బతికొచ్చింది | Another affliction that slave | Sakshi
Sakshi News home page

బతికొచ్చింది

Published Wed, Feb 7 2018 12:00 AM | Last Updated on Wed, Feb 7 2018 12:29 PM

Another affliction that slave - Sakshi

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో పద్మ పాండే 

హైదరాబాద్‌.. శంషాబాద్‌  ఎయిర్‌పోర్ట్‌.. ఇంటర్నేషనల్‌ అరైవల్స్‌. గుంపులు గుంపులుగా జనం.. ట్రాలీలు ట్రాలీలుగా లగేజ్‌తో బయటకు వస్తున్నారు. వాళ్లలో ఓ నడివయసు స్త్రీ కూడా ఉంది. ఆకుపచ్చ రంగు సల్వార్‌ కమీజ్‌తో బేలగా ట్రాలీని తోసుకుంటూ వచ్చింది. ఆ మొహంలో అలసట కనిపిస్తోంది. ఇంతలో ఆమెను చేరుకోవాల్సిన వాళ్లు చేరుకున్నారు. అక్కున చేర్చుకున్నారు. నీళ్ల సీసా అందివ్వగానే ఒక్క గుక్కన ఆ నీళ్లను తాగేసింది.  ఆ ఒక్క గుక్కతో.. గొంతు దప్పికే కాదు, సొంతగడ్డను చేరాలనే పద్మ ఏడేళ్ల దాహమూ తీరినట్టయింది. ‘‘టిఫిన్‌ ఏం తింటారు?’’ అంటే.. ‘‘మనసు, కడుపు నిండినట్టయింది. ఏమొద్దు’’ అంది కళ్లనిండా నీళ్లతో. ‘‘కాస్త ఎంగిలి పడండి’’ అని బలవంతం చేస్తే.. ‘‘ఏడేళ్ల నుంచి ఇడ్లీ తినలేదు. అది ఇప్పించండి’’ అంది మొహమాటంగా.  ఎప్పుడో.. బిడ్డకు ఏడేళ్ల వయసున్నప్పుడు  బతుకుతెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లింది పద్మ. దాదాపు ఏడేళ్లు ‘చెర’లో ఉంది. బిడ్డను గుండెకు హత్తుకొని తనివి తీరా ఏడ్వాలి. అదే ఇప్పుడు ఆమె తొందర.

నాలుగు రాళ్ల కోసం ఎడారికి
బల్ల పద్మ పాండే స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మండలం, బల్లపేట. ఒక్కతే కూతురు. పెయింటర్‌ అయిన శ్రీనివాస్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. ఓ కూతురు పుట్టింది. శ్రీనివాస్‌కు  ఊళ్లో పెద్దగా పనిలేదు. ‘దుబాయ్‌లో పని ఉంది. రూపాయల్లో కంటే దీరమ్స్‌లో బాగా సంపాదించొచ్చు’ అని బల్లపేటలో అప్పటికే గల్ఫ్‌లో ఉంటున్నవాళ్లు చెప్పారు. అతడికి ఆశ కలిగింది. దుబాయ్‌ వెళ్లాడు. అలాగే పద్మ.   అంతకుముందే ఆ ఊరి నుంచి డొమెస్టిక్‌ వర్కర్స్‌గా (పనిమనుషులుగా) ఎడారిబాట పట్టిన వాళ్లు అక్కడ సంపాదన బాగా ఉంటుందని ఆమెకు చెప్పారు. భూమి కొనుక్కుందాం.. ఇల్లు కట్టుకుందాం.. బిడ్డను బాగా చదివిద్దాం.. అనుకున్నారు పద్మ, శ్రీనివాస్‌లు. భార్యను బెహ్రెయిన్‌ వెళ్లమని చెప్పాడు భర్త. వెళ్లి రెండేళ్లు ఉండి వచ్చింది. కొంచెం సంపాదించుకుంది. ఓ ఆర్నెల్లకు దుబాయ్‌కి అవకాశం వస్తే దుబాయ్‌కీ వెళ్లింది. కాని బెహ్రెయిన్‌లా లేదు.. అక్కడ తను ఉంటున్న షేక్‌ ఇంట్లో పరిస్థితి. హింసపెట్టేవాళ్లు. ఉండలేక ఇండియా వచ్చేసింది. మళ్లీ ఆర్నెల్లకి కువైట్‌కు వెళ్లే చాన్స్‌ దొరికింది. వెళ్లింది. 

వేధింపులు సాధింపులే జీతం!
కువైట్‌లో ఓ బాబా (షేక్‌) ఇంట్లో పనిమనిషిగా కొలువు. బాబా చాలా మంచివాడు. ఏడాదిన్నర పాటు జీతం బాగానే ఇచ్చాడు. బాగా చూసుకునేవాడు కూడా. కాని కాలం అలా సాగలేదు. బాబా చనిపోయాడు. పద్మ పరిస్థితి తలకిందులైంది. నిజానికి ఆమెకు రెండేళ్లే ఆ ఇంట్లో వర్క్‌ పర్మిట్‌ వీసా ఉంది. బాబా చనిపోయేనాటికి రెండేళ్లు పూర్తికావొచ్చాయి. ఆమెను తిరిగి ఇండియాకు పంపించేయాలి. అయితే బాబా భార్య అలా చేయలేదు. పద్మను పంపించకపోగా ఆమెను వేధించడం మొదలుపెట్టింది. జీతం ఇవ్వడం మానేసింది. రోజుకు ఒక్కపూటే తిండి. ఇండియా నుంచి తనవాళ్లు ఫోన్‌ చేసినా.. తనకు ఫోన్‌ చేయాలనిపించినా ఫోన్‌ ఇచ్చేది కాదు. యజమాను రాలు ఇంకో పెళ్లి చేసుకుంది. ఆమె పెట్టే టార్చర్‌కు కొత్తగా వచ్చిన షేక్, యజమానురాలి కొడుకూ తోడయ్యారు. కొట్టేవాళ్లు. తిట్టేవాళ్లు. ఇంట్లోంచి బయటకు వెళ్లనీయకుండా కాపలా కాసేవారు. కూరలు కోసే చాకును వేడి చేసి ఒంటి మీద వాతలు పెట్టేవాళ్లు. అలా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా అయిదేళ్లు గడిపింది. కూతురుని, భర్తను, తన తల్లిదండ్రులు, అత్తమామలను తలచుకుంటూ ఏడ్చేది. పద్మ మీద బెంగతో వాళ్ల నాన్న మంచం పట్టి కన్నుమూశాడు. ఈ విషయమూ ఆమెకు తెలియదు. 

తాళం చెవి బతికించింది!
ఓ రోజు బట్టలు ఆరేసి వచ్చిన పద్మకు  టీపాయ్‌ మీద బయటి గుమ్మం తాళంచెవి పడేసి తన గదిలోకి వెళ్తున్న యజమానురాలి కూతురు కనిపించింది. ఆ అమ్మాయి గది తలుపేసుకోగానే.. చివికిపోయిన నాలుగు జతల దుస్తులను తన బ్యాగ్‌లో కుక్కేసుకొని ఆ తాళంచెవితో గుమ్మం తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తింది. అప్పటికే ఒంటినిండా గాయాలతో, నీరసంగా ఉంది. ఏ దారో తెలియదు. ఎక్కడికి చేరుకోవాలో అంతకన్నా తెలియదు. పరిగెత్తి పరిగెత్తి అలసి సొమ్మసిల్లిపోయింది ఒకచోట. దారినపోయే వాళ్లు తట్టిలేపి పలకరించారు. అక్కడికి వచ్చిన ఓ కువైట్‌ మహిళ  ఆమె గురించి తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులకు తన వివరాలు.. యజమాని వేధింపులు అన్నీ చెప్పింది. వాళ్లు కంప్లయింట్‌ రాసుకున్నారు. తన వాళ్ల నంబర్‌ ఇచ్చింది. మాట్లాడారు. పద్మను చికిత్స కోసం హాస్పిటల్‌కు పంపారు. ఆ తర్వాత అక్కడున్న ప్రవాసీ భారతీయ సామాజిక కార్యకర్తల సహాయమూ పద్మకు అందింది. వాళ్లందరి సహకారంతోనే చివరికి ఇలా ఇండియాకు వచ్చింది. తన వాళ్లను కలుసుకుంది. 

దూరపు ఎడారి ఎండమావులతో భ్రమింప చేస్తుంది. కాసుల పంట పండుతుందని ఆశ పుట్టిస్తుంది. వెళితే ఒయాసిస్సు జాడా కూడా కనపడనివ్వక దాహంతో గొంతు పిడుచకట్టుకు పోయేలా తిప్పుతుంది. ఉన్న సొమ్ము ఏజెంట్‌ చేతిలో పెట్టి సొమ్మసిల్లి ఇల్లు చేరుతారు. కొండంత పేరుకుపోయిన అప్పుల భయంతో మళ్లీ పాత భ్రమతో ఇంకో ఎడారి దేశం పయనం అవుతారు. ఇది నిరంతర ప్రక్రియ. గల్ఫ్‌ గల్లా గలగలలు వలస బాట పొమ్మని పోరుతుంటాయి. మంచిదే. కానీ ఆచితూచి.. మంచిచెడులు ఆలోచించి.. అన్నీ తెలుసుకుని వెళితేనే లాభమూ.. క్షేమమూ! 

మళ్లీ ఇక ఏ దేశానికీ పోను!
నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. నా మీద బెంగతో మానాన్న చనిపోయాడు.  చివరిచూపు కాదు కదా, చివరి మాట మాట్లాడే భాగ్యానిక్కూడా నేను నోచుకోలేదు. ఏడేళ్లు బందిఖానాలో ఉన్నా. నా పని నచ్చకపోతే నన్ను పంపించేయండి అని మొత్తుకున్నా. అయినా పంపలేదు. జీతం ఇవ్వలేదు. నా వాళ్లకు దూరమయ్యా. ఆరోగ్యం పాడైంది. ఇక ఎప్పుడూ ఏ దేశానికీ వెళ్లను. నా కూతురు, అమ్మ, మా అత్తమామలు, నా భర్త.. ఇదే నాలోకం. వాళ్లను చూసుకుంటూ ఉంటా. పనిమనుషులుగా గల్ఫ్‌కి వెళ్లేవాళ్లు ముందే ఆ చట్టాలు, ఆ పద్ధతులు, ఆ భాష పట్ల అవగాహన కల్పించుకోవాలి. అన్నీ తెలుసుకునే వెళ్లాలి.
– బల్ల పద్మ పాండే
– సరస్వతి ర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement