ప్రతీకాత్మకచిత్రం
ధర్మేచ..అర్థేచ..కామేచ..మోక్షేచ..అహం ఏవం నాతిచరామి..అని పెళ్లి ప్రమాణం చేసి ఏడు జన్మలు ఏకమయ్యే ఏడడుగుల బంధంలో రెండు మనసుల గుండె చప్పుడు ఏకమైతే వివాహ బంధం సంతోషంగా సాఫీగా సాగిపోతుంది. వివాహ బంధం అందమైన పుస్తకం లాంటిది. ఏదైనా జరిగే పొరపాటు పుస్తకంలో ఒక పేజీ మాత్రమే. అటువంటప్పుడు పుస్తకాన్ని సవరించుకోవాలి. పొరపాటు ఉందని మొత్తం పుస్తకాన్నే చించేయకూడదు. జీవితాంతం తోడుంటానని అగి్నసాక్షిగా తాళిబంధంతో ఒక్కటైన దంపతులు ముచ్చటగా మూడేళ్లయినా కలిసి ఉండకుండానే విడాకులు తీసుకుంటున్నారు. ప్రేమ, ఆప్యాయతలతో ఆనందంగా ఉండాల్సిన వారు అపోహలు, అనుమనాలతో విడిపోతూ తాళి బంధాన్ని ఎగతాళి చేస్తున్నారు.
విజయనగరం: నీవే నా ప్రాణం, నీవు లేకపోతే చచ్చిపోతానంటూ పెళ్లి అయిన తొలినాళ్లలో ఎంతో ప్రేమ చూపే వారు..తర్వాత అన్నీ మరిచిపోయి ఒకరిని ఒకరు చీదరించుకుంటూ.. కోపగించుకుంటూ..చివరికి విడాకుల వరకు వెళ్తున్నారు. స్వల్ప కారణాలతో కొందరు కోర్టు మెట్లు ఎక్కుతుంటే, అవగాహన లేక కొందరు భార్యాభర్తలు విడిపోతున్నారు. గృహహింస విభాగం, పోలీసుల కౌన్సెలింగ్‌తో మరి కొందరు సర్దుకుపోతున్నారు. మరి కొందరైతే మూర్ఖంగా వ్యవహరిస్తూ భవిష్యత్తు అంధకారం చేసుకోవడంతో పాటు పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ, అప్యాయతలను దూరం చేస్తున్నారు.
ఎన్ని కౌన్సెలింగ్‌లు ఇచ్చినా ఫలితం శూన్యం
విభేదాలు వచ్చిన దంపతులను కలపడానికి ఎన్ని కౌన్సెలింగ్‌లు ఇచ్చినా ఫలితం లేకుండా పోతోంది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలు ఏర్పడడం వల్ల సంప్రదాయాలు, సత్ససంబంధాల గురించి తెలియడం లేదు. ఒకరి నిర్ణయాలను ఒకరు గౌరవించుకోకపోవడంతో పాటు కొందరు మొండిగా వ్యవహరిస్తున్న కారణంగా భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు.
నేను చెప్పిందే వినాలనే ధోరణిలో అధికంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వస్తున్నాయి. వారికి సర్దిచెప్పేందుకు పెద్దలు లేకపోవడం, ఒక వేళ ఉన్నా వారి దృష్టికి సమస్యలు తీసుకు వెళ్లేందుకు భార్యాభర్తలు ఇష్టపడని కారణంగా రోజురోజుకు విడాకుల పెరుగుతూ వస్తున్నాయి. చిన్న చిన్న కారణాలతో విడిపోవాలనుకునే భార్యాభర్తలకు పోలీసులు, గృహాహింస విభాగం కౌన్సిలర్లు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అందులో కొంతమంది మాత్రమే కలిసి జీవించేందుకు ఇష్టపడుతున్నారు. మరి కొంతమంది విడాకులు తీసుకోవడంకోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
వేరు కాపురాలపై యువతుల ఆసక్తి
ఉమ్మడి కుటుంబంలో కలిసి జీవించేందుకుఅధికశాతం మంది యువతులు సుముఖత చూపడం లేదు. అదేమని అడిగితే అత్తమామాలు, అడపడుచుల దెప్పి పొడుపులు ఉంటాయని చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని అలోచిస్తున్నారు. ఉమ్మడి కుటుంబంలో కుమార్తె హాయిగా జీవించగలదనే భరోసా కల్పించలేకపోతున్నారు.
ఎవరికి వారే మొండి పట్టు
గతంలో సంప్రదాయలను గౌరవిస్తూ ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇస్తూ పిల్లలకు ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా నిలిచేవారు. ఏవైనా సమస్యలు వస్తే ఉమ్మడి కుటుంబాలు కావడంతో ఇద్దరికీ సర్దిచెప్పి వారి మధ్య మనస్పర్ధలను తొలగించడానికి కుటుంబ పెద్దలు ప్రయతి్నంచేవారు. అప్పటికీ మాట వినకపోతే ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి భార్యభర్తలను ఒక్కటి చేసేవారు. ప్రస్తుతం వివాహ బంధం అందుకు విరుద్ధంగా ఉంది.
గృహహింసకు వచ్చిన ఫిర్యాదుల వివరాలు
2006వ సంవత్సరంలో గృహహింస విభాగాన్ని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ కార్యాలయంలో ప్రారంభించారు. అప్పటి నుంచి ఈఏడాది ఆగస్టు నెలాఖరు వరకు జిల్లాలో 858 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో 150 మంది కౌన్సెలింగ్‌తో రాజీపడ్డారు. 128 మంది ఫిర్యాదులు ఉపసంహరించుకున్నారు. 580 ఫిర్యాదులు కోర్టులో కేసు ఫైల్ అయ్యాయి. వాటిలో 74 కేసులు కోర్టుకు హాజరైన తర్వాత రాజీ అయ్యాయి. మరో 93 కేసులు కోర్టులో విత్‌డ్రా అయ్యాయి. 107 కేసులు డిస్మిస్ అయ్యాయి. 72 కేసులు కోర్టులో పరిష్కారమయ్యాయి. 122 మంది విడాకులు తీసుకున్నారు. 78 మంది మనోవర్తి తీసుకుంటున్నారు.
సర్దుకుపోయే గుణం అవసరం
సర్దుకుపోయే గుణం భార్యాభర్తలు అలవర్చుకున్నప్పుడు కాపురం సాఫీగా సాగిపోతుంది. భార్యాభర్తల మధ్య నెలకొన్న నెలకొన్న సల్ప వివాదాలకు సర్దిచెప్పేవారు ఆయా కుటుంబాల్లో నేడు ఉండడం లేదు. ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
జి.మాధవి, లీగల్ కౌన్సిలర్, గృహహింస విభాగం
Comments
Please login to add a commentAdd a comment