సాక్షి, బెంగళూరు: కరోనా మహమ్మారితో ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు, లాక్‌డౌన్ వల్ల ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం తదితర కారణాలతో గృహహింస పెచ్చరిల్లుతోంది. అందుకు అతివే బాధితురాలు అవుతోంది. ఇది కర్ణాటకలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
3 నెలల్లో 458 వరకట్న కేసులు,52 మంది మృతి
మూడు నెలల్లో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 458 వరకట్న కేసులు నమోదు కాగా వీరిలో 52 మంది మహిళలు మరణించారు. భర్త చేతిలో హత్యకు గురికావడమో, లేదా ఆత్మహత్య చేసుకోవడమో జరిగింది. మహిళలపై దౌర్జన్యాలకు సంబంధించి మొత్తం 574 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్ అమలైన సుమారు 10 రోజుల నుంచి 159 మందికి పైగా మహిళలు వరకట్న వేధింపులతో పోలీస్‌స్టేషన్ల మెట్లు ఎక్కారు. మే నెలలో కేసులు ఇంకా పెరగవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. కొన్ని కేసులను పరిశీలిస్తే కట్నం కోసం వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది.
డబ్బు తేలేదని విడాకుల నోటీస్
బెంగళూరులోని జయనగరలో 28 ఏళ్ల మహిళకు నాలుగేళ్ల కిందట ప్రైవేటు ఉద్యోగి శ్రీకాంత్‌తో వివాహమైంది. కరోనా వల్ల ఏర్పడిన లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉంటూ భార్యను వేధించసాగాడు. కనీసం తిండి కూడా పెట్టకుండా, పుట్టింటి నుంచి రూ. 3 లక్షలు తేవాలని ఒత్తిడి చేశాడు. ఆమె డబ్బు తేలేదని విడాకులు నోటీస్ పంపాడు.
రూ.64 లక్షలు ఇచ్చినా తృప్తి లేదు
బెంగళూరు కేఆర్ పురానికి చెందిన 34 ఏళ్ల మహిళకు 2015లో ఇంజనీర్ ప్రకాష్‌తో వివాహమైంది. ఇల్లు కొందామంటే ఆమె రూ. 64 లక్షలు అప్పుచేసి భర్తకు ఇచ్చింది. అయినప్పటికీ మళ్లీ డబ్బు తేవాలని భర్త వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాలింతపై పాశవిక దాడి
పట్టెగారేపాళ్యకు చెందిన 25 ఏళ్ల మహిళకు మూడేళ్ల కిందట ప్రైవేటు కంపెనీ ఉద్యోగి శివకుమార్‌తో వివాహమైంది. పెళ్లి సమయంలో కట్న కానుకలు భారీగానే ముట్టజెప్పారు. అయినా మళ్లీ తేవాలని ఒత్తిడి చేయసాగాడు. గర్భిణి అని కూడా చూడకుండా సతాయించాడు. ప్రసవానికి పుట్టింటికి వెళ్లి తిరిగిరాగా, డబ్బులు, బంగారం తీసుకురాలేదని రక్తం వచ్చేలా కొట్టాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
కర్ణాటకలో గృహహింస కేసుల వివరాలు
ఏడాది కేసులు మృతులు
2017 1,532 206
2018 1,524 198
2019 1,716 189
2020 1487 177
2021 (మార్చి) 458 52
Comments
Please login to add a commentAdd a comment