కోడిగుడ్డు కూర మరికొంచెం పెట్టమన్నందుకు.. ఆ బాలిక వీపుపై వాతలు పెట్టింది పెద్దమ్మ.
ఇల్లెందు (ఖమ్మం) : కోడిగుడ్డు కూర మరికొంచెం పెట్టమన్నందుకు.. ఆ బాలిక వీపుపై వాతలు పెట్టింది పెద్దమ్మ. పైగా అరుపులు వినిపించకుండా బాత్‌రూమ్‌లో బంధించింది. ఖమ్మం జిల్లా ఇల్లెందు పట్టణంలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బాలాజీ నగర్‌కు చెందిన పసుపులేటి ప్రభాకర్, మౌనిక దంపతుల ఏడేళ్ల కూతురు హారిక. తండ్రి మరణించగా, తల్లి ఎటో వెళ్లిపోవడంతో గత కొంతకాలంగా హారిక పెద్దమ్మ వరలక్ష్మి వద్ద ఉంటోంది. రోజూ మాదిరిగా గురువారం మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు వరలక్ష్మి తన సొంత కుమారుడికి కోడి గుడ్డు కూరతో భోజనం వడ్డించింది. హారికకు మాత్రం కొద్దిగానే వేసింది. తనకు మరికొంచెం కూర పెట్టమని హారిక అడగడంతోనే ఆమెకు కోపం వచ్చింది.
ఆగ్రహంతో తన చేతిలోని గరిటెను కాల్చి వీపు మీద అంటించింది. హారిక ఏడవడంతో మరింత కోపంతో మరో చోట కాల్చింది. బాలిక ఏడుపులు వినిపించకుండా బాత్‌రూమ్‌లో బంధించి తలుపులు వేసింది. గమనించిన చుట్టుపక్కలవారు స్థానిక ఒడ్డెరగుంపు అంగన్‌వాడీ కార్యకర్త ఉప్పు పద్మావతికి సమాచారం అందించారు. వెంటనే అంగన్‌వాడీ కార్యకర్త అక్కడికి వెళ్లి బాలికను కలిసి జరిగిన ఘటనపై ఆరా తీసింది. సూపర్‌వైజర్ సరోజనకు సమాచారం అందించగా ఆమె వచ్చి స్థానికుల సహాయంతో బాలికను ఇల్లెందు సివిల్ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. అనంతరం బాలికను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. వారు బాలికను హన్మంతులపాడు అనాథాశ్రమానికి తరలించారు.