విజయనగరం ఫోర్ట్: ఆశల పల్లకిలో మెట్టినింటికి చేరుకుంటున్నారు. అత్తింటి వేధింపుల్ని తట్టుకోలేక పోతున్నారు. అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్నారు. అలాంటి అభాగినుల చేతికి పాశుపతాస్త్రం చేరింది. అత్తింటి వేధింపులను అరికడుతోంది. అదే గృహ హింస చట్టం–2005. ఈ చట్టం వచ్చాక ఎందరో బాధితులకు న్యాయం జరిగింది. అత్తింటి వేధింపులు భరించలేక ఇటీవల కాలంలో మహిళలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. భర్త, అత్త వేధిస్తున్నారన్న మనస్తాపంతో చాలా మంది వివాహితలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్నెం పున్నెం తెలియని వారి పిల్లలు దిక్కులేని వారవుతున్నారు.
ఉచిత న్యాయ సహాయం
వేధింపుల నుంచి రక్షణ కోసం ప్రభుత్వం 2005లో గృహహింస చట్టాన్ని తీసుకొచ్చింది. భర్త, అత్త లేదా ఇతర కుటుంబ సభ్యుల వేధింపులు గురయ్యేవారు నేరుగా గృహిహింస చట్టం సిబ్బందికి ఫిర్యాదు చేస్తే ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తారు. ప్రస్తుతం గృహహింస కార్యాలయం విజయనగరం కేంద్రాస్పత్రిలోని ఆరోగ్యశ్రీ కార్యాలయం పక్కన ఉంది.
గృహ హింస అంటే..
మానసికంగా మాటలతో ఉద్వేగపరిచినా గృహహింస కిందకు వస్తుంది. ఆర్థిక, లైంగిక హింస, బెదిరించడం, భయపెట్టడం, దౌర్జన్యం చేయడం, ఆరోగ్యం కుంటుపడేలా వ్యవహరించడం కూడా గృహహింస కిందకు వస్తాయి. ఈ చట్టం ప్రకారం బాధితురాలికి, ప్రతివాది మధ్య సంబంధం భార్యాభర్తల సంబంధమే కానవసరం లేదు. పుట్టుక వల్ల లేదా పెళ్లి, దత్తత వల్ల కలిసి ఉంటున్న వారైనా, ఒకే ఇంట్లో ప్రస్తుతం లేదా గతంలో కలిసి నివసిస్తున్న స్త్రీ పురుషులు కూడా ఈ చట్టపరిధిలోకి వస్తారు.
ఆశ్రయం అందించే సంస్థలు
గృహహింసకు గురైన మహిళలకు స్వధార్ హోంలో ఆశ్రయం కల్పిస్తారు. గృహహింస కార్యలయంలో అయిదుగురు సిబ్బంది ఉన్నారు. ఒక లీగల్ కౌన్సిలర్, ఒక సోషల్ కౌన్సిలర్, ఇద్దరు హోంగార్డులు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నారు.
నేరుగా ఫిర్యాదు చేయవచ్చు
గృహహింసకు గురయ్యే మహిళలు నేరుగా లేదా ఫోన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. మాటలతో లేదా శారీరకంగా వేధించినా అది గృహహింస పరిధిలోకి వస్తుంది. గృహహింస కార్యాలయాన్ని ఆశ్రయించిన వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తాం. ఇద్దరికీ ముందుగా కౌన్సెలింగ్ చేస్తాం. రాజీ కుదరకపోతే కోర్టులో కేసు వేస్తాం. – జి.మాధవి, లీగల్ కౌన్సిలర్
సయోధ్యతోనే సమస్య పరిష్కారం
వివాహానంతరం భార్యభర్తల మధ్య ఎలాంటి విభేదాలకు తావీయరాదు. ఇద్దరిలో ఏ ఒక్కరూ అహానికి పోరాదు. చిన్న చిన్న సమస్యలుంటే ఇంట్లోనే పరిష్కరించుకోవడం మంచిది. భార్యను అనుమానంతో, వరకట్నం కోసం వేధించడం లేదా దాడికి పాల్పడటం గృహహింస కిందకు వస్తుంది. – జిల్లెల రజని, గృహ హింస సోషల్ కౌన్సిలర్
Comments
Please login to add a commentAdd a comment