
మగోడు
మగాడు కంటతడి పెట్టకూడదు... మగాడు బాధతో కుమిలిపోకూడదు... మగాడు నిబ్బరంగా ఉండాలి... ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవాలి... ఇలాంటి మాటలను చిన్నప్పటి నుంచి నూరిపోస్తారు మగపిల్లలకు. ఆ మాటలు నిజమేననే భ్రమలో బతికేసే ‘మగా’నుభావులు గుండెల్లోనే అగ్నిపర్వతాలను దాచుకుంటూ గాంభీర్యం సడలకుండా బయట తిరిగేస్తూ ఉంటారు. ఏదో ఒకరోజు అగ్నిపర్వతం బద్దలవుతుంది. దాంతో గుండె ఆగి గుటుక్కుమంటారు. చాలామంది పురుషుల అకాల మరణాలకు ఇలాంటి పరిస్థితులే కారణం. మగాళ్లూ మనుషులే! వాళ్లకూ ఈతిబాధలు ఉంటాయి.
ఆడవాళ్ల బాధలను లోకమంతా పట్టించుకుంటుంది గానీ, మగాళ్ల బాధలను సాటి మగాళ్లు సైతం పట్టించుకోరు. మగాళ్ల జీవితాల్లో ఇదో పెద్ద విషాదం. గృహహింస బాధితులంటే మహిళలే అయి ఉంటారని చాలామంది ముందుగానే ఊహిస్తారు. కానీ, అది అర్ధసత్యం మాత్రమే! గృహహింస బాధితుల్లో మగాళ్ల సంఖ్య కూడా తక్కువ కాదు. ముఖ్యంగా జీవిత భాగస్వాముల చేతిలో నానా హింసలు అనుభవిస్తున్న మగాళ్లు తమ గోడు ఎవరికీ చెప్పుకోలేక లోలోనే కుమిలిపోతున్నారని ఇటీవల కంబ్రియా వర్సిటీ, సెంట్రల్ లాన్సషైర్ వర్సిటీలకు చెందిన మానసిక శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. జీవిత భాగస్వాముల చేతిలో దాడులకు గురవుతున్న వారిలో మగాళ్ల సంఖ్య, మహిళల సంఖ్య దాదాపు సమానంగానే ఉందని వెల్లడైంది.
- దాసు