Marriage counseling
-
నరకం నుంచి బయటికి
పెళ్లయిన ప్రతి ముగ్గురిలో ఒక స్త్రీ.. గృహహింసకు గురవుతున్న దేశం మనది! చట్టాలు, కోర్టులు, పోలీసు వ్యవస్థ.. ఎన్ని ఉన్నా, ఇంటి నాలుగు గోడల మధ్య భర్త, ఇతర కుటుంబ సభ్యులు పెట్టే నరకయాతనను అడ్డుకోలేకపోతున్నాయి. ఒకవేళ ఏ బాధితురాలైనా తనను తాను కాపాడుకోడానికి, తన పిల్లల్ని తీసుకుని బయటి ప్రపంచంలోకి పారిపోయి వచ్చినా.. తల్లీపిల్లలకు రక్షణ ఎవరిస్తారు? చేయడానికి ఆమెకు పని ఎవరు చూపిస్తారు? మళ్లీ అక్కడ కూడా ఇంటిలాంటి సమాజమే వారిని వెంటపడి వేధిస్తే? ఇంట్లో ఉండడమే నయమనిపిస్తే?! ‘‘లేదు, లేదు.. నయం అనిపించదు. నరకంలోకి వెళ్లినా ఇల్లు నయం అనిపించదు’’ అని జులేఖా, షైమీన్, రాణి, మమత, జ్యోతి, సునీత, ప్రీతి అంటున్నారు. వీళ్లందరిదీ ఒకటే కథ.. గృహహింస. వీళ్లందరినీ చేరదీసింది ఒకే సంస్థ.. ‘గౌరవి’. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో 2014లో ప్రారంభమైన ‘గౌరవి’ గత నాలుగేళ్లుగా.. ఇంటి హింసను తట్టుకోలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చిన బాలికలకు, గృహిణులకు ఆశ్రయం ఇస్తోంది. ‘హోమ్ షుడెన్ట్ హర్ట్’ (ఇల్లు బాధించకూడదు) అనే క్యాంపెయిన్‌తో ఏ ఆసరాలేని ఆడపడుచులను ఆదుకుంటోంది. ‘గౌరవి’ చేయూతతో బోరుబావుల్లోంచి ప్రాణాలతో బయటికి వచ్చినట్లుగా కొత్త జీవితాన్ని ఆరంభించి, ఆదర్శంగా నిలుస్తున్న కొంతమంది మహిళల సంక్షిప్త వ్యథనాలివి. ‘తోడుగా నేను లేనా’ అన్నాడు! జులేఖాకు 19 ఏళ్లకే పెళ్లైంది. ఆ వెంటనే భర్త ఆమెను భౌతికంగా హింసించడం మొదలైంది. భార్యను కొట్టడం కూడా దాంపత్య జీవితంలో ఒక భాగమే అనుకున్నట్లు, అదొక దైనందిన వైవాహిక ధర్మంగా ఆమెను కొట్టేవాడు! గదిలోకి తోసి, తలుపులు వేసి నరకం చూపించేవాడు. ఆమె ఓర్చుకున్నా ఆమె దేహం ఎన్నాళ్లని తట్టుకుంటుంది. ఓ రోజు భర్త దెబ్బలకు నిలువునా కూలిపోయింది. అమ్మానాన్న వచ్చి వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె కోలుకుని ఇంటికి రాకముందే ఆమె భర్త రెండోపెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. అత్తింట్లో ఒంటరిగా ఉండిపోయింది. ‘తోడుగా నేను లేనా’ అని ఓ రాత్రి ఆమె మామ (భర్త తండ్రి) ఆమె పడుకుని ఉన్న గదిలోకి వచ్చాడు. అప్పట్నుంచి కొత్త నరకం మొదలైంది. ఇల్లొదిలి పారిపోయింది. తనకుంటూ చిన్న ఉపాధిని ఏర్పరచుకుంది. మహిళలెవరైనా తనకు తారసపడితే వారిని చేరదీసి ఒక దారి చూపిస్తోంది. నా కూతుర్ని నాలా కానివ్వను షైమీ పై నిత్యం ఆమె భర్త చెయ్యి చేసుకునేవాడు. అవసరం లేకున్నా అలవాటుగా ఆ పని చేసేవాడు. ఉదయాన్నే లేవలేకపోయినందుకు, ఒంట్లో బాగోలేదు అన్నందుకు, ఫోన్లో పుట్టింటి వాళ్లతో మాట్లాడినందుకు భర్త ఆగ్రహించేవాడు. కర్రనో, కుర్చీనో.. చేతికి అందిన దాన్ని తీసుకుని ఆమెపై విసిరేవాడు. షైమీన్ గర్భిణిగా ఉండగా ఓ రోజు బలంగా కడుపులో కొట్టడంతో గర్భస్రావం జరిగి, ఆమె ప్రాణం పోయినంత పని జరిగింది. మళ్లీ గర్భం దాల్చినప్పుడు ఆడబిడ్డను కన్నందుకు ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. షైమీన్ కోర్టుకు వెళ్లింది. కోర్టు అతడి నుంచి ఆమెకు 4,500 రూపాయల పరిహారం ఇప్పించింది. షైమీన్ ఇప్పుడు స్వయం ఉపాధితో తనను, తన కూతుర్ని పోషించుకుంటోంది. ‘‘నా కూతుర్ని నాలా కానివ్వను. ఆమెకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని, చక్కటి చదువును అందిస్తాను’’ అంటోంది. సంపాదిస్తేనే భార్యకైనా గౌరవం రాణి రెండో బిడ్డను కడుపులో మోస్తున్నప్పుడు ఆమె భర్త ఆమెను చావబాదాడు! ‘మళ్లీ కనుక కూతుర్నే కన్నావంటే, ముగ్గుర్నీ కలిపి పాతేస్తాను’ అని హెచ్చరించాడు. రాణి భయపడిపోయింది. అప్పటికే ఆమెకు ఒక కూతురు. ఆమెకు అర్థమైంది. అతడు అన్నంత పనీ చేస్తాడని. ఆరేళ్ల వైవాహిక బంధాన్ని తెంపేసుకుని, ఇంట్లోంచి వెళ్లిపోయింది. కోర్టులో విడాకుల కేసు ఇంకా నడుస్తూనే ఉంది. కేసుతో సంబంధం లేకుండా, భర్త విదిలించే డబ్బుల కోసం చూడకుండా కష్టం చేసుకుంటూ తన కాళ్ల మీద తను నిలబడింది. ఇద్దరు ఆడపిల్లల్ని ఎలాంటి భయాలు లేకుండా మురిపెంగా పెంచుకుంటోంది. ‘‘డబ్బు సంపాదిస్తున్న భార్యను మాత్రమే మగవాళ్లు గౌరవంగా చూస్తారు. లేకుంటే.. చులకన చేస్తారు’’ అని రాణి అంటోంది, భర్త తనను ఎంత హీనంగా చూసిందీ గుర్తు చేసుకుంటూ. ఇప్పుడెవరికీ భయపడే పని లేదు మమత మరొక బాధితురాలు. ఆమెనే కాదు, పిల్లల్ని కూడా కొట్టేవాడు ఆమె భర్త. ‘ఇలాంటి భర్త వద్దు’ అనుకుని బయటికి వచ్చేసింది. పిల్లల్ని హాస్టల్లో చేర్చింది. నాలుగు రాళ్లు సంపాదిస్తోంది. ‘‘ఇప్పుడు నేనెవరికీ భయపడే పని లేదు. నా బతుకు నేను బతుకుతున్నాను. నా పిల్లలకు మంచి జీవితాన్ని ఇస్తాను’’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. ఫ్రెండ్స్ ముందు కొట్టేవాడు జ్యోతి చైల్డ్ కౌన్సిలర్‌గా చేస్తోంది. పన్నెండేళ్ల వైవాహిక జీవితంలోని దుర్భరమైన హింస నుంచి విముక్తి కోసం ఆమె గడప బయటికి అడుగుపెట్టింది. భర్త ప్రతి విషయంలోనూ ఆమెను నియంత్రించేవాడు. ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి.. ఏం తినాలి? ఎప్పుడు నిద్రపోవాలి.. అన్నీ అతడి ఆదేశానుసారం జరగాల్సిందే! చివరికి అతడి ఫ్రెండ్స్ ముందుకు కూడా ఆమెను కొట్టడం మొదలుపెట్టాడు. అతడికి విడాకులిచ్చేశాక జ్యోతి చైల్డ్ సైకాలజీ చదువుకుంది. చదువుకు తగ్గ జాబ్ వెతుక్కుంది. కొడుకును తన దగ్గరే ఉంచుకున్నాడు భర్త. ఇప్పుడా కొడుకు కోసం న్యాయ పోరాటం చేస్తోంది. ‘‘నా భర్త నుంచి విడిపోగానే నాకు రెక్కలు వచ్చినట్లుగా అయింది. చాలా ఆనందంగా అనిపించింది. ‘ఇకనుంచీ నా ఇష్టం వచ్చినట్లు నేను ఉండొచ్చు కదా’ అన్న ఆలోచన నాలో జీవితేచ్ఛను కలిగించింది. నా జీవితానికి ఒక అర్థం కనిపిస్తోంది’’ అని జ్యోతి సంతోషంగా చెబుతోంది. నా ఫొటో వేసి రాయండి సునీత భర్త ప్రతిరోజూ తాగి వచ్చి, సునీతతో అయినదానికీ, కానిదానికీ గొడవపడేవాడు. ఇక అతడితో కలిసి ఉండలేని పరిస్థితికి వచ్చేసింది సునీత. ఆ సమయంలో బంధువులు చొరవచూపి, భార్యాభర్తల్ని మ్యారేజ్ కౌన్సెలింగ్‌కి తీసుకెళ్లారు. ‘సరే, నేనిక తాగను. గొడవ పడను’ అని కౌన్సెలింగ్ ఇచ్చినవారి ముందు అంగీకరించి, ఇంటికొచ్చాక మళ్లీ మామూలుగానే తాగడం, సునీతను కొట్టడం మొదలుపెట్టాడు! సునీతకు విడాకులు తప్ప వేరే మార్గం కనిపించలేదు. కోర్టులో కేసు వేసింది. భర్త నుంచి ఇప్పుడు ఆమెకు భరణం కూడా అందుతోంది. ‘ది టెలిగ్రాఫ్’ పత్రిక ప్రతినిధులతో కూడా ఆమె ధైర్యంగానే చెప్పింది.. ‘‘నా ఫొటో వెయ్యండి, నా గురించి రాయండి. నాలాంటి మహిళలు కొందరికైనా నేనొక ప్రేరణ అయి, వారి జీవితాలు మెరుగయితే అంతకుమించిన సంతృప్తి నాకు ఏముంటుంది?’’ అంది సునీత. ఇరవై ఏళ్లకే ఇద్దరు పిల్లలు ప్రీతి భోపాల్‌లో ఒక ఫుడ్ కియోస్క్ నడుపుతోంది. రెండు పెళ్లిళ్లు విఫలమై, దారుణమైన జీవితాన్ని అనుభవించి ఇప్పుడు తన బతుకు తను బతుకుతోంది. పదేళ్ల వయసులో ప్రీతికి మొదటి పెళ్లి జరిగింది. వరుడు ఆమెకన్నా చాలా పెద్దవాడు. ఇరవైఏళ్ల వయసు వచ్చేనాటికి ప్రీతికి ఇద్దరు పిల్లలు. భర్త ఆనారోగ్యంతో చనిపోయాక, రెండో పెళ్లి చేసుకుంది. ఒక మగబిడ్డను కంది. అయితే రెండో పెళ్లి కూడా ఆమెకు నరకమే చూపించింది. భర్త ఎప్పుడూ తిట్టేవాడు, కొట్టేవాడు. అనుమానించేవాడు. ఒకరోజు ముగ్గురు పిల్లల్నీ తీసుకుని ఆ గృహనరకం నుంచి బయటపడింది ప్రీతి. ఇప్పుడు తినుబండారాల బండిని నడిపిన విధంగానే తన జీవితాన్నీ సాఫీగా నడుపుకుంటోంది. పిల్లల్ని చక్కగా చదివించుకుంటోంది. (సౌజన్యం: ది టెలిగ్రాఫ్) -
ఒబామాను వదిలేద్దామనుకున్నా: మిచెల్
వాషింగ్టన్ : ‘కొన్ని కొన్నిసార్లు అనుకున్నవన్నీ జరిగే అవకాశం ఉండదు. అంతమాత్రాన కుంగిపోవాల్సిన పనిలేదు’ అంటూ అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా తాను మ్యారేజ్ కౌన్సిలింగ్‌కు వెళ్లిన నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. పీపుల్ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ... ‘మేము రోల్ మోడల్స్ కాబట్టి ప్రతి ఒక్కరు మమ్మల్ని అనుసరించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతీ విషయంలో నిజాయితీగా ఉండాలని కోరుకుంటాం. కొన్నిసార్లు వివాహ బంధం నుంచి వైదొలగాలని అన్పిస్తుంది. ఎవరికైనా ఇది సహజం. నాకు కూడా చాలాసార్లు అలాగే అన్పించింది. అందుకే మ్యారేజ్ కౌన్సిలింగ్ కావాలని కోరానని మిచెల్ పేర్కొన్నారు. కౌన్సిలింగ్ జరిగిన నాటి నుంచి తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాల గురించి చర్చించుకోవడం మొదలుపెట్టామని, అందుకే చాలా విషయాల్లో తాను చేసే చిన్న చిన్న తప్పులేంటో తెలిసొచ్చాయని మిచెల్ చెప్పుకొచ్చారు. అంతేకాదు అప్పటి నుంచే తన భర్తతో పాటుగా ఇతరులను కూడా సహాయం అడిగే చొరవ లభించిందని పేర్కొన్నారు. మ్యారేజ్ కౌన్సిలింగ్‌కు వెళ్లడం వల్ల దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తొలగిపోయి, ఆ బంధం మరింత బలపడుతుంది. కాబట్టి కౌన్సిలింగ్‌కు వెళ్లాల్సి వస్తే ఏమాత్రం ఇబ్బంది పడవద్దని మిచెల్ సూచించారు. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా- మిచెల్ల వివాహం 1992లో జరిగింది. వీరికి మాలియా, సాషా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్న సంగతి తెలిసిందే. -
ఆయనంటేనే అసహ్యం!
మ్యారేజ్ కౌన్సెలింగ్ మా పెళ్లై ఆరేళ్లైనా సంతానం కలగకపోవడంతో ఎన్నో హాస్పిటల్స్‌కి వెళ్లాను. అన్ని పరీక్షల అనంతరం నాలో ఏ లోపం లేదని తెలిసింది. డాక్టర్స్ మావారిని కూడా పరీక్షించాలన్నారు. కానీ ఆయన ఒప్పుకోవడం లేదు. ఇదిలా ఉండగా నాకొక దిగ్భ్రాంతికరమైన విషయం తెలిసింది. మావారు నాకు చెప్పకుండా ఏనాడో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారట. అది తెలిశాక నాకు ఆయన ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. ఏం చేయాలి? - మాళవిక, మదనపల్లి హిందూ వివాహ చట్టం సెక్షన్ 13ను అనుసరించి ‘క్రూరప్రవర్తన’ విడాకులు తీసుకోవడానికి ఒక ఆధారమవుతుంది. అది శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు. సరైన వైద్యకారణాలు ఏమీ లేకుండా భర్త లేదా భార్య రహస్యంగా పిల్లలు కలుగకుండా ఆపరేషన్ చేయించుకుంటే అది క్రూరత్వమే అవుతుంది. భార్యా భర్తలలో ఒకరికి తెలియకుండా మరొకరు ఇలా చేయడం క్రూరత్వమేనని, ఆ కారణం మీద విడాకులు ఇవ్వవచ్చునని సుప్రీంకోర్టు అనేక కేసులలో తీర్పు చెప్పింది. మీరు అన్ని వివరాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించండి. - ఇ. పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ -
ఇంటిమసీ తగ్గితే... జీవితం మసి!
మ్యారేజ్ కౌన్సెలింగ్ దూరం పెరిగితే ఏ బంధం అయినా దగ్గరవుతుంది. కానీ దాంపత్యబంధం అలాక్కాదు. భార్యాభర్తలు నిరంతరం దగ్గరగా ఉండాలి. ఉద్యోగరీత్యా దూరంగా ఉండవలసి వచ్చినా... మానసికంగా దగ్గరగా ఉండే ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. అర్థం చేసుకుంటారులే అనుకుని ఊరుకుంటే... అపార్థాలు రావచ్చు. అనుమానాలు తలెత్తవచ్చు. చివరికి జీవితమే అర్ధరహితంగా అనిపించవచ్చు. మాకు పెళ్లయి 15 ఏళ్లవుతోంది. ముగ్గురు పిల్లలు. నాది మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం. క్యాంప్స్ ఎక్కువగా తిరుగుతుంటాను. నేను లేని సమయంలో నా భార్య మా పక్కింటాయనతో అక్రమ సంబంధం పెట్టుకుని, పిల్లల్ని ఒంటరిగా వదిలేసి అతనితో ఊళ్లు తిరగడం, ఉన్న ఊళ్లో సినిమాలు, షికార్లు చేయడం మొదలుపెట్టింది. అదేమని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ, నన్ను ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ఆమె ప్రవర్తనను గమనించిన వారు, చుట్టాలు, స్నేహితులు ఆమె గురించి నన్ను హెచ్చరిస్తుంటే సమాజంలో ఎంతో అవమానంగా, చిన్నతనంగా ఉంది. ఇక నా ముగ్గురు పిల్లల బాధ చెప్పనలవి కాదు. ఇటీవల ఆవిడ పిల్లల్ని పట్టించుకోవడం పూర్తిగా మానేసింది. ప్రస్తుతం మా అమ్మే పిల్లల బాగోగులు చూస్తోంది. నేను విడాకులకు దరఖాస్తుచేయాలను కుంటున్నాను. సలహా చెప్పగలరు. - సుందరయ్య, శాంతినగర్ మీరు మీ భార్యకున్న క్రూయల్టీ ఇల్లిసిట్ ఇంటిమసీ అంటే అక్రమ సంబంధాన్ని కారణంగా చూపుతూ డివోర్స్‌కు ఫైల్ చేయవచ్చు. దానితోపాటు పిల్లల్ని పట్టించుకోవడం లేదని, సంసారాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఇంకా పైన చెప్పిన అన్ని కారణాలు చూపుతూ, ఆమె అక్రమ సంబంధానికి అన్ని సాక్ష్యాలు, ఆధారాలు కోర్టులో ఫైల్ చేస్తూ విడాకులకు దరఖాస్తు చేయండి. మీ వైపు సాక్ష్యాలూ, ఆధారాలూ అన్నీ ఉన్నాయి కాబట్టి కోర్టువారు మీ పరిస్థితిని అర్థం చేసుకుని, మీకు వెంటనే విడాకులు మంజూరు చేసే అవకాశం ఉంది. తీర్పు చెప్పే సమయంలో పిల్లల అభిప్రాయాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుం టుంది. ఆమె కూడా విడాకులకు సిద్ధంగా ఉందంటున్నారు కాబట్టి మీకు సులభంగానే విడాకులు రావొచ్చు. లేదా ఇద్దరు కలిసి పరస్పర అంగీకారంతో మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ ఫైల్ చేసి విడాకులు పొందవచ్చు. మీకిది ఇష్టం లేకపోతే పైన చెప్పినట్లు క్రూయల్టీ కింద అయినా విడాకులకు ఫైల్ చేసి ఆర్డర్ పొందవచ్చు. ప్రయత్నించి చూడండి. మాకు పెళ్లయి 8 ఏళ్లయింది. ఇద్దరు పిల్లలు. ఆయనది బంగారంలాంటి ప్రభుత్వోద్యోగం. అయితే నా భర్తకు లేని చెడ్డ అలవాట్లు లేవు. తాగుబోతు. తిరుగుబోతు. దీనికి తోడు మాదక ద్రవ్యాలకు కూడా బానిస అయ్యాడు. తన దురలవాట్ల మూలంగా విధులకు గైర్హాజరవుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉన్నతోద్యోగులు ఈయన్ను ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు.దాంతో మరింత రెచ్చిపోయి రోజూ తాగొచ్చి ఇంట్లో నన్ను, పిల్లల్ని కొట్టడం, ఇంటిని నరకం చేయడమే తన దినచర్యగా మార్చుకున్నాడు. ఖర్చుల కోసం నా ఒంటిమీదున్న బంగారంతో సహా ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులన్నింటినీ అమ్మేశాడు. నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్‌ను కావడంతో నాకొచ్చే జీతంతో పిల్లల్ని పోషిస్తూ కష్టపడి చదివించుకుంటున్నాను. ఇక ఇతనితో జీవించడం దుర్లభం అని నిశ్చయించుకున్నాను. నేను విడాకులకు అప్లై చేసుకోవచ్చా? విడాకులు వస్తాయా? - క్రిస్టినా, హైదరాబాద్ మీ భర్త మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా హింస పెట్టడాన్ని గురించి కోర్టుకు తెలియజేస్తూ విడాకులకు దరఖాస్తు చేయవచ్చు. క్రూయల్టీ గ్రౌండ్స్ కింద మీకు విడాకులు మంజూరవుతాయి. అయితే మీరు పైన చెప్పిన కారణాలన్నింటినీ సాక్ష్యాలతో కోర్టులో నిరూపించగలగాలి. మీరెలాగూ ప్రభుత్యోద్యోగి కాబట్టి మీకు, పిల్లలకు మెయింటినెన్స్ ఎలాగూ వద్దంటున్నారు కాబట్టి, అతన్నుండి మీరు పర్మినెంట్ కాంపన్సేషన్ (భరణం)గానీ, మెయింటినెన్స్గానీ కోరుకోవట్లేదు కాబట్టి క్రూరత్వం కింద డివోర్స్ గ్రాంట్ అవుతాయి. మీరు ఇక ప్రశాంతంగా పిల్లలతో గడపండి. -
భర్తే శత్రువై బాధిస్తే..!
మ్యారేజ్ కౌన్సెలింగ్ భార్యా రూపవతి శత్రుః అన్నారు. భార్య అందంగా ఉన్నా, తన కన్నా మంచి ఉద్యోగంలో ఉన్నా కొంతమంది భర్తల్లో ఆత్మన్యూనతాభావం మొదలౌతుంది. ఆ న్యూనత లోంచి అనుమానం మొదలౌతుంది. ఆ అనుమానంతో భార్యను శత్రువుగా భావిస్తారు. మాటలతో హింసిస్తారు. దౌర్జన్యం చేస్తారు. చివరికి ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీయాలని చూస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో సెషన్స్ కోర్టును ఆశ్రయించి బాధిత మహిళలు న్యాయాన్ని, రక్షణను పొందవచ్చు. మాది ప్రేమ వివాహం. మా కులాలు వేరు కావడం వల్ల ఇంటిలోని వాళ్లు ఒప్పుకోకపోవడంతో వారిని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. కొన్నాళ్లు మా కాపురం సజావుగానే సాగింది. అయితే ఉద్యోగంలోనూ, అందంలోనూ నేను అతనికన్నా ఒక మెట్టుపైనే ఉండటం వల్ల తనలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోయింది. దాంతో నాపై అసూయతో నన్ను చిత్రహింసల పాలు చేశారు. దాంతో నేను గత కొద్ది కాలంగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను. అయితే ఒక రోజు ఆయన బాగా తాగి నేను ఉంటున్న హాస్టల్‌కు వచ్చి, నన్ను నా కులం పేరుతో దూషించి, అందరి ముందు అవమానించాడు. దాంతో నా ఆత్మగౌరవం దెబ్బతింది. ఇక నేను అతనితో కాపురం చెయ్యదలచుకోలేదు. ఏం చేయాలో తగిన సలహా ఇవ్వగలరు. - నిర్మల, ఆదిలాబాద్ మీ బాధ అర్థమైంది. మీకు రెండు మార్గాలున్నాయి. గృహహింస నిరోధక చట్టం 18ని అనుసరించి పిటిషన్ వేసి, రక్షణ ఉత్తర్వులు పొందటం, అంటే మీ వద్దకు వచ్చి దూషించకుండా, మీ ఆఫీస్‌కు లేదా హాస్టల్‌కు రాకుండా, దారికాచి వేధించకుండా ఆర్డర్స్ పొందవచ్చు. ఇంకోమార్గం..మీరు ఎస్సీ అంటున్నారు కదా, షెడ్యూల్డ్ కులాలు, తెగల అత్యాచార నిరోధక చట్టం 1989 ప్రకారం ఎస్సీఎస్టీలకు చెందిన వారిని కులం పేరుతో దూషించినా, బహిరంగ ప్రదేశాల్లో అవమానించినా, మహిళలను దూషించినా, అవమానపరచాలనే ఉద్దేశ్యంతో దౌర్జన్యం చేసినా, బలప్రయోగం చేసినా, లైంగిక దాడికి గురి చేసినా, వెట్టిచాకిరీ చేయించినా, వివస్త్రను చేసినా, సంస్కారహీనంగా ప్రవర్తించినా, అసహ్యకర ద్రవపదార్థాలు తాగించినా, తినిపించినా అవి తీవ్ర నేరాలవుతాయి. వారికి ఆర్నెల నుంచి ఐదేళ్ల వరకు శిక్ష విధించబడుతుంది. మీరు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. ఈ చట్టం కింద కేసులు వేయాలంటే స్పెషల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించాలి. నా వయసు 75, నా భార్యకు 70 ఏళ్లు. మాకు సంతానం లేదు. కొద్దిపాటి ఆస్తి ఉంది. ఈ వయసులో మాకు సేవ చేసి, మా అవసరాలు తీర్చే వారెవరూ లేక, మాకు దూరపు బంధువైన ఒకరిని నమ్మి, మా అద్దె ఇళ్ల నుంచి వచ్చే ఆదాయంలో కొంత అతనుంచుకుని, మా ఆలనాపాలనా చూసుకోవలసిందిగా కాగితం రాసిచ్చాము. కొన్ని నెలలు మమ్ములను బాగానే చూసుకున్నాడు. తరువాత ఒకరోజు తీర్థయాత్రలకని నన్నూ, నా భార్యనూ కారులో ఎక్కించుకుని వెళ్లి, మమ్ములను ఒక ఊరి బయట దింపి, ఇప్పుడే వస్తానని చెప్పి, ఎక్కడికో వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాలేదు. దాంతో మేము ఎలాగో మా వూరు చేరుకున్నాము. జీవిత చరమాంకంలో ఉన్న మేము ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. - వి.ఆర్. నూజివీడు మీరు ఏ కాగితం రాసుకున్నారో స్పష్టంగా లేదు. ఒకవేళ అదేమైనా అగ్రిమెంట్ అయినట్లయితే దానిని మీరు రద్దు చేసుకోవచ్చు. లేకుంటే బహుమతి రూపంలో కాని, మరే విధంగా గానీ ఆస్తి మార్పిడి చేసి ఉంటే మీరు వయోవృద్ధులు కనుక తలిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం 2007 ప్రకారం ఆ ఆస్తి మార్పిడి లేక బహుమతిని చెల్లనివిగా ప్రకటించవలసిందిగా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చును. ఈ చట్టానికి సంబంధించిన కేసులను మాత్రమే విచారించేందుకు ట్రిబ్యునల్స్ ఏర్పడ్డాయి. ఈ చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం ఒక వయోవృద్ధుడు తనకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, భౌతిక అవసరాలు తీరుస్తాడనే షరతుకు లోబడి ఒక వ్యక్తికి తన ఆస్తిని/ఆదాయాన్ని బహుమతి రూపంలో గానీ, మరోవిధంగా గానీ అప్పగించినట్లయితే, ఆ ఆస్తిని లేదా ఆదాయాన్ని పొందిన వ్యక్తి వారి ఆలనాపాలన చూడడంలో విఫలమైనప్పుడు ఆస్తి మోసపూరితంగా / బలవంతంగా పొందినట్లు భావించబడి, సదరు ఆస్తిమార్పిడి చెల్లనిదిగా ప్రకటించే అధికారం ఆ ట్రిబ్యునల్‌కు ఉంది. సెక్షన్ 24 ప్రకారం వయోవృద్ధులను నిరాదరణకు గురి చేసినందుకు, వదిలి వేసినందుకు, జైలుశిక్ష, జరిమానా పడే అవకాశం ఉంది. మీరు ఆ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించండి. ఇటీవలి కాలంలో ర్యాగింగ్ ఎక్కువై, ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువు మానేస్తున్నారు. తీవ్రమైన డిప్రెషన్‌కు లోనవుతున్నారు. మా కాలేజీలో ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా మేమొక యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్‌గా ఏర్పడాలని అనుకుంటున్నాము. దయచేసి ర్యాగింగ్ చట్టం గురించి కాస్త వివరించండి. - రాధిక, భీమవరం ఆంధ్రప్రదేశ్ ర్యాగింగ్ నిషేధ చట్టం 1977 ప్రకారం బుద్ధిపూర్వకంగా ఒక విద్యార్థిని అవమానించినా, ఏడిపించినా, భయభ్రాంతులకు గురి చేసినా, బెదిరించినా, గాయపరిచినా, నిర్బంధించినా, అత్యాచార యత్నం చేసినా, అసహజమైన లైంగిక చర్యలకు లోను చే సినా, ఆత్మహత్యకు ప్రేరేపించినా, అది ర్యాగింగ్ కిందకు వస్తుంది. వీటికి ర్యాగింగ్ తీవ్రతను బట్టి 6 నెలల నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. జైలుశిక్ష పడిన విద్యార్థిని కాలేజీ నుంచి తొలగించడం, మరే కాలేజీలో చేరకుండా ఉత్తర్వులివ్వడం జరుగుతుంది. యాజమాన్యం విద్యార్థుల ఫిర్యాదులను పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ర్యాగింగ్‌ను ప్రోత్సహించినందుకు చట్టప్రకారం వారు కూడా శిక్షార్హులవుతారు. దీనికి సంబంధించి రాఘవన్ కమిటీ, యు.జి.సి; సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు. ఆల్ ది బెస్ట్. -
తను మేజర్ అయితే... మీ ప్రాబ్లెమ్ మైనర్ అవుతుంది!
మ్యారేజ్ కౌన్సెలింగ్ నేను నా క్లాస్‌మేట్‌ను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. పెద్దలకు ఇష్టం లేకుండా ఇద్దరం ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుని రిజిస్టర్ ఆఫీస్‌లో రిజిస్టర్ కూడా చేసుకున్నాము. ఇద్దరం గుజరాత్ వెళ్లి కొన్ని రోజులు కాపురం కూడా చేశాము. కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్ నుండి వాళ్ల పుట్టింటి వాళ్లొచ్చి, ఆ అమ్మాయిని బలవంతంగా లాక్కెళ్లిపోయారు. తర్వాత ఆ అమ్మాయితో డిక్లేర్ ది మ్యారేజ్ యాజ్ నల్ అండ్ వాయిడ్ అని... పెళ్లిని రద్దుచేయమంటూ కోర్టులో కేస్ ఫైల్ చేయించారు. ఆ అమ్మాయి మేజర్ కాదని, ఇంకా మైనర్ కాబట్టి మా పెళ్లి చెల్లదని వాదిస్తున్నారు. నేను ఆమె లేనిదే జీవించలేను. ఈ పరిస్థితుల్లో నేను ఏమి చేయాలి? - సుహాస్, కర్నూల్ మీకు తెలిసి మీ భార్య మేజర్ కదా. మీరూ అదే చెబుతూ కోర్టులో కౌంటర్ ఫైల్ చేయండి. ఆమె వయసును నిర్ధారించడానికి డాక్టర్ ఎగ్జామినేషన్ కోసం ఒక ఐ.ఎ. ఫైల్ చేయించండి. అదీగాక ఆమె వయసు నిర్థారణకు ఆమె టెంత్ క్లాస్ సర్టిఫికేట్ కూడా పనికి వస్తుంది. అది మీ దగ్గర ఉంటే కోర్టులో దాఖలు చేయవచ్చు. మీరు ఆమె మేజర్ అని నిరూపించగలిగితే చాలు. మీరు ఎలాగూ చట్టబద్ధంగా వివాహితులే. పైగా పెళ్లి రిజిస్టర్ కూడా అయింది కాబట్టి పెళ్లి రద్దు చేయడం చెల్లదు. మీ కేసు డిస్మిస్ అవుతుంది. ఆమెకు నిజంగా మీ మీద ప్రేమ ఉంటే మీతో కలిసి జీవించడానికి తప్పక వచ్చి తీరుతుంది. విచారించకండి, ధైర్యంగా కేస్ వాదించుకోండి. మది సంఘంలో బాగా పేరు ప్రఖ్యాతులున్న ధనిక కుటుంబం. మా వివాహాన్ని పెద్దలే కుదిర్చారు. మాకు ఇద్దరు పిల్లలు. 16 ఏళ్ల మా వైవాహిక జీవితంలో నేనెప్పుడూ నా భార్యను హింసించింది కానీ, బాధపెట్టింది కానీ లేదు. కానీ నా భార్య మాత్రం తన అనైతిక చర్యతో నన్ను మానసికంగా దెబ్బతీసింది. నా కూతురికి 14 సంవత్సరాలు, మా అబ్బాయికి 12 సంవత్సరాలు. ఈ ఎదిగిన ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని నా భార్య నేను ఇంటిలో లేని సమయంలో నా ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. నిజానికి ఈ విషయాన్ని గతంలోనే ఎంతోమంది నాకు చెప్పినా నేను నమ్మలేదు. కానీ, ఒకరోజు స్వయంగా నా కళ్లారా చూసిన తర్వాత నమ్మక తప్పలేదు. అదేమిటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా జవాబిచ్చింది. మరో విచిత్రం ఏమిటంటే నా తలిదండ్రులకు ముందే ఈ విషయం తెలుసట. అయితే ఈ సంగతి బయట పెట్టి నా మనసు వికలం చేయడం ఇష్టం లేక, పరువు మర్యాదలు పోగొట్టుకోవడం ఇష్టం లేకా నోరు నొక్కుకుని ఉన్నారట. ఇప్పుడు విషయం బయట పడిన తర్వాత నా తలిదండ్రులు ఆమె పుట్టింటి వారిని పిలిపించి వాళ్లముందే హితవు చెప్పారు. అప్పుడు మాత్రం అందరూ నంగిగా మాట్లాడుతూ సమాధానం దాటవేశారు. ఆ తర్వాత నా భార్య ఇంటిలో ఎవరూ లేనప్పుడు నన్ను, పిల్లల్ని వదిలేసి అతనితో కలిసి ఇంటిలోనుంచి వెళ్లిపోయింది. ఎంత వెదికినా దొరకలేదు. ఎంతో పరువుగల కుటుంబం మాది. ఈ సంఘటనతో మేము చాలా రోజుల పాటు తల ఎత్తుకుని తిరగలేకపోయాము. ఇది జరిగి ఐదేళ్లయింది. నేను ఆమెకోసం ఇంకా ఎదురు చూడటం వృథా అని, ఇంట్లో అందరూ నాకు మళ్లీ పెళ్లి చేయాలని, డైవోర్స్ తీసుకోమని బలవంత పెడుతున్నారు. నేను ఏమి చేయాలి? - శ్యామ్, హైదరాబాద్ మీరు వెంటనే లీగల్‌గా డైవోర్స్ కోసం కోర్టులో కేసు ఫైల్ చేయండి. అడల్టరీ గ్రౌండ్స్ కింద మీకు కచ్చితంగా విడాకులు మంజూరవుతాయి. పిల్లల కష్టడీ కోసం కేసు ఫైల్ చేయండి. వాళ్లు చెప్పిన దాని ఆధారంగానూ, తండ్రి ఎలాగూ పిల్లలకు సహజమైన సంరక్షకుడు కాబట్టి వారి కష్టడీ మీకే వస్తుంది. తర్వాత మీ జీవితాన్ని మీకు ఇష్టమైన విధంగా గడపవచ్చు. మా తలిదండ్రులకు మేము ఇద్దరం ఆడపిల్లలం, ఒక కొడుకు. ముగ్గురికీ పెళ్లయిపోయింది. నాన్నగారి వైపు వారు బాగా స్థితిమంతులు కావడం వల్ల మా ఇద్దరికీ బాగా కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. మాపెళ్లయిన కొద్దిరోజులకు తమ్ముడి పెళ్లయింది. అందరం సుఖంగా కాపురాలు చేసుకుంటున్నాము. నాన్న ఈ మధ్య సడెన్‌గా పోయారు. ఆయనకు మా ఇద్దరి ఆడపిల్లల మీద ఉన్న ప్రేమతో తన ఆస్తిని మూడు భాగాలుగా చేసి ముగ్గురికీ సరిసమానంగానూ, బ్యాంక్‌లో ఉన్న రెండు కోట్ల క్యాష్ డిపాజిట్లు తమ్ముడికీ చెందేలాగానూ వీలునామా రాశారు. అయితే వీలునామాను రిజిస్టర్ చేయలేదు. దాంతో తమ్ముడు అమ్మ దగ్గరున్న ఆ విల్లును దొంగ విల్లు అనీ, ఆ సిగ్నేచర్ నాన్నగారిది కాదనీ బుకాయిస్తూ మాకు ఆస్తి ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. మేము ఏం చేయాలిప్పుడు? - ముకుంద, హైదరాబాద్ మీరు మొదట మీ మేనమామలు, ఇతర సమీప బంధువులను మీ తమ్ముడి దగ్గర కూర్చోబెట్టి మంచి మాటల ద్వారా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నాన్నగారు ప్రభుత్వాధికారి అంటున్నారు కాబట్టి ఆయన సంతకాలు ఎన్నో చోట్ల ఉండే ఉంటాయి. వీలునామాలో ఉన్న మీ నాన్నగారి సంతకాన్ని వాటితో సరిపోల్చి చూడమనండి. అందుకు మీ తమ్ముడు ఒప్పుకోకపోతే ఎలాగూ మీ నాన్నగారి వీలునామా పైన ఇద్దరు సాక్షుల సంతకాలు ఉంటాయి కాబట్టి వారి సహకారంతో మీ ఇద్దరు అక్కచెల్లెళ్లు ‘డిక్లేర్ ది విల్ యాజ్ వ్యాలిడ్’ అంటూ ఒక పిటీషన్, మీ అంగీకారం లేనిదే ఆస్తిపాస్తులు అమ్మడానికి వీలు లేదని హెచ్చరిస్తూ ఒక ఇంజెంక్షన్ కేసును ఫైల్ చేయండి. ఈలోగా మీ లాయర్ సహకారంతో నాన్నగారి సిగ్నేచర్స్‌ను ఫోరెన్సిక్ లేదా హ్యాండ్ రైటింగ్ నిపుణుల వెరిఫికేషన్‌కు పంపితే వీలునామాలో మీ నాన్నగారి సంతకాలు అసలువో కాదో రూఢీ చేస్తూ రిపోర్ట్ వస్తుంది. దాని ఆధారంగా కోర్టు మీ పక్షాన తీర్పు ఇస్తుంది. కోర్టు తీర్పును మీ తమ్ముడు శిరసావహించవలసిందే కదా! కేస్ స్టడీ చక్కదిద్దుకోవడం మన చేతుల్లోనే... సుందరీ సుబ్బారావుల పెళ్లయి పదేళ్లయింది. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. పేరుకు తగ్గట్టు సుందరి చాలా అందంగా ఉంటుంది. సుబ్బారావు ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నాడు. ఓ రోజు సుబ్బారావు, అతని పిల్లలు స్కూలు నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం పెట్టి, తాళం చెవులు పక్కింటివాళ్లకి ఇచ్చి వెళ్లింది. లోపలికి వెళ్లి చూసే సరికి ఆమె తన నగలు, బట్టలతోబాటు కొంత డబ్బు కూడా తీసుకుని వెళ్లినట్లు అర్థమయింది. వెతకగా వెతకగా ఆమె తన క్లాస్‌మేట్‌తో కలిసి వెళ్లిపోయిందని తెలిసింది. దాంతో సుబ్బారావు హతాశుడయ్యాడు. గుండె రాయి చేసుకుని తన తల్లి సాయంతో పిల్లలను పెంచుకుంటూ ఎలాగో జీవిస్తున్నాడు. ఆమె వెళ్లిపోయి ఇప్పటికి ఏడెనిమిదేళ్లకు పైగానే అయింది. ఇటీవలే తల్లి చనిపోవడంతో పిల్లల పెంపకం చాలా కష్టమైపోయింది. మనసులో మాట చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు. దాంతో జీవితం దుర్భరంగా అనిపించింది. బంధువులు, శ్రేయోభిలాషుల సలహాతో మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. లాయర్ సూచన మేరకు నాట్ హర్డ్ ఫర్ 7 యియర్స్ అనే గ్రౌండ్ మీద డైవోర్స్ ఫైల్ చేశాడు. భార్య చిరునామా కూడా తెలియదు కాబట్టి పేపర్ పబ్లికేషన్ ద్వారా డైవోర్స్ ఫైల్ చేశాడు. ఆమె ఎక్స్‌పార్టీ అయింది కాబట్టి కోర్టు డైవోర్స్ మంజూరు చేసింది. ఆ తర్వాత తమ బంధువుల్లోనే ఒక పద్ధతైన అమ్మాయిని మళ్లీ పెళ్లి చేసుకుని హాయిగా భార్యాపిల్లలతో కలసి జీవనం సాగించాడు. ప్రపంచంలో కష్టాలెదురయేవాళ్లు చాలామంది ఉన్నారు. కష్టాలు ఎదురైనప్పుడు ఆత్మహత్యే పరిష్కారం కాదు. జీవితాన్ని కష్టాలకు ఎదురొడ్డి చక్కగా ఎలా మలుచుకోవచ్చో అనేందుకు ఇదొక ఉదాహరణ. ప్రేమ ధైర్యాన్నిస్తుంది. పరిస్థితులకు ఎదురు నిలిచి పోరాడే శక్తిని ఇస్తుంది. అయితే కొన్నిసార్లు ఆ శక్తి సరిపోదు. పెద్దలను ఎదిరించి పెళ్లయితే చేసుకోవచ్చు కానీ... చట్టం ముందు దాన్ని నిలబెట్టుకోవడం... పెద్ద సమస్య అయి కూర్చుంటుంది! అమ్మాయి మైనర్ అయినప్పుడు ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే అమ్మాయి, అబ్బాయి ఈ మేజర్, మైనర్ సమస్యల గురించి పెళ్లికి ముందే ఆలోచించాలి. నిశ్చల సిద్ధారెడ్డి అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ -
చేతులు కాలకముందే...
మ్యారేజ్ కౌన్సెలింగ్ దారం తెగిపోయాక ఎన్ని ముడులేసినా ప్రయోజనం లేదు. బంధం తెంపుకున్నాక తిరిగి అందులోకి ప్రవేశం లేదు. ప్రకృతి చెక్కిన అందమైన శిల్పం- కుటుంబం. తుదకంటా దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత భార్యాభర్తల మీదే ఉంది. సమస్య ఉందంటారా... అయితే పరిష్కారం ఉంది... మీనా తలిదండ్రులు దిగువ మధ్యతరగతికి చెందినవారు. కట్నమిచ్చి పెళ్లి చేసే స్తోమత లేదు. వీరి వద్దకు మధ్యవర్తుల ద్వారా ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి తలిదండ్రులు చాలా సంపన్నులనీ, అమ్మాయి బాగుంటే చాలనీ, కానీ కూడా కట్నం అక్కరలేదని చెప్పారు. దాంతో మీనా తలిదండ్రులు ఉబ్బితబ్బిబ్బయి, వెనకా ముందు విచారించకుండా పెళ్లి చేసేశారు. మీనా అత్తగారింటికి వెళ్లింది. మొదటి రాత్రి నుంచి, భర్త సందీప్ ఆమెతో ఎప్పుడూ మాట్లాడింది లేదు. సంసారం చేసిందీ లేదు. అత్తగారి పెత్తనంలో మీనా ఎప్పుడూ బిక్కుబిక్కుమంటూ గడిపేది. భర్తకు ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం ఉండేది. ఒకరోజు మీనా అత్తమామలు ఏదో అర్జంటు పని మీద ఊరెళ్లారు. ఇంతలో మీనా భర్త సందీప్ కళ్లు తిరిగి పడిపోయాడు. మీనా పక్కింటి వారి సాయంతో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. ఆయన చెప్పిన అన్ని టెస్టులూ చేయించింది. వాటిలో అసలు బండారం బయటపడింది. సందీప్ చాలా కాలంగా ఎయిడ్స్‌తో బాధపడుతున్నాడని తెలిసింది. డాక్టర్ ముందు సందీప్ ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు. తనకు అంతకు ముందే పెళ్లయిందని, ఈ విషయం బయట పడటం వల్లే తాము విడిపోయామని, తల్లి బలవంతం వల్లే తాను ఈ పెళ్లికి ఒప్పుకోవలసి వచ్చిందని చెప్పాడు. విషయం తెలిసి మీనా, ఆమె తలిదండ్రులు అవాక్కయారు. తేరుకున్నాక సందీప్ తలిదండ్రులను పిలిపించి, బంధువుల ముందు పంచాయితీ పెట్టించారు. అబ్బాయికి ఎయిడ్స్ ఉన్న మాట నిజమేనని, అయితే తమ తదనంతరం అతన్ని చూసుకునే వారు ఉండరనే భయం వల్లనే ఈ విషయాన్ని దాచి ఈ పెళ్లి చేశామని ఒప్పుకున్నారు. మీనా తలిదండ్రులు, బంధువులు కలిసి వెంటనే దగ్గరలోని లాయర్‌ను కలిశారు. ఆయన సలహా మేరకు వారి పెళ్లయి ఆరునెలలే అయింది, వారి మధ్య వైవాహిక బంధం ఏమీ ఏర్పడలేదు కాబట్టి వారి వివాహాన్ని నల్ అండ్ వాయిడ్‌గా డిక్లేర్ చేసి, రద్దు చేయవలసిందిగా కోరుతూ కోర్టులో డైవోర్స్ పిటిషన్ వేశారు. దానికి తోడు అబ్బాయి స్థితిమంతుడు కాబట్టి మీనాకు పర్మనెంట్ ఎలిమనీ (శాశ్వత భరణం) కూడా ఇప్పించమని కోర్టు వారిని కోరారు. మీనా సమస్యను సానుభూతితో అర్థం చేసుకున్న కోర్టు వెంటనే వారి వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అమ్మాయి లేదా అబ్బాయి తలిదండ్రులు అవతలి వారి విద్యార్హతలు, ఉద్యోగం, కుటుంబ చరిత్ర, ఆర్థిక స్థితిగతులు, మెడికల్ రికార్డులు వంటి వాటిని కూడా పరిశీలించవలసిన అవసరాన్ని ఈ కేసు ద్వారా మనకు తెలుస్తోంది. ప్రశ్న - జవాబు మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను వదిలి, గత నాలుగేళ్లుగా వేరే స్త్రీతో కలిసి జీవిస్తున్నాడు. ఆవిడతో వివాహ బంధం లేకుండా సహజీవనం సాగిస్తున్నాడు. మాకు ఇద్దరు ఆడపిల్లలు. దురదృష్టవశాత్తూ నేను ఇంట్లో లేని సమయంలో నా చిన్న కూతుర్ని తీసుకుని ఆయన వెళ్లిపోయాడు. ప్రస్తుతం మా చిన్నపాప ఆయనతోనే ఉంటోంది. ఆ పాప అంటే నాకు చాలా ఇష్టం. తనని నా దగ్గరకు పంపమని ఎన్నిసార్లు బతిమాలుకున్నా పంపడం లేదు. పాప ఇప్పుడు 11వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. త్వరలో పెద్దపిల్ల కాబోయే ఆ పాపకు ఈ సమయంలో తల్లి అవసరం ఎంతో ఉంటుంది. పాప నా దగ్గరకు వచ్చేస్తానని ఏడ్చినా ఆయన పంపడం లేదు. నేను ఏం చేయాలి? - జమున, శంషాబాద్ మీరు వెంటనే కష్టడీ ఆఫ్ చైల్డ్ కోసం కేసు వేయండి. ఫ్యామిలీ కోర్టులో జడ్జిగారు మీ ఇద్దర్నీ, పాపను విడివిడిగా విచారించి పాప కష్టడీ ఎవరికి ఇవ్వాలో నిర్ణయించుకుంటారు. చట్టప్రకారం తండ్రే పిల్లలకు సహజమైన సంరక్షకుడు. అయినా గానీ, ఆడపిల్లకు ఈ వయసులో తల్లి అవసరం చాలా ఉంటుంది కాబట్టి, పాప అభిప్రాయానికి విలువ ఇచ్చి ఆమె ఎవరి దగ్గర ఉండాలనుకుంటే (తల్లి, తండ్రి ఇద్దరిలో) వారికి ఆ కష్టడీ ఇవ్వడం జరుగుతుంది. నాది క్యాంప్‌లు ఎక్కువ తిరిగే ఉద్యోగం. పెళ్లై 15 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల బాబు. నేను లేని సమయంలో నా భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. మా తలిదండ్రులు అదేమని ప్రశ్నిస్తే, అరిచి గొడవపెట్టి వారి నోరు మూయించేది. ఎంతోకాలం పాటు జరిగిన ఈ వ్యవహారాన్ని ఓ రోజు నా కళ్లతో చూశాక నమ్మక తప్పలేదు. ఆ రోజు పెద్దలందరి ముందు ఆమె తలిదండ్రులు, అన్నదమ్ములను పిలిచి పంచాయితీ పెట్టగా అది నిజమే అని ఒప్పుకుని క్షమాపణ వేడుకుంది. ఇంకెప్పుడూ అలా చెయ్యనని పెద్ద మనుషుల సమక్షంలో స్వయంగా కాగితంపై రాసి ఇచ్చింది. కానీ నా మనస్సు విరిగిపోయింది. నాకు ఇక ఆమెతో కలిసి జీవించాలనిపించడం లేదు. నేను ఏమి చేయాలి? - కరుణాకర్, చౌటుప్పల్ మీరు మీ జ్యూరిస్‌డిక్షన్‌లోని జిల్లా కోర్టులో వీటన్నింటినీ కూలంకషంగా వివరిస్తూ, ఇల్లిసిట్ ఇంటిమసీ గ్రౌండ్ చూపెడుతూ, క్రూయల్టీ కింద విడాకులకు కేసు ఫైల్ చేయండి. బాబును ఎలాగూ మీరు మీతోనే ఉంచుకోవడానికి సిద్ధమయ్యారు కాబట్టి, కష్టడీ మీకే వస్తుంది. మా వివాహమై పది సంవత్సరాలు అయింది. మేమిద్దరం అమెరికాలోనే ఉంటున్నాము. కొన్ని కారణాల వల్ల మేము ఇండియాలో డైవోర్స్ తీసుకోవాలనుకుంటున్నాము. నేను ఇండియాకు రాగలను కానీ, ఆరు నెలల వరకూ ఆయనకు తీరిక లేదు. నేనేం చేయాలి? - విద్య, కాలిఫోర్నియా మీరు ఇండియాలో డైవోర్స్ పిటిషన్ వేయాలంటే మీరు వివాహం చేసుకున్న ప్లేస్, చివరగా మీరు కలిసి జీవించిన ప్లేస్‌లో లేదా భార్య ఎక్కడ ఉంటోందో, అక్కడి జ్యూరిస్డిక్షన్లో కేసు ఫైల్ చేయవచ్చు. మీకు పెళ్లయినదీ, మీరిద్దరూ కలిసి చివరలో జీవించినదీ హైదరాబాద్‌లోనే కాబట్టి, మీరు హైదరాబాద్‌లోనే డైవోర్స్ అప్లికేషన్ ఫైల్ చేయవచ్చు. మీరు ఇద్దరూ పరస్పర అంగీకారంతో పిటిషన్ ఫైల్ చేస్తున్నారు కాబట్టి, పిటిషన్లో సంతకాలు పెట్టి మీ సమక్షంలో ఫైల్ చేయవచ్చు. మీ భర్త ఇక్కడకు రాలేరంటున్నారు కాబట్టి పిటిషన్ కాపీ ఆయనకు కొరియర్లో పంపి, ఆయన సంతకాలు అక్కడ లోకల్ అడ్వొకేట్‌తో అటెస్టేషన్ చేయించి. తెప్పించుకుని ఇక్కడ ఫైల్ చేయవచ్చు. ఆరునెలలు పూర్తి కాగానే మళ్లీ మరోసారి ఇద్దరూ కోర్టులో జడ్జిగారి ముందు హాజరు కావాల్సి ఉంటుంది. అప్పుడు ఎవిడెన్స్ అఫిడవిట్ వేస్తే మీకు డైవోర్స్ గ్రాంట్ అవుతాయి. మీ సౌలభ్యాన్ని బట్టి అందుబాటులో ఉన్న అవకాశాన్ని వినియోగించుకోండి. నాకు పెళ్లయి ఆరు నెలలవుతోంది. నా భర్త స్క్రిజోఫీనియాతో బాధపడుతున్నారు. పెళ్లికి ముందు అది దాచి పెళ్లి చేశారు. నేను ఉన్నతోద్యోగంలో ఉన్నాను. నా జీవితం పాడయిందని నా తలిదండ్రులు, అన్నదమ్ములు బాధపడని క్షణం లేదు. ఆయన రోజూ మందులు వాడుతున్నారు. ప్రిస్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి. ఎందుకు పెళ్లి చేశారని అత్తమామలని అడిగితే, పెళ్లి చేస్తే పిచ్చి తగ్గుతుందని ఎవరో చెబితే చేశామంటున్నారు. వ్యాధి మూడవ దశలో వుంది. అంత తొందరగా నయం కాదని డాక్టర్లు చెబుతున్నారు. నాకు అతనితో కలిసి జీవించాలని లేదు. నేను ఏం చేయాలి? - అరవింద, హైదరాబాద్ మీరు వెంటనే మెడికల్ గ్రౌండ్స్ అన్నీ జత చేస్తూ వ్యాధి విషయం దాచి, మోసపూరితంగా పెళ్లి చేశారని వివరించండి. మ్యారేజ్‌ను నల్ అండ్ వాయిడ్‌గా డిక్లేర్ చేయమని కోరుతూ ఒక సంవత్సరంలోపు డైవోర్స్ పిటిషన్ ఫైల్ చేయండి. అతని వ్యాధి వల్ల సంసారం చేయడం కష్టతరం కాబట్టి మీకు డైవోర్స్ గ్రాంట్ అవుతుంది. తర్వాత మీ జీవితాన్ని మీ ఇష్టం వచ్చినట్లు ప్లాన్ చేసుకోవచ్చు. నిశ్చల సిద్ధారెడ్డి అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ -
కృష్ణుడు కాదు.. రాధ..!
మ్యారేజ్ కౌన్సెలింగ్ తీసేందుకు కాదు మూడుముళ్లు.వెనుకంజ వేసేందుకు కాదు... ఏడడుగులు. దాంపత్యంలో కలతలు వస్తుంటాయి... పోతుంటాయి.అర్ధం చేసుకుంటే ఏ స్పర్ధా సమస్య కాదు. నిజానికి సమస్యలు ఉన్నప్పుడే పరిష్కారాలు పుట్టుకొస్తాయి. పదిమందికీ అవి సమాధానాలవుతాయి. ప్రియాంక, రాధాకృష్ణ భార్యాభర్తలు. వారి పెళ్లయి దాదాపు ఏడాది కావస్తోంది. అయితే ఒక్కసారి కూడా రాధాకృష్ణ భార్యను ప్రేమగా దగ్గరకు తీసుకోలేదు. శారీరకంగా కలవలేదు. పగలంతా బాగానే ఉండేవాడు కానీ, రాత్రి బెడ్రూమ్లో చిత్రవిచిత్రంగా ప్రవర్తించేవాడు. ప్రియాంక చీర కట్టుకునేవాడు, బొట్టుపెట్టుకునేవాడు. కాళ్లకు పట్టీలు పెట్టుకుని డ్యాన్స్ చేసేవాడు. ఆమెను మగవాడిలా తయారవమనేవాడు. భర్త పేరులో కృష్ణుడు లేడు. రాధ మాత్రమే ఉంది అని అర్థం చేసుకుంది ప్రియాంక. అంతా తన కర్మ అని సరిపెట్టుకుంది. ఈ విషయాన్ని ఎవరితోటీ చెప్పలేదు. మనసులోనే ఉంచుకుని, తనలో తనే కుమిలిపోతుండేది. అయితే ఆమె అత్తమామలు మాత్రం పెళ్లయి, కాపురానికి వచ్చి నెల దాటినప్పటినుంచే ఆమె నెల తప్పడం కోసం ఆత్రంగా ఎదురు చూసేవాళ్లు. ప్రతి నెలా ఆమెకు నెలసరి రాగానే నిరుత్సాహ పడిపోయేవారు. ఆరు నెలలు గడిచేసరికి కోడలు గొడ్రాలేమోనని అనుమానపడి, సూటీపోటీ మాటలతో వేధించేవారు. తమ కుమారుడు ప్రయోజకుడే కాని, లోపమల్లా కోడలిలోనే ఉందని వారంతట వారే నిర్థారించుకుని, సంతానం కలగడం కోసం ప్రియాంక చేత రకరకాల నాటుమందులు, పసర్లు మింగించేవారు. ఆ మందులు మింగీ మింగీ ప్రియాంకకు జీవితం మీద విరక్తి పుట్టేది. ఇంతలో ఓ రోజు భర్త జ్వరం, వాంతులు, విరోచనాలతో బాధపడుతుండడంతో బలవంతాన హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. పరీక్షలలో అతను హెచ్.ఐ.వి. పాజిటివ్ అని తేలింది. అప్పటి వరకు ఉగ్గబట్టుకుని ఉన్న ప్రియాంక అసలు విషయాన్ని అప్పుడు బయట పెట్టింది. ప్రియాంక తలిదండ్రులు, సోదరులు కలిసి విషయాన్ని తెలియజేస్తూ కోర్టుకు వెళ్లారు. పెళ్లయి ఏడాది గడిచినా, శారీరకంగా కలయిక జరగడకపోవడం, పైగా భర్తకు ఎయిడ్స్ ఉందని నిర్థారణ కావడంతో ఫ్యామిలీ కోర్టు వెంటనే వారికి విడాకులు మంజూరు చేయడమే కాక, పెళ్లిలో కట్టకానుకలు, ఇతర లాంఛనాల కింద ప్రియాంక తలిదండ్రులు ఖర్చుపెట్టిన సొమ్మంతటినీ వడ్డీతో సహా అత్తమామల నుంచి తిరిగి ఇప్పించింది. జరిగినదంతా మర్చిపోయి, ప్రియాంక మళ్లీ పెళ్లి చేసుకుని, భర్తతో హాయిగా ఉంది. ఇప్పుడు ఆమెకు ఆరునెలల బాబు. ప్రశ్న - జవాబు:- నేను ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిని. నా పై అధికారి ప్రవర్తన ఏమీ బాగుండట్లేదు. పనికి సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఇంట్లో ఉన్నా మెసేజ్‌లు వస్తున్నాయి. వారాంతంలో ఈ సమస్య మరీ అధికంగా ఉంటోంది. ఈ మెసేజ్‌లు మా వారి కంటపడితే ఏమవుతుందో ఏమో అనే భయంతో ఫోన్‌ను ఆయన కంటపడకుండా దాస్తున్నాను. దీంతో ఆయన నన్ను తీవ్రంగా అనుమానిస్తున్నారు. ఈ సమస్య మూలంగా మనశ్శాంతి కోల్పోయాను. ఆఫీస్‌కు వెళ్లాలంటేనే భయంగా ఉంటోంది. స్నేహితులతో చెబితే, ఉద్యోగంలో ఇవన్నీ మామూలేనంటున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? అతనికి బుద్ధి చెప్పేదెలా? - శ్రీజ, ఈమెయిల్ మీరు పనిచేసే ఆఫీసులో ఒక కౌన్సెలింగ్ బెంచ్ ఏర్పాటు చేసి ఉందా, లేదా ముందు తెలుసుకోండి. ఎందుకంటే పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురి కాకుండా ప్రతి కార్పొరేట్ కార్యాలయంలోనూ ఒక బెంచ్ ఉంటుంది. ఆ బెంచ్‌కి ముగ్గురు మహిళలు ప్రాతినిధ్యం వహిస్తారు. వారిలో ఒక మహిళా కౌన్సెలర్ (స్వచ్ఛంద సేవకురాలు), ఆఫీసుకు సంబంధించిన ఒక మహిళా ఉద్యోగి, మరొక మహిళా న్యాయవాది సభ్యులుగా ఉంటారు. వేధింపులకు గురయ్యే మహిళ ఆ బెంచ్‌కు ఫిర్యాదు చేస్తే వారు తగిన చర్యలు తీసుకొని, ఆ పై అధికారులకు విషయం తెలియజేసి మీకు న్యాయం జరిగేలా చూస్తారు. వేధింపులకు సంబంధించిన విషయాన్ని ఫిర్యాదు చేసినప్పుడు ఆ ప్రభావం పనిపై పడకూడదు. అంటే ప్రమోషన్లు రాకుండా అడ్డుకోవడం, ట్రాన్స్ఫర్లు చేయడం.. వంటి ప్రతీకార చర్యలేవీ చోటుచేసుకోకూడదు. అంత రహస్యంగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలి. ఒకవేళ అలాంటి బెంచ్ మీ ఆఫీసులో లేకపోతే ఆ పై అధికారులకు ప్రస్తుత పరిస్థితిని తెలియజేస్తూ విజ్ఞప్తి పంపండి. రాతపూర్వకంగానూ ఫిర్యాదు చేయవచ్చు. మరో విషయం.. ఇన్నాళ్లూ ఈ విషయాన్ని మీ భర్తకు తెలియజేయకుండా ఉండటం సరికాదు. అందుకే మీ కాపురంలో అనుమానం చోటుచేసుకుంటోంది. మొదటి మెసేజ్‌కే మీరు ఈ సమస్యకు పుల్‌స్టాప్ పెట్టి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఇప్పటికైనా ఈ విషయాన్ని మీ భర్తకు తెలియజేయండి. మా పెళ్లయి రెండున్నర సంవత్సరాలైంది. అయితే ఇంతవరకూ మేము శారీరకంగా ఒకటి కాలేకపోయాము. దగ్గరవుదామని నేను ప్రయత్నించిన ప్రతిసారీ ఆమె ఏదో ఒక వంకతో నన్ను దూరం పెడుతోంది. ఆమె మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఇంకా ఈ దూరాన్ని భరించడం నా వల్ల కాదు. ఆమెకు విడాకులివ్వాలనుకుంటున్నాను. ఎలా ప్రొసీడవ్వాలి? సలహా ఇవ్వండి. - బి.కుమార్, ఆదోని భార్య లేదా భర్తతో శారీరక సంబంధానికి ఉద్దేశ్యపూర్వకంగా దూరంగా ఉన్నట్లయితే, దానిని రుజువు చేయగలిగితే జీవిత భాగస్వామి నుంచి చట్టప్రకారం విడిపోవచ్చు. మీ భార్య మిమ్మల్ని దూరం పెట్టడానికి రెండు కారణాలు ఉండి ఉండవచ్చు. ఒకటి ఆమెకు మీరంటే ఇష్టం లే కపోవడం... రెండు... ఆమెకు శారీరకపరమైన లోపం ఏమైనా ఉండటం. కొందరు స్త్రీలలో ఫ్రిజిడిటీ అంటే సంసార జీవితమంటే విముఖత ఉండవచ్చు. వీటిలో సరైన కారణమేంటో తెలుసుకోండి. జీవిత భాగస్వామితో శారీరక సంబంధాన్ని తిరస్కరించడం కూడా క్రుయాలిటీ కిందికి వస్తుంది. కోర్టు దీనిని తీవ్రంగా పరిగణిస్తుంది. సంబంధిత ఆధారాలతో మీరు విడాకుల కోసం కోర్టుకు వెళ్లవచ్చు. కోర్టు మీ సమస్యను సానుభూతితో అర్థం చేసుకుని వెంటనే విడాకులు మంజూరు చేస్తుంది. నాకు ఐదేళ్ల పాప ఉంది. మేము డైవోర్స్ తీసుకుని రెండేళ్లయింది. మా పాపను చూడటానికి ఆయన నెలకొకసారి ఇంటికి వస్తుంటాడు. ఈ క్రమంలో మా మధ్య అవగాహన ఏర్పడింది. మా తప్పు మేము తెలుసుకున్నాము. మేము తిరిగి కలిసి ఉందామను కుంటున్నాము. అయితే ఒకసారి విడాకులు తీసుకున్న తర్వాత కోర్టు అనుమతి లేకుండా తిరిగి కలవటం సబబు కాదని మాకు తెలిసిన వాళ్లంటున్నారు. ఇది నిజమేనా? మేము ఏం చేయాలి? సలహా ఇవ్వండి. - పి. కవిత, కరీంనగర్ మీరు మంచి నిర్ణయమే తీసుకున్నారు. అయితే మీరు విన్నది నిజమే. ఒకసారి చట్టపరంగా విడిపోయారు కాబట్టి తిరిగి మీరు కలిసి ఉంటే అది సహజీవనం కింద వస్తుంది కానీ, చట్టబద్ధమైన బంధం కానేరదు. మీ పాప భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, తిరిగి మీ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు ఎదురయినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ప్రతి వివాహాన్నీ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలన్న చట్టాన్ని అనుసరించి, మీరు ఈసారి రిజిస్ట్రార్ ఆఫీస్‌లో రిజిస్టర్ చేసుకోండి. అప్పుడు మీ బంధానికి ఒక అర్థం, పవిత్రత వస్తాయి. మా పెళ్లయి నాలుగేళ్లయింది. ఆయన నన్ను బాగానే చూసుకుంటారు. అయితే ప్రతి విషయంలోనూ అమ్మ మాటే వింటాడు. ఇంటిలో ఏ చిన్న వస్తువు కొనాలన్నా, ఏమి కావాలన్నా అమ్మనే సంప్రదిస్తాడు తప్పితే నన్ను అడగడు. అన్నం కూడా అమ్మ పెడితేనే తింటాడు. నేను ఇది భరించలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తగిన సలహా ఇవ్వగలరు. -కె. రజని, భీమవరం అమ్మ మాట వినడం అనే ఆ ఒక్క లక్షణం తప్పించి మీ ఆయన మంచివాడే అని నువ్వే చెబుతున్నావు. కేవలం అమ్మ మాట లేదా భార్య మాట మాత్రమే వినాలి, అది తప్పించి వేరే వారి మాట వినకూడదు అని చట్టం ఎక్కడా చెప్పలేదు. అదేవిధంగా భార్యమాట వినని వారిని శిక్షించే హక్కు కూడా చట్టానికి లేదు. ఇది కేవలం మీ ఇద్దరి మధ్య అవగాహనపరమైన సమస్య. భవిష్యత్తులో నువ్వు కూడా అమ్మవి అవుతావు, నీ పిల్లలు నీ మాట వింటారు. అది తప్పు అని అప్పుడూ ఇప్పుడూ కూడా ఎవరూ చెప్పలేరు. అన్నింటికీ అమ్మ మాట వింటున్నాడు, అమ్మకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు అనే బాధతోనో, అసహనంతోనో అతన్ని దూరం పెట్టవద్దు. ప్రేమతో నీ మాట వినేలా చేసుకో. లేనిపోని చికాకులతో కాపురాన్ని కోర్టు గుమ్మం దాకా తీసుకెళ్లడం శ్రేయస్కరం కాదు. సాక్షి ఫ్యామిలీ కౌన్సెలర్స్: నిశ్చల సిద్ధారెడ్డి, అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్, అనురాధ, అడ్వకేట్, హైదరాబాద్ -
మారిన మగాడి కథ...
మ్యారేజ్ కౌన్సెలింగ్ ఆమె సహనం వహించాలి.. అతడు సర్దుకుపోవాలి. ఆమె అర్థం చేసుకోవాలి.. అతడు సంయమనం పాటించాలి. ఒకరి కోపం.. మరొకరి శాంతం. ఒకరి అలక.. మరొకరి సారీ. ఇవీ వివాహ బంధంలో అవసరం. లేని పక్షంలో వారం వారం సాక్షి ఫ్యామిలీ అందిస్తున్న ఈ కౌన్సెలింగ్ అవసరం.... అఖిల ఉన్నతోద్యోగంలో ఉంది. సమాజంలో ఆమెకు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ, భర్త వైఖరి మూలంగా ఆమె మనసుకు చాలా బాధ కలిగింది. వెంటనే అతనితో తెగతెంపులు చేసుకోవాలనుకుంది. విషయం ఏమిటంటే... ఇంజినీరింగ్ పూర్తి చేసిన అఖిలకు అప్పుడే మెడిసిన్ పూర్తి చేసి, సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకున్న అన్వేష్‌తో వివాహం జరిగింది. అయితే అప్పటికే అన్వేష్‌కు తన దగ్గర పని చేసే నర్సుతో అక్రమ సంబంధం ఉంది. ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక కూడా ఆ సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఆ సంగతి ఈ నోటా ఆ నోటా చెవిన పడ్డా నమ్మలేదు అఖిల. అయితే ఓసారి ఏదో పని ఉండి భర్త హాస్పిటల్‌కు వెళ్లిన అఖిల కంట పడింది వారి వ్యవహారం. దాంతో నమ్మక తప్పలేదు. తనపై అపరిమితమైన ప్రేమ కురిపించే భర్త అంతపని చేస్తాడనుకోలేదు. వెంటనే విడాకులు తీసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. హతాశుడైన అన్వేష్ ఆమె కాళ్లు పట్టుకున్నంత పని చేశాడు. విడాకులు ఇస్తే విషం తాగుతానన్నాడు. ఇంకెప్పటికీ ఆమె జోలికి పోనంటూ తలిదండ్రులు, అత్తమామలు తదితర పెద్దల సమక్షంలో కాగితం రాసిచ్చాడు. అందరూ సర్దిచెప్పడంతో అఖిల మనసు కొంత శాంతించింది. దాంతో విడాకుల నిర్ణయాన్ని విరమించుకుంది. అయితే ఆ తర్వాత కొద్దికాలానికే అన్వేష్ తానిచ్చిన మాట తప్పాడు. ఈసారి అఖిల విషయాన్ని తేలిగ్గా తీసుకోదలచుకోలేదు. వెంటనే కోర్టులో విడాకుల పిటిషన్ వేసింది. కోర్టు నిబంధనల ప్రకారం ఆరునెలలపాటు ఇద్దరూ కలిసే ఉన్నారు. మొదట్లో ఎడమొహం పెడమొహంగా ఉన్నా, ఆ తర్వాత అతనిలో క్రమంగా మార్పు రావడం మొదలయింది. తాను చేసిన పనికి తీవ్రంగా పశ్చాత్తాప పడ్డాడు. ఇంతలో అఖిలకు విపరీతమైన జ్వరం వచ్చింది. ఒక డాక్టర్‌గా మందులిచ్చాడు. భర్తగా సేవలు చేశాడు. ఇద్దరి మధ్యనా ఒక అవగాహన ఏర్పడింది. ఇంతలో ఇద్దరికీ విడాకులు మంజూరవుతున్నట్లు లాయరు ద్వారా కబురు తెలిసింది. అయితే ఈసారి అన్వేష్ నిజంగానే మారినట్లు అఖిలకు అర్థమైపోయింది. పిల్లలు చూస్తే పెద్దవాళ్లవుతున్నారు. తండ్రి అంటే వారికి అపరిమితమైన ఇష్టం. ఆ ఒక్క బలహీనత తప్ప అఖిల్ కూడా తనను ప్రేమగానే చూసుకుంటాడు. తాము విడిపోతే ఇద్దరి మధ్యనా అనవసరంగా పిల్లలు నలిగిపోవడం ఎందుకనుకుంది. అంతే! తాము పరస్పర అవగాహనకు వచ్చామనీ, విడాకులు వద్దనీ, కలిసే ఉండాలనుకుంటున్నామనీ విత్‌డ్రాయల్ పిటిషన్ వేశారు. కోర్టు అందుకు సమ్మతించింది. కథ సుఖాంతమైంది. ప్రశ్న - జవాబు నా భర్త, నేను విడాకుల కోసం కోర్టులో పిటిషన్ ఫైల్ చేశాము. కేసు పెండింగ్‌లో ఉంది. నా భర్త మంచి జీతం వచ్చే ప్రభుత్వోద్యోగి. పెద్ద పాపకు పెళ్లి కుదిరింది. రెండోపాప ఇంజినీరింగ్ చేస్తోంది. పెద్దపాపకు పెళ్లి ఖర్చులు, రెండోపాపకు చదువు ఖర్చు నా తలకు మించిన పని. అయితే నేను ఆయన నుంచి భరణం కోరవచ్చా? - జలజ, బెంగళూరు మీ భర్తకు మంచి జీతం వస్తుందంటున్నారు కదా, పెళ్లి ఖర్చులు, పెళ్లి పత్రిక జత చేస్తూ కోర్టులో ఫైల్ చేయాలి. అలాగే రెండో పాప ఫీజు నోటీసులు కూడా కోర్టులో ఫైల్ చేయాలి. కొంచెం ఆలస్యమైనా కోర్టు నుంచి మీకు సానుకూలంగా ఆర్డర్ వస్తుంది. నేను, నా భర్త కొన్ని కారణాల వల్ల కలసి ఉండటానికి ఇష్టపడక అనేక గొడవల తర్వాత మ్యూచివల్ కన్సెంట్ డైవోర్స్కోసం కోర్టులో కేస్ ఫైల్ చేశాము. ఇప్పటికి మూడు నెలలయింది. అయితే మా పెద్దల సలహాలు, సూచనలతో మనసు మార్చుకుని కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాము. ఇప్పటికే విడాకుల పిటిషన్ కోర్టులో ఉంది కదా, మేము దాన్ని ఏ విధంగా విత్ డ్రా చేసుకోవాలి? - మాధురి, గుంటూరు అసలు ఇటువంటి దానికోసమే అంటే విడిపోవాలనుకున్న వారు మనసు మార్చుకుని, తిరిగి కలవడం కోసమే కోర్టు ఆరు నెలలపాటు కలిసి ఉండాలని చెబుతుంది. మీరు కలసి ఉండాలని నిశ్చయించుకున్నారు కాబట్టి, మీరు వెంటనే కోర్టు తీర్పు వెలువడేలోగానే మీ విడాకుల పిటిషన్‌ను విరమించుకోవాలనుకుంటున్నామని తెలియజేస్తూ, కేసు విత్‌డ్రా చేసుకుంటున్నట్లుగా రాసివ్వండి. కోర్టు మీ కేసు కొట్టేస్తుంది. విష్ యు ఆల్ ది బెస్ట్. నా భార్య అకారణంగా నా మీద కోపంతో రెండేళ్ల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయింది. నిజానికి నా కుటుంబమంటే నాకు వల్లమాలిన ప్రేమ. మాకు 3, 4 సంవత్సరాల వయస్సున్న పిల్లలున్నారు. నాకు పిల్లలను చూడాలని ఉంది. నా భార్యను, పిల్లలను తిరిగి మా ఇంటికి తెచ్చుకోవడానికి నేను చట్టపరంగా ఏమైనా చెయ్యవచ్చా? - మోహన్, వరంగల్ భార్య, పిల్లలంటే అంత ప్రేమ ఉన్న మీరు ఇంత కాలంగా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? వెంటనే మీ ఫ్యామిలీ కోర్టులో కాపురానికి రావలసిందిగా మీ భార్యపై సెక్షన్ 9, రెస్టిట్యూషన్ ఆఫ్ కన్జూగల్ రైట్స్ కింద ఒక కేసును, పిల్లల కోసం కస్టడీ ఆఫ్ చైల్డ్ కింద ఒక కేసు ఫైల్ చేయండి. అంతకంటే ముందు మీ ఆవిడతోనూ, పెద్దలతోనూ సామరస్యంగా మాట్లాడి ఒప్పించడానికి ప్రయత్నించండి. అప్పటికీ ఒప్పుకోని పక్షంలో కోర్టులో కేసు ఫైల్ చేయండి. కష్టడీ ఆఫ్ చైల్డ్ కేసులో విజిటేషన్ రైట్స్ కింద వారానికో, పదిరోజులకో ఒకసారి పిల్లలను చూడడానికి అనుమతి ఇవ్వమని చెప్పి, కోర్టులో ఒక ఐ.ఎ. వెయ్యండి. మీకు పిల్లలను చూసే అవకాశం కోర్టు తప్పక కల్పిస్తుంది. మన చట్టప్రకారం ఫాదర్ బీయింగ్ నేచురల్ గార్డియన్ మీకు పిల్లలను చూసే అవకాశం తప్పక కలుగుతుంది. బాధ పడకుండా ప్రయత్నించి చూడండి. నేను, నా భార్య ఇరవైఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకుని బెహ్రయిన్‌లో ఉంటున్నాము. అయితే కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకోవాలనుకుం టున్నాము. ఇద్దరం క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి చేసుకున్నాము. మా ఇద్దరి పేరెంట్స్ ఇండియాలోనే ఉన్నారు. ఇద్దరికీ సెలవు దొరకదు. విడాకులకెలా అప్లై చేసుకోవాలి? - ఆల్బర్ట్, బెహ్రయిన్ మీ ఇద్దరూ ఇండియాలోని అడ్వకేట్‌తో మాట్లాడి మ్యూచువల్ కన్సెంట్ కింద విడాకులకు అప్లై చేయవచ్చు. మీ పేరెంట్స్‌లో ఒకరికి జీపీఎ ఇవ్వాల్సి ఉంటుంది. కోర్టు అనుమతి పిటిషన్ తీసుకుని, డైవోర్స్ మెయిన్ పిటిషన్తోబాటు జీపీఎ, కోర్టు పర్మిషన్ పిటిషన్ అంది, మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ అడ్వకేట్ దగ్గర నోటరీ చేయించుకుని, అవి తిరిగి ఇండియా పంపించి, జీపీఏ ద్వారా కోర్టులో మ్యూచువల్ డైవోర్స్‌కు ఫైల్ చేయవచ్చు. ఆరునెలల తర్వాత ఎవిడెన్స్ అఫిడవిట్ కోర్టులో దాఖలు చేసేటప్పుడు మాత్రం మీ ఇద్దరి హాజరూ కోర్టులో తప్పనిసరి. కాబట్టి మీ ఇద్దరూ కోర్టులో హాజరు కావలసి ఉంటుంది. నిశ్చల సిద్ధారెడ్డి అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్, సికింద్రాబాద్