
ఆపదలో ‘అతివ’.!
మహిళలకు కరువైన రక్షణ
చట్టాలున్నా భయపడని మృగాళ్లు
ఫలితమివ్వని పోలీసుల చర్యలు
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా.. నింగి నుంచి అంతరిక్షం వరకూ మహిళ ప్రస్థానం సాగుతున్నా..ఇంకా మహిళ భయం భయంగానే బతుకుతోంది. నిజమైన స్వేచ్ఛ కోసం సింహాల బోనులో జింకపిల్లలా వెతుకుతూనే ఉంది. విశాఖ వంటి ఆధునిక నగరంలో ఆటవిక సంస్కృతికి బలైపోతూనే ఉంది. నిర్భయ, గృహ హింస వంటి చట్టాలు ఎన్ని వచ్చినా మృగాళ్ల పైశాచికాన్ని అడ్డుకోలేకపోతున్నాయి. జిల్లాలో గడిచిన మూడేళ్లలోనూ, తాజాగా జరుగుతున్న నేరాలను చూస్తే మహిళలు ఎంతటి అభద్రతా సమాజంలో బతుకుతున్నారో అర్ధమవుతోంది. సాక్షి, విశాఖపట్నం
అడుగుడుగునా మృగాళ్లే
ఈ ఏడాది ఆరంభం నుంచే మహిళలపై అఘాయిత్యాలు పెచ్చుమీరాయి. మొదటి వారంలోనే పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్ధిని తనను ఓ వ్యక్తి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేసి రెండ తేదీన రిమాండ్‌కు పంపించారు. చేపలుప్పాడలో దళిత బాలికపై, ఎన్‌ఏడీ కొత్తరోడ్డులో, కైలాసపురంలో మైనర్ బాలికపై అత్యాచారం, మల్కాపురం, ఎంవీపీల్లో పెళ్లిపేరుతో మోసం, గాజువాకలో ఉద్యోగినిపై లైంగిక వేధింపులు ఇలా ఒకటి కాదు రెండు కాదు నిన్నటి సాఫ్ట్‌వేర్ యువతిపై అత్యాచారం వరకూ మహిళలపై అనేక రకాలుగా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసుల దృష్టికి వచ్చినవే వందల్లో ఉంటే, పరువు కోసం, సమాజానికి భయపడి తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకోలేక లోలోనే కుమిలిపోతున్న అభాగినులు ఎందరో లెక్కే లేదు.
చట్టాలు, సాఫ్ట్‌వేర్లు ఎన్నున్నా
ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా మహిళల భద్రతపై వెల్లువెత్తిన నిదరసల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకువచ్చింది. మహిళపై ఎవరైనా లైంగిక దాడులకు తెగబడితే కఠినంగా శిక్షించేలా చట్టం చేసింది. అంతకు ముందే గృహ హింస చట్టం అమలులో ఉంది. ఈ రెండు చట్టాలతో పాటు ఎస్సీ,ఎస్టీ అల్రాసిటీ చట్టం కూడా మహిళలకు రక్షణగా ఉపయోగపడుతోంది. ఇవి కాకుండా మహిళలు, యువతులు తమను తాము రక్షించుకునేలా మొబైల్ ఫోన్ల ‘యాప్స్’ అందుబాటులోకి వచ్చాయి. విశాఖ పోలీస్ కమిషనర్‌గా అమిత్‌గార్గ్ బాధ్యతలు చేపట్టగానే రాష్ట్ర హోమ్ మంత్రి చినరాజప్ప చేత ‘ఐ క్లిక్’ పరికరాన్ని, ‘అభయం’ సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభింపజేశారు. వీటి నిర్వహణ కోసం మహిళా ఎస్సై నేతృత్వంలో ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించి 24గంటలూ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు.
కేసులు నమోదవుతున్నా
ఇప్పటి వరకూ ఐ క్లిక్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు 28 కేసులు నమోదు చేశారు. అభయం సాఫ్ట్ వేర్‌ను యువతులు తమ మొబైల్స్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ 1500 మంది ఆ విధంగా అభయంను తమ వద్ద ఉంచుకున్నారు. 100 మంది ఇప్పటికే ఫిర్యాదు చేశారు. వాటి ఆధారంగా 18 కేసులు నమోదయ్యాయి. అయినా నగరంలో మహిళలపై నేరాలు తగ్గడం లేదు. మృగాళ్లు కనీసం భయపడటం లేదు. మరోవైపు ఈ చట్టాలను, సదుపాయాలను మహిళలు దుర్వినియోగం చేస్తున్నారనే వారూ ఉన్నారు.
‘అభయం’ ద్వారా వచ్చిన వంద ఫిర్యాదుల్లో కొన్ని కేసు వరకూ రాకపోవడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అవకాశాలను దుర్వినియోగం చేస్తున్న వారి వల్ల నిజమైన బాధితులకు కూడా కొన్ని సమయాల్లో న్యాయం జరగడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. వాటిని సక్రమంగా వినియోగించాలి. అప్పుడే మగువకు రక్షణ, మృగాడికి భయం ఉంటుంది.