అతివలకు అండ
విజయనగరం కలెక్టరేట్‌లోని జిల్లా స్త్రీ శిశు అభివృద్ధి సంస్థ(ఐసీడీఎస్) కార్యాలయంలో గృహహింస కార్యాలయం ఉంది.
వివాహం... అసలైన జీవితానికి పునాది. మహిళలకు కొత్త జీవితానికి నాంది. అయితే పెళ్లయిన వెంటనే ఆరళ్లు మొదలైతే, వేధింపులు ఎక్కువైతే... అత్త నుంచో భర్త నుంచో ఊహించని స్పందనలు కళ్లకు కనబడితే ఆ అతివ జీవితం నరకప్రాయమవుతుంది. ఇలాంటి వారిని ఆదుకుని, వారి జీవితాన్ని చక్కదిద్దేందుకు ప్రవేశపెట్టిందే గృహహింస చట్టం. మహిళలకు అండగా నిలుస్తూ, వారిపై వేధింపులను నిలువరిస్తోందీ చట్టం. వేధింపులకు గురవుతున్నవారంతా ఈ చట్టాన్ని వినియోగించుకోవాలని పలువురు న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.
విజయనగరం ఫోర్ట్: అత్తింటి వారి వేధింపులు భరించలేక ఇటీవల కాలంలో మహిళలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. భర్త వేధించాడనో, అత్త వేధిస్తోందనో మనస్తాపంతో చాలా మంది వివాహితలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీని వల్ల పసివారు అనాథలుగా మారుతున్నారు. ఇలాంటి వారి కోసమే 2005లో ప్రభుత్వం గృహహింస చట్టాన్ని ప్రవేశ పెట్టిం ది. ఈ చట్టం మహిళలకు కొండంత అం డగా నిలుస్తుంది. భర్తతోగానీ, అత్తతోగా నీ, ఇతర కుటుంబ సభ్యులతో ఊహించని పరిణామాలు ఎదురైతే వారు నేరుగా గృహిహింస చట్టం సి బ్బందికి ఫిర్యాదు చేస్తే ఉచితంగా న్యాయ సహా యాన్ని అందిస్తారు.
గృహహింస అంటే...
శారీరకంగా గానీ, మానసికంగా గానీ, మాటలు ద్వారా ఉద్వేగపరిచినా గృహహింస కిందకు వస్తుంది. ఆర్థిక, లైంగిక హింసలు, బెదిరించడం, భయపెట్టడం, దౌర్జన్యానికి పాల్పడడం, ఆరోగ్యాన్ని కుంటుపరిచే విధంగా వ్యవహరించే చర్యలన్నీ గృహహింస కిందకే వస్తాయి. ఈ చట్టం ప్రకారం బాధితురాలు ప్రతివాది మధ్య సంబంధం భార్యభర్తల సంబంధమే కానవసరం లేదు. పుట్టుక ద్వారా లేదా పెళ్లి ద్వారా, దత్తర ద్వారా కలిసి ఉంటున్న వారైనా, ఒకే ఇంట్లో ప్రస్తుతం కానీ, గతంలో కానీ కలిసి నివసిస్తూ ఉన్న స్త్రీ పురుషులు ఈ చట్టపరిధిలోకి వస్తారు. గృహహింసకు గురైన మహిళ ఫిర్యాదును నేరుగా గానీ, ఎవరితోనైనా హింస జరుగుతుందని, జరగబోతుందని రక్షణ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు.
రక్షణ అధికారులు...
గృహహింసకు గురవుతున్న మహిళలకు రక్షణను అందించేందుకు ముగ్గురు జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. వీరిలో ఒకరు విజయనగరం ఆర్‌డీఓ ఫోన్ నంబరు 08922-226888, పార్వతీపురం ఆర్‌డీఓ 08963-261006, ఐసీడీఎస్ పీడీ, విజయనగరం ఫోన్ నంబరు- 9440814584లు ఉన్నారు.
మహిళలకు ఆశ్రయం అందించే సంస్థల వివరాలు
గృహహింసకు గురైన మహిళలకు ఆశ్ర యం కల్పించే సంస్థలు రెండు ఉన్నాయి. వీటిలో ఒకటి స్వధార్ ఆశ్రమం కాగా రెండోది దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ శిశు వికాశ కేంద్రాలు ఉన్నాయి. గృహహింస కార్యాలయంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ఒక లీగల్ కౌన్సిలర్, ఒక సోషల్ కౌన్సిలర్, ఇద్దరు హోంగార్డులు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నారు.
కౌన్సిలర్ల విధి...
గృహహింసకు గురవుతున్న మహిళల నుంచి ఫిర్యాదు స్వీకరించి వాటిని రక్షణ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడం. భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చిన మీదట రాజీ కుదరకపోతే రక్షణ అధికారి సమక్షంలో మరో సారి కౌన్సిలింగ్ ఇప్పించడం. అప్పటికీ రాజీ కుదరకపోతే కోర్టులో కేసు నమోదు చేయడం వీరి విధులు.
రక్షణ అధికారి బాధ్యతలు
బాధితులకు చట్టపరమైన సాయం, ఉచితన్యా య సేవలు, ఆర్థిక సహాయం, పిల్లల సంరక్షణ అందించడం, ఆశ్రయం అందించే సంస్థలు, వైద్య సహాయం గురించి సమాచారం అందించడం వంటివి రక్షణ అధికారులు చేస్తారు. అలాగే... కేసు విచారణ తేదీ తెలిపే నోటీసులను ప్రతివాదికి అందజేస్తారు.కేసు నమోదు చేసిన 60 రోజుల్లో తుదితీర్పు వినిపించాలి.