
ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టిందని సంబరపడే తల్లిదండ్రులు..పెళ్లీడు రాగానే అప్పు చేసైనా సరే ఆమెను అత్తవారింటికి పంపేందుకు ఉబలాటపడుతుంటారు. కూతురు ఉద్యోగం చేస్తూ తన కాళ్ల మీద తాను నిలబడుతున్నప్పటికీ పెళ్లి చేసి ఓ ‘అయ్య’ చేతిలో పెట్టినపుడే హాయిగా గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోగలుగుతారు. అంతటితో తమ బాధ్యత తీరిపోయింది అనుకోకుండా ఎల్లప్పుడూ ఆమె క్షేమసమాచారాలు తెలుసుకుంటూ పుట్టినిల్లు తనకు అండగా ఉంటుందనే భరోసాను ఇస్తారు. ఇంతటి ప్రేమానురాగాలు కురిపిస్తున్న తల్లిదండ్రులకు.. అత్లింట్లో తాను ఆరళ్లు ఎదుర్కొంటున్నాననే విషయాన్ని చెప్పడానికి ఏ కూతురికైనా మనసెలా ఒప్పుతుంది. చెబితే బెంగతో వాళ్లు ఏమైపోతారోననే బాధ ఓవైపు.. వేధింపులు తాళలేక పుట్టింటికి చేరితే సమాజం నుంచి ఎదురయ్యే సూటిపోటి మాటలు కుంగదీస్తాయనే భయం మరోవైపు ఆమెను మిన్నకుండిపోయేలా చేస్తాయి. అందుకే శారీరకంగా, మానసికంగా భర్త ఎంతగా వేధించినా ఎంతో మంది ఆడవాళ్లు ఆ విషయం గురించి బయటపెట్టరు. నవ్వుతూనే చేదు అనుభవాల తాలూకు గాయాలను గుండెల్లో దాచుకుంటూ కాలం వెళ్లదీస్తారు.
ఈ విషయాలన్నింటినీ గురించి వివరిస్తూ జెనన్ మౌసా అనే జర్నలిస్టు షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. వీడియోలో భాగంగా ఓ అమ్మాయికి పెళ్లైన కొత్తలో పూలతో స్వాగతం పలికిన భర్త.. ఈ తర్వాత తనను గాయపరిచే తీరు...ఆ క్రమంలో ముఖం మీద పడిన గాయాల తాలూకు మచ్చలను దాచేందుకు.. ఆమె మేకప్ వేసుకుంటూ నవ్వుతూ ఉండటం.. చిట్టచివరికి బాధ తాళలేక గట్టిగా ఏడ్వడం కనిపిస్తుంది. గృహహింస గురించి అవగాహన కల్పించే శక్తివంతమైన క్లిప్ ఇది అంటూ జెనన్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం పలువురిని ఆలోచింపజేస్తోంది. ‘హింసకు గురయ్యే మహిళ బహుళ రూపాలు. మనం చూసేదంతా నిజం కాకపోవచ్చు. మేకప్‌తో కప్పబడిన ఆమె ముఖం లోపలి పొరలు ఎంతగా కమిలిపోయాయో ఎవరికి తెలుసు. గృహహింస అనే రాక్షస క్రీడకు బలవుతూ వాటిని పంటిబిగువున దిగమింగుతున్న ఆడవాళ్లు ఎందరో. నిజానికి మీరలా ఉండటం సరైంది కాదు. గొంతు విప్పాలి. పెళ్లి పిల్లలతో పాటుగా ఆర్థిక స్వాత్రంత్యం కూడా మహిళలకు ముఖ్యం’ అనే విషయాన్ని గమనించాలి అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇందులో అత్యధిక మంది పురుష నెటిజన్లు ఉండటం హర్షించదగ్గ విషయం.
What a powerful clip to raise awareness about domestic abuse. 💔pic.twitter.com/O3gECLqMwn
— Jenan Moussa (@jenanmoussa) August 24, 2019
Comments
Please login to add a commentAdd a comment