సామాజికంగా ఎన్ని మార్పులు చేసుకుంటున్నా.. గృహ హింసలో మాత్రం తగ్గుదలఉండడం లేదు. అదనపు కట్నం కోసం వేధింపులు, తాగుబోతు భర్తలు, అత్తింటి వారి వేధింపులకు గురయ్యే మహిళల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఏటా పెరుగుతున్న గృహ హింస సంబంధిత ఫిర్యాదుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. అయితే గతంలో మాదిరిగా ఇంటి పరువు, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయోనన్న భయాన్ని గృహిణులు వీడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్
ఫిర్యాదుదారులకు కౌన్సెలింగ్
గత ఐదేళ్లలో నమోదైన గృహ హింస ఫిర్యాదులను పరిశీలిస్తే.. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 43 ఫిర్యాదుల నమోదైతే..ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 162 మంది మహిళలు గృహ హింసకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుల్లో కొందరు నేరుగా మహిళా భద్రత విభాగానికి, పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు ఇవ్వగా, మరికొందరు మహిళా భద్రత విభాగం వాట్సాప్ నంబర్‌కు, ఈ–మెయిల్ ద్వారా, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
తెలంగాణ పోలీస్ శాఖలో ప్రత్యేకించి మహిళా భద్రత కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు, షీటీమ్స్, ఇతర చర్యలతో మహిళల్లో పోలీసులపై భరోసా పెరగడం వల్ల కూడా వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు ఇస్తున్నారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. గృహ హింస ఫిర్యాదులు పెరగడానికి, మహిళల్లో పెరిగిన అవగాహన, భరోసాయే కారణమని పేర్కొన్నారు.
మహిళా భద్రత విభాగానికి వచ్చే గృహ హింస ఫిర్యాదులపై సఖి, భరోసా సెంటర్ల ద్వారా, అవి అందుబాటులోని లేని ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లలో ప్రైవేటు కౌన్సిలర్ల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. సమస్య తీవ్రతను బట్టి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదుల్లో కొన్నిటిని కుటుంబీకుల మధ్య సయోధ్య కుదుర్చడం ద్వారా పరిష్కరిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment