పెళ్లయిన ప్రతి ముగ్గురిలో ఒక స్త్రీ.. గృహహింసకు గురవుతున్న దేశం మనది! చట్టాలు, కోర్టులు, పోలీసు వ్యవస్థ.. ఎన్ని ఉన్నా, ఇంటి నాలుగు గోడల మధ్య భర్త, ఇతర కుటుంబ సభ్యులు పెట్టే నరకయాతనను అడ్డుకోలేకపోతున్నాయి. ఒకవేళ ఏ బాధితురాలైనా తనను తాను కాపాడుకోడానికి, తన పిల్లల్ని తీసుకుని బయటి ప్రపంచంలోకి పారిపోయి వచ్చినా.. తల్లీపిల్లలకు రక్షణ ఎవరిస్తారు? చేయడానికి ఆమెకు పని ఎవరు చూపిస్తారు? మళ్లీ అక్కడ కూడా ఇంటిలాంటి సమాజమే వారిని వెంటపడి వేధిస్తే? ఇంట్లో ఉండడమే నయమనిపిస్తే?!
‘‘లేదు, లేదు.. నయం అనిపించదు. నరకంలోకి వెళ్లినా ఇల్లు నయం అనిపించదు’’ అని జులేఖా, షైమీన్, రాణి, మమత, జ్యోతి, సునీత, ప్రీతి అంటున్నారు. వీళ్లందరిదీ ఒకటే కథ.. గృహహింస. వీళ్లందరినీ చేరదీసింది ఒకే సంస్థ.. ‘గౌరవి’. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో 2014లో ప్రారంభమైన ‘గౌరవి’ గత నాలుగేళ్లుగా.. ఇంటి హింసను తట్టుకోలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చిన బాలికలకు, గృహిణులకు ఆశ్రయం ఇస్తోంది. ‘హోమ్ షుడెన్ట్ హర్ట్’ (ఇల్లు బాధించకూడదు) అనే క్యాంపెయిన్‌తో ఏ ఆసరాలేని ఆడపడుచులను ఆదుకుంటోంది. ‘గౌరవి’ చేయూతతో బోరుబావుల్లోంచి ప్రాణాలతో బయటికి వచ్చినట్లుగా కొత్త జీవితాన్ని ఆరంభించి, ఆదర్శంగా నిలుస్తున్న కొంతమంది మహిళల సంక్షిప్త వ్యథనాలివి.
‘తోడుగా నేను లేనా’ అన్నాడు!
జులేఖాకు 19 ఏళ్లకే పెళ్లైంది. ఆ వెంటనే భర్త ఆమెను భౌతికంగా హింసించడం మొదలైంది. భార్యను కొట్టడం కూడా దాంపత్య జీవితంలో ఒక భాగమే అనుకున్నట్లు, అదొక దైనందిన వైవాహిక ధర్మంగా ఆమెను కొట్టేవాడు! గదిలోకి తోసి, తలుపులు వేసి నరకం చూపించేవాడు. ఆమె ఓర్చుకున్నా ఆమె దేహం ఎన్నాళ్లని తట్టుకుంటుంది. ఓ రోజు భర్త దెబ్బలకు నిలువునా కూలిపోయింది. అమ్మానాన్న వచ్చి వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె కోలుకుని ఇంటికి రాకముందే ఆమె భర్త రెండోపెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. అత్తింట్లో ఒంటరిగా ఉండిపోయింది. ‘తోడుగా నేను లేనా’ అని ఓ రాత్రి ఆమె మామ (భర్త తండ్రి) ఆమె పడుకుని ఉన్న గదిలోకి వచ్చాడు. అప్పట్నుంచి కొత్త నరకం మొదలైంది. ఇల్లొదిలి పారిపోయింది. తనకుంటూ చిన్న ఉపాధిని ఏర్పరచుకుంది. మహిళలెవరైనా తనకు తారసపడితే వారిని చేరదీసి ఒక దారి చూపిస్తోంది.
నా కూతుర్ని నాలా కానివ్వను
షైమీ పై నిత్యం ఆమె భర్త చెయ్యి చేసుకునేవాడు. అవసరం లేకున్నా అలవాటుగా ఆ పని చేసేవాడు. ఉదయాన్నే లేవలేకపోయినందుకు, ఒంట్లో బాగోలేదు అన్నందుకు, ఫోన్‌లో పుట్టింటి వాళ్లతో మాట్లాడినందుకు భర్త ఆగ్రహించేవాడు. కర్రనో, కుర్చీనో.. చేతికి అందిన దాన్ని తీసుకుని ఆమెపై విసిరేవాడు. షైమీన్ గర్భిణిగా ఉండగా ఓ రోజు బలంగా కడుపులో కొట్టడంతో గర్భస్రావం జరిగి, ఆమె ప్రాణం పోయినంత పని జరిగింది. మళ్లీ గర్భం దాల్చినప్పుడు ఆడబిడ్డను కన్నందుకు ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. షైమీన్ కోర్టుకు వెళ్లింది. కోర్టు అతడి నుంచి ఆమెకు 4,500 రూపాయల పరిహారం ఇప్పించింది. షైమీన్ ఇప్పుడు స్వయం ఉపాధితో తనను, తన కూతుర్ని పోషించుకుంటోంది. ‘‘నా కూతుర్ని నాలా కానివ్వను. ఆమెకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని, చక్కటి చదువును అందిస్తాను’’ అంటోంది.
సంపాదిస్తేనే భార్యకైనా గౌరవం
రాణి రెండో బిడ్డను కడుపులో మోస్తున్నప్పుడు ఆమె భర్త ఆమెను చావబాదాడు! ‘మళ్లీ కనుక కూతుర్నే కన్నావంటే, ముగ్గుర్నీ కలిపి పాతేస్తాను’ అని హెచ్చరించాడు. రాణి భయపడిపోయింది. అప్పటికే ఆమెకు ఒక కూతురు. ఆమెకు అర్థమైంది. అతడు అన్నంత పనీ చేస్తాడని. ఆరేళ్ల వైవాహిక బంధాన్ని తెంపేసుకుని, ఇంట్లోంచి వెళ్లిపోయింది. కోర్టులో విడాకుల కేసు ఇంకా నడుస్తూనే ఉంది. కేసుతో సంబంధం లేకుండా, భర్త విదిలించే డబ్బుల కోసం చూడకుండా కష్టం చేసుకుంటూ తన కాళ్ల మీద తను నిలబడింది. ఇద్దరు ఆడపిల్లల్ని ఎలాంటి భయాలు లేకుండా మురిపెంగా పెంచుకుంటోంది. ‘‘డబ్బు సంపాదిస్తున్న భార్యను మాత్రమే మగవాళ్లు గౌరవంగా చూస్తారు. లేకుంటే.. చులకన చేస్తారు’’ అని రాణి అంటోంది, భర్త తనను ఎంత హీనంగా చూసిందీ గుర్తు చేసుకుంటూ.
ఇప్పుడెవరికీ భయపడే పని లేదు
మమత మరొక బాధితురాలు. ఆమెనే కాదు, పిల్లల్ని కూడా కొట్టేవాడు ఆమె భర్త. ‘ఇలాంటి భర్త వద్దు’ అనుకుని బయటికి వచ్చేసింది. పిల్లల్ని హాస్టల్‌లో చేర్చింది. నాలుగు రాళ్లు సంపాదిస్తోంది. ‘‘ఇప్పుడు నేనెవరికీ భయపడే పని లేదు. నా బతుకు నేను బతుకుతున్నాను. నా పిల్లలకు మంచి జీవితాన్ని ఇస్తాను’’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.
ఫ్రెండ్స్ ముందు కొట్టేవాడు
జ్యోతి చైల్డ్ కౌన్సిలర్‌గా చేస్తోంది. పన్నెండేళ్ల వైవాహిక జీవితంలోని దుర్భరమైన హింస నుంచి విముక్తి కోసం ఆమె గడప బయటికి అడుగుపెట్టింది. భర్త ప్రతి విషయంలోనూ ఆమెను నియంత్రించేవాడు. ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి.. ఏం తినాలి? ఎప్పుడు నిద్రపోవాలి.. అన్నీ అతడి ఆదేశానుసారం జరగాల్సిందే! చివరికి అతడి ఫ్రెండ్స్ ముందుకు కూడా ఆమెను కొట్టడం మొదలుపెట్టాడు. అతడికి విడాకులిచ్చేశాక జ్యోతి చైల్డ్ సైకాలజీ చదువుకుంది. చదువుకు తగ్గ జాబ్ వెతుక్కుంది. కొడుకును తన దగ్గరే ఉంచుకున్నాడు భర్త. ఇప్పుడా కొడుకు కోసం న్యాయ పోరాటం చేస్తోంది. ‘‘నా భర్త నుంచి విడిపోగానే నాకు రెక్కలు వచ్చినట్లుగా అయింది. చాలా ఆనందంగా అనిపించింది. ‘ఇకనుంచీ నా ఇష్టం వచ్చినట్లు నేను ఉండొచ్చు కదా’ అన్న ఆలోచన నాలో జీవితేచ్ఛను కలిగించింది. నా జీవితానికి ఒక అర్థం కనిపిస్తోంది’’ అని జ్యోతి సంతోషంగా చెబుతోంది.
నా ఫొటో వేసి రాయండి
సునీత భర్త ప్రతిరోజూ తాగి వచ్చి, సునీతతో అయినదానికీ, కానిదానికీ గొడవపడేవాడు. ఇక అతడితో కలిసి ఉండలేని పరిస్థితికి వచ్చేసింది సునీత. ఆ సమయంలో బంధువులు చొరవచూపి, భార్యాభర్తల్ని మ్యారేజ్ కౌన్సెలింగ్‌కి తీసుకెళ్లారు. ‘సరే, నేనిక తాగను. గొడవ పడను’ అని కౌన్సెలింగ్ ఇచ్చినవారి ముందు అంగీకరించి, ఇంటికొచ్చాక మళ్లీ మామూలుగానే తాగడం, సునీతను కొట్టడం మొదలుపెట్టాడు! సునీతకు విడాకులు తప్ప వేరే మార్గం కనిపించలేదు. కోర్టులో కేసు వేసింది. భర్త నుంచి ఇప్పుడు ఆమెకు భరణం కూడా అందుతోంది. ‘ది టెలిగ్రాఫ్’ పత్రిక ప్రతినిధులతో కూడా ఆమె ధైర్యంగానే చెప్పింది.. ‘‘నా ఫొటో వెయ్యండి, నా గురించి రాయండి. నాలాంటి మహిళలు కొందరికైనా నేనొక ప్రేరణ అయి, వారి జీవితాలు మెరుగయితే అంతకుమించిన సంతృప్తి నాకు ఏముంటుంది?’’ అంది సునీత.
ఇరవై ఏళ్లకే ఇద్దరు పిల్లలు
ప్రీతి భోపాల్‌లో ఒక ఫుడ్ కియోస్క్ నడుపుతోంది. రెండు పెళ్లిళ్లు విఫలమై, దారుణమైన జీవితాన్ని అనుభవించి ఇప్పుడు తన బతుకు తను బతుకుతోంది. పదేళ్ల వయసులో ప్రీతికి మొదటి పెళ్లి జరిగింది. వరుడు ఆమెకన్నా చాలా పెద్దవాడు. ఇరవైఏళ్ల వయసు వచ్చేనాటికి ప్రీతికి ఇద్దరు పిల్లలు. భర్త ఆనారోగ్యంతో చనిపోయాక, రెండో పెళ్లి చేసుకుంది. ఒక మగబిడ్డను కంది. అయితే రెండో పెళ్లి కూడా ఆమెకు నరకమే చూపించింది. భర్త ఎప్పుడూ తిట్టేవాడు, కొట్టేవాడు. అనుమానించేవాడు. ఒకరోజు ముగ్గురు పిల్లల్నీ తీసుకుని ఆ గృహనరకం నుంచి బయటపడింది ప్రీతి. ఇప్పుడు తినుబండారాల బండిని నడిపిన విధంగానే తన జీవితాన్నీ సాఫీగా నడుపుకుంటోంది. పిల్లల్ని చక్కగా చదివించుకుంటోంది.
(సౌజన్యం: ది టెలిగ్రాఫ్)
Comments
Please login to add a commentAdd a comment