బీజేపీ వాల్మీకి నాయక (ఎస్టీ) వర్గానికి చెందిన శ్రీరాముల్ని పోటీకి దించింది. ఎస్టీలతో పాటు వీరశైవుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. మరోవైపు జేడీ(ఎస్) లింగాయత్ ఓటర్లను ఆకర్షించడానికి అదే సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడు హనుమంత మావిన్‌మరద అభ్యర్థిత్వాన్ని గత నవంబర్‌లోనే ప్రకటించింది.
అప్పట్నుంచి హనుమంత నియోజకవర్గం అంతా పర్యటిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి ఓటర్లలో లింగాయత్‌లు కూడా 45 వేల వరకు ఉండడంతో బాదామిలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది. అయితే ఒక వెనుకబడిన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి స్వయంగా పోటీకి దిగడం, సిద్దరామయ్య ప్రవేశపెట్టిన భాగ్య పథకాలు ఆయనను సులభంగా గెలిపిస్తాయనే అంచనాలున్నాయి. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిమ్మనకట్టిపై ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉంది. కరువు నివారణ చర్యలు చేపట్టడంలో ఆయన విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి వ్యతిరేకతను ఎదుర్కొని విజయపథంలో దూసుకుపోవడానికి సిద్దరామయ్య తన సామాజిక వర్గానికి చెందిన కురబలపైనే కోటి ఆశలు పెట్టుకున్నారు.
మొత్తం ఓటర్లు : 2.5 లక్షలు
కురబ : 55,000
లింగాయత్‌లు : 45,000
ఎస్సీలు : 17,000
ఎస్టీలు : 36,000
ముస్లింలు : 25,000
- సాక్షి నాలెడ్జ్ సెంటర్