
సాక్షి, అక్కయ్యపాలెం (విశాఖ ఉత్తర) : నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో అనుమతి లేకుండా సరోగసి పేరిట అద్దె గర్భాల అక్రమ వ్యాపారం సంచలనం రేపుతోంది. మధ్యవర్తుల చేతుల్లో మోసపోయిన మహిళ ఫిర్యాదుతో ఈసంఘటన వెలుగుచూసింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితురాలు నాగలక్ష్మి, మహిళా సంఘాలతో కలసి బుధవారం ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు కె రాములు బాధితురాలిని పరామర్శించారు. జరిగిన ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై కేజీహెచ్ సూపరిటెండెంట్ డాక్టర్ అర్జునను ఆరాతీశారు.
ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ బాధితురాలి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న పద్మజ ఆస్పత్రిపై జిల్లా కలెక్టర్ విచారణ వేయాలని, బాధ్యులైన డాక్టర్‌లపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని రాములు డిమాండ్ చేశారు. సరోగసి వివాదంపై ఐదుగురు సీనియర్ వైద్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. అందులో దళిత వైద్యుడు సభ్యుడిగా ఉండాలని అన్నారు. బాధితురాలుకి ప్రభుత్వం తక్షణమే ఎనిమిది లక్షల సాయం అందించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ముగ్గురు పిల్లలకు డిగ్రీ వరకూ సాంఘీక సంక్షేమ శాఖ ఉచిత విద్య అందించాలని అన్నారు. దర్యాప్తుకు సహకరించని అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment