అయ్యయ్యో.. ఎంత కష్టం! | Pregnant Woman Kicked By In-laws For Dowry In Visakhapatnam | Sakshi
Sakshi News home page

అయ్యయ్యో.. ఎంత కష్టం!

Published Thu, Apr 18 2019 9:48 AM | Last Updated on Thu, Apr 18 2019 9:59 AM

Pregnant Woman Kicked By In-laws For Dowry In Visakhapatnam - Sakshi

భర్త దామోదర్‌తో రాజేశ్వరి (ఫైల్‌)

ఎన్‌ఏడీ జంక్షన్‌ (విశాఖ పశ్చిమ)/పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): ఆరు నెలల గర్భిణి.. కష్టం తెలియకుండా చేదోడు వాదోడుగా ఉంటూ పండంటి బిడ్డ కోసం ఎదురు చూడాల్సిన భర్త, అత్తే ఆమె పాలిట శాపంగా మారారు.. కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి డబ్బు.. డబ్బు.. అంటూ కట్న పిశాచులై పీడించుకు తిన్నారు.. రెండేళ్లలో మూడు అబార్షన్లు.. మళ్లీ ఇప్పుడు గర్భం.. ఆరో నెల.. వారి బాధలు భరించలేక దూరంగా ఉంటున్నా కూడా వదల్లేదు.. వైద్యం చేయిస్తామంటూ కారులో ఎక్కించుకుని వెళ్లి పైశాచికంగా దాడి చేశారు. కడుపులో తమ వారసత్వాన్ని మోస్తోందన్న స్పృహ లేకుండా ఒంటిపై వాతలు తేలేలా కొట్టారు.. వారి బారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించి తన కష్టాలు ఏకరువు పెట్టిన ఓ అభాగ్యురాలి దీన గాధ ఇది..  

ఆదర్శ వివాహం అంటూ వచ్చారు..
ఆమె పేరు రాజేశ్వరి. ఈమెకు ఓ అన్న. అతని పేరు చంద్రశేఖర్‌. వీరికి తల్లిదండ్రులెవరో తెలియదు. వీరికి మూడు, ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు పోలీసులు డాబా గార్డెన్స్‌ ప్రేమ సమాజం (అనాథ శరణాలయం)లో చేర్పించారు. ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం వరకు రాజేశ్వరి వారి సహాయంతోనే చదువుకుంది. యుక్త వయసు వచ్చాక ప్రేమ సమాజంలో ఉండటానికి నిబంధనలు ఒప్పుకోకపోవడంతో బ్యూటీషియన్‌ కోర్సు నేర్చుకుని విశాఖలోని ఎన్‌ఏడీ కొత్తరోడ్డులో సొంతంగా బ్యూటీపార్లర్‌ పెట్టుకుంది. రాజేశ్వరి ప్రేమ సమాజంలో ఉన్నప్పుడు.. అక్కడే ఉన్న వృద్ధాశ్రమంలో ఉంటున్న తన అమ్మమ్మను చూసేందుకు పురుషోత్తపురం ప్రాంతానికి చెందిన దామోదర్, అతడి తల్లి లలిత తరచూ వచ్చి వెళుతుండేవారు. ఆ క్రమంలో వారు రాజేశ్వరితో పరిచయం పెంచుకున్నారు. రాజేశ్వరిని తన కుమారుడు దామోదర్‌ పెళ్లి చేసుకుంటాడని లలిత.. రాజేశ్వరి అన్న చంద్రశేఖర్‌తో చెప్పింది. కట్నకానుకలు ఇచ్చుకోలేమని చెప్పిన చంద్రశేఖర్‌తో అటువంటివేం అక్కర్లేదని, ఆదర్శ వివాహం చేసుకుంటామని.. అన్నీ తామే చూసుకుంటామని చెప్పి వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి వారం రోజులు ఉందనగా.. తమకు డబ్బు సర్దుబాటు కాలేదని, ఎలాగైనా సర్దుబాటు చేయాలని దామోదర్‌ తల్లి లలిత కోరడంతో రాజేశ్వరి, చంద్రశేఖర్‌లు రూ.1.20 లక్షలు ఇచ్చారు.

దామోదర్‌కు అంతకు ముందే పెళ్లి..
వివాహం జరిగాక కొంతకాలం పాటు రాజేశ్వరిని బాగా చూసుకున్నారు. ఆ తర్వాత అత్త, భర్త అదనపు కట్నం కోసం నరకం చూపడం మొదలెట్టారు. ఇదే క్రమంలో ఆమె నడుపుతున్న బ్యూటీ పార్లర్, ఐదు తులాల బంగారం గొలుసును అమ్మించి దామోదర్‌ కారు కొనుక్కున్నాడు. దామోదర్‌కు స్వాతి అనే యువతితో ఇదివరకే వివాహం జరిగినట్లు తెలుసుకున్న రాజేశ్వరి.. భర్తను నిలదీసింది. దీంతో వారు మరింతగా హింసించడం మొదలెట్టారు. వివాహమైన రెండేళ్లలో మూడు సార్లు అబార్షన్‌ చేయించారు. ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి అయిన రాజేశ్వరి.. అత్త, భర్త పెడుతున్న హింసలకు తట్టుకోలేక అత్తవారిల్లు వదిలి ఎన్‌ఏడీ కూడలిలో ఒంటిరిగా ఉంటోంది.

ఈ క్రమంలో ఆస్పత్రికి తీసుకెళ్తానంటూ మంగళవారం భర్త ఆమె వద్దకు వచ్చి కారులో ఎక్కించాడు. అప్పటికే కారులో ఉన్న తల్లి లలితతో కలిసి విపరీతంగా కొట్టుకుంటూ పురుషోత్తపురం వరకూ తీసుకెళ్లారు. అక్కడ కారు నుంచి తప్పించుకున్న రాజేశ్వరి.. పెందుర్తి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని భర్త, అత్తలపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేశ్వరి పరిస్థితిని గమనించి కేజీహెచ్‌కు వెళ్లాలని సూచించడంతో ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంలో చేరి చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎయిర్‌ పోర్టు జోన్‌ సీఐ జె.శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement