ఆస్తులున్న మహిళలపై గృహహింస తక్కువ | domestic violence less on women who have assets | Sakshi
Sakshi News home page

ఆస్తులున్న మహిళలపై గృహహింస తక్కువ

Published Sat, Sep 17 2016 3:36 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

ఆస్తులున్న మహిళలపై గృహహింస తక్కువ

ఆస్తులున్న మహిళలపై గృహహింస తక్కువ

గత దశాబ్ద కాలంలో, అంటే 2005-2006 నుంచి 2015-2016 మధ్యకాలంలో భారత్‌లో మహిళా సాధికారిత గణనీయంగా పెరిగింది. అయినా ఇంకా పెరగాల్సింది ఎంతో ఉంది. మహిళల పేరిట ఆస్తిపాస్తులు పెరగడం, బ్యాంకు ఖాతాలు పెరగడం, మహిళల మీద భర్తల హింస తగ్గడం, కుటుంబ నిర్ణయాల్లో మహిళల మాట చెల్లుబాలు అవడం, రుతుస్రావం సందర్భంగా ఆరోగ్యకరమైన జాగ్రత్తలు తీసుకోవడం లాంటి అంశాలను మహిళా సాధికారతకు ప్రమాణాలుగా 'ఇండియాస్పెండ్‌' తీసుకొంది. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే సంస్థ సేకరించిన వివరాలతో ఇండియాస్పెండ్‌ సంస్థ ఈ విశ్లేషణలు చేసింది.

నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే సంస్థ మహిళల పేరిట లేదా జాయింట్‌ పేర్లపై ఉన్న భూములు, ప్లాట్లు, ఇళ్లు తదితర ఆస్తులను మొదటిసారి సర్వే చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎంతమంది మహిళలకు ఆస్తిపాస్తులున్నాయనే అంశాన్ని అంచనావేసింది. తద్వారా మరో ఆశ్చర్యకరమైన విషయం మొదటిసారి వెలుగులోకి వచ్చింది. ఆస్తిపాస్తులున్న మహిళలపై గృహహింస, ముఖ్యంగా భర్తల హింస బాగా తగ్గుతూ వచ్చింది. దేశంలోనే మణిపూర్‌ రాష్ట్రంలో మహిళల పేరిట ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉన్నాయి. అయినా అక్కడి మహిళపై భర్తల హింస ఎక్కువగా ఉంటోంది. దానికి కారణం.. ఆస్తులు లేని మహిళలపై గృహ హింస ఎక్కువగా ఉండటం ఒకటి, వెనకబడిన కులాల సంస్కృతి మరొకటి అని అంటున్నారు.

మణిపూర్‌ మహిళల్లో 69.9 శాతం మందికి ఆస్తిపాస్తులుండగా, బీహార్‌లో 58.8 శాతం మంది మహిళుల పేరిట ఆస్తిపాస్తులున్నాయి. ఏడోస్థానంలో తెలంగాణ (50.50 శాతం), ఎనిమిదో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ (44.70) రాష్ట్రాలు నిలవగా, చివరి రెండుస్థానాల్లో అండమాన్‌ నికోబార్, సిక్కిమ్‌లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆస్తిపాస్తుల విషయానికొస్తే 58.20 శాతంతో తెలంగాణ నాలుగో స్థానంలో, 45.10 శాతంతో ఆంధ్రప్రదేశ్‌ ఎనిమిదో స్థానంలో నిలిచింది.

మహిళా సాధికారతలో ముఖ్య కొలమానాల్లో ఒకటైన బ్యాంక్‌ ఖాతాలు కలిగి ఉండడంలో మహిళలు ఎంతో పురోభివృద్ధి సాధించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 35.80 కోట్ల మంది మహిళలు బ్యాంకు ఖాతాలు కలిగి ఉండగా, 82 శాతంతో గోవా మొదటి స్థానంలో, 81.8 శాతంతో అండమాన్‌ నికోబార్‌ రెండోస్థానంలో 77 శాతంతో తమిళనాడు మూడో స్థానంలో ఉన్నాయి. దశాబ్దకాలంలో ఈ అంశంలో తమిళనాడులోనే ఎక్కువ పురోభివృద్ధి కనిపిస్తోంది. 2005–6 సంవత్సరంలో బ్యాంకు ఖాతాలు కలిగిన మహిళల సంఖ్య ఆ రాష్ట్రంలో  కేవలం 15.9 శాతం కాగా, ఇప్పుడు వారి సంఖ్య 77 శాతానికి చేరుకొంది. అంటే 61.1 శాతం వృద్ధి ఒక్క దశాబ్దకాలంలోనే చోటుచేసుకుంది.

హర్యానా, కర్ణాటక, మేఘాలయ, మణిపూర్‌ రాష్ట్రాల్లో గృహహింస పెరగ్గా, మిగతా రాష్ట్రాలో గృహహింస తగ్గింది. అన్ని రాష్ట్రాలకన్నా త్రిపురలో గృహహింస ఎక్కువగా తగ్గింది. 44.1 శాతం నుంచి 27.9 శాతానికి తగ్గగా, మేఘాలయలో 12.8 శాతం నుంచి 28.7 శాతానికి గృహహింస పెరిగింది. మొత్తం దేశంలో 29 రాష్ట్రాలకుగాను 14 రాష్ట్రాలను, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల గణాంకాలను మాత్రమే 'ఇండియాస్పెండ్‌' సంస్థ విశ్లేషించింది. మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమాచారాన్ని 'నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే' ఇంకా విడుదల చేయాల్సి ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement