బుద్ధి, జ్ఞానం ఉందా?
ఐసీడీఎస్ అధికారులపై తీవ్రస్థాయిలో
మండిపడిన ప్రత్యేక కమిషనర్ చక్రవర్తి
విజయనగరం : ‘బుద్ధి, జ్ఞానం ఉందా? కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చారు. కదలకుండా కూర్చొంటారా? ఇంటి పక్కనే ఉద్యోగం కావాలి.. ఉద్యోగం వచ్చాక పని చేయకుండా జీతం ఇవ్వాలా?’ అంటూ ఐసీడీఎస్ అధికారులపై రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్ కేఆర్‌బీహెచ్‌ఎన్‌ఎస్ చక్రవర్తి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక విజయ నగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం ఉత్తరాంధ్రలోని ఐసీడీఎస్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓలు వారి పరిధిలో ఉన్న అన్ని కేంద్రాలనూ పర్యవేక్షించానని నిల్చొని ధైర్యంగా చెప్పగలరా? అని ప్రశ్నించారు. దీంతో 19 మంది సీడీపీఓలు నిల్చొన్నారు. ఉత్తరాంధ్రలో 60 మంది సీడీపీఓలు ఉన్నారని, ఇందులో 19 మంది మాత్రమే లేచారంటే.. మిగిలిన 41 మంది పని చేయనట్లేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో ఎంతమంది ఏసీడీపీఓలుగా ఉద్యోగాల్లో చేరారని అడగగా.. 14 మంది నిల్చొన్నారు. ‘మీరైనా కేంద్రాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షించారా?’ అని కమిషనర్ ప్రశ్నించగా.. ఏ ఒక్కరూ పర్యవేక్షించామని చెప్పలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన.. సీడీపీఓలు, ఏసీడీపీఓలు కేంద్రాలను పర్యవేక్షించకుండా ఉంటే పీడీలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. విధులు సక్రమంగా నిర్వహించకుంటే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ఇచ్చే పౌష్టికాహారం పక్కదారి పడకూడదనే ఉద్దేశంతో.. గత ఏడాది డిసెంబర్‌లో ఈ-పాస్ విధానాన్ని ప్రవేశ పెట్టామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏర్పడిన ఖాళీలను ప్రతి నెలా గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, ఆయాల అధార్ నంబర్లు సేకరించాలని ఆదేశించారు. మైదాన ప్రాంతంలో ఒక రేషన్ షాపు పరిధిలో ఒకట్రెండు అంగన్‌వాడీ కేంద్రాలు మాత్రమే ఉండాలన్నారు. గిరిజన ప్రాం తంలో ఐదు కేంద్రాలకు మించి ఉండరాదని చెప్పారు. కేంద్రాలకు రేషన్ షా పులు దగ్గరలో ఉండేటట్లు చూసుకోవాలని తెలిపారు. పూర్వ ప్రాథమిక విద్య పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ జేడీ శివపార్వతి, ఆర్‌జేడీ కామేశ్వరమ్మ, విజయనగరం పీడీ ఏఈ రాబర్ట్స్, విశాఖపట్నం పీడీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.